Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

2 రీతుల్లోనూ సర్పంచ్ ఎన్నిక?

villaga

3 వేల జనాభాలోపు పంచాయతీల్లో ప్రత్యక్షం, ఆ పైవాటిలో పరోక్షం?

15 సవరణలతో కొత్త పంచాయతీరాజ్ బిల్లు రూపొందినట్లు సమాచారం
సర్పంచ్‌కి కనీస విద్యార్హతను తప్పనిసరి చేసే సూచన
గిరిజన పంచాయతీల్లో విద్యావంతుల లభ్యత కష్టమే

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త పంచాయతీరాజ్ చట్టంలో సర్పంచ్ ఎన్నిక ప్రత్యక్షమా పరోక్షమా అనే విధాన నిర్ణయం వెలువడనున్నందున స్థానిక నేతల్లో గుబులు మొదలైంది. పల్లెల్లో గూమిగూడిన ప్రతి చోటా ఇదే ప్రధాన చర్చగా మారింది. సర్పంచ్‌ను ప్రత్యక్షంగా ఎన్నుకునే ప్రస్తుత పద్ధతికి స్వస్తి చెప్పి పరోక్ష పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తుండడం తో ఉత్కంఠ పెరుగుతోంది. ప్రత్యక్ష పద్ధతిలోనే సర్పంచ్ ఎన్నికలు ఉండాలనే ఎక్కువమంది కోరుకుంటున్నారు. పరోక్ష ఎన్నికలైతే క్యాంపు రాజకీయా లు, రాజకీయ కక్షలు, వ్యక్తిగత విద్వేషాలు చోటుచేసుకుంటాయని భయపడుతున్నారు.
సర్పంచ్ ఎన్నిక విధానంలో రెండు పద్ధతులు..?
కొత్త పంచాయతీరాజ్ చట్టంలో సర్పంచ్ ఎన్నిక విధానం ప్రత్యక్ష, పరోక్ష రెండు పద్ధతుల్లోనూ ఉండబోతోందని తెలిసింది. 5 వేల జనాభాలోపు ఉన్న పం చాయతీలకు ప్రత్యక్షంగా, అంత కంటే ఎక్కువ ఉన్న పంచాయతీల్లో పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే చివరి నిర్ణయమా లేక చివరి నిముషంలో ఇంకేమైనా మార్పులు ఉంటాయా అనే సందేహాలూ లేకపోలేదు.
15 సవరణలు..? సాధ్యాసాధ్యాలపైనా సందేహాలు
పాత పంచాయతీరాజ్ చట్టానికి 15 సవరణలు చేసి కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించినట్లు సమాచారం. వార్డుల
రిజర్వేషన్ల మార్పులోనూ సవరణ ఉండబోతోందని సమాచారం. వ్యక్తుల రిజర్వేషన్ల (సామాజికవరగం) ఆధారంగా పై పదవుల్లో బెర్తులు కల్పించే విధానాన్ని అనుసరించనున్నట్లు తెలిసింది. అంటే ఎస్‌సి లేదా ఎస్‌టి అభ్యర్థులు సాధారణ నియోజకవర్గం నుంచి గెలుపొందినా జడ్‌పిటిసికి అర్హత పొందడంలో వారి సామాజికవర్గానికి పరిగణనలోకి తీసుకునేలా కొత్త చట్టంలో వెసులుబాటు కల్పించినట్లు సమాచారం. కేంద్రం నుంచి నేరుగా పంచాయతీలకు విడుదలయ్యే నిధులను ఇక నుంచి రాష్ట్ర ఖాతాకు అందిస్తే స్థానిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రాధాన్యతా క్రమంలో వాటిని స్థానిక సంస్థలకు చేరవేసేలా కొత్త చట్టంలో పేర్కొన్నట్లు తెలిసింది. సర్పంచి అధికారాల అమలు విషయం సాధ్యాసాధ్యాలపై కూడా స్థానిక స్థాయిలో ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. సర్పంచి నిధులను దుర్వినియోగం చేస్తే అతనిని పదవి నుంచి తొలగించే అధికారాన్ని కొత్త చట్టంలో పొందుపర్చనున్నట్లు వార్తలు రావడమే ఈ చర్చలకు కారణం. ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్‌ను తొలగించడం రాజ్యాంగపరంగా చెల్లుబాటవుతుందా అనే స్థాయి వరకు ఈ చర్చలు జరుగుతున్నాయి.
విద్యార్హత విషయంలోనూ టెన్షన్ : సర్పంచ్‌కు కనీస విద్యార్హత ఉండాలన్న అంశంపై కొత్త చట్టంలో ఎలాంటి మార్పులు ఉంటాయోననే భయం కూడా స్థానిక నేతల్లో ఉంది. పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హతను తప్పనిసరి చేయాలని గతంలో సుప్రీంకోర్టు సూచించింది. చెక్‌పవర్‌తో పాటు కొన్ని కీలక అధికారాలు సర్పంచికి ఇస్తున్నందున కొత్త చట్టంలో కనీస విద్యార్హతను తప్పనిసరి చేసే ఆలోచనను ప్రభుత్వం చేసినట్లు వార్తలు వెలుబడ్డాయి. ఇప్పటికే సర్పంచి పదవికి కనీస విద్యార్హత అమలవుతున్న హర్యానా, రాజస్థాన్‌లలో అమలవువుతున్న తీరు, ఎదురవుతున్న ఇబ్బందులను పరిశీలించింది. గిరిజన తెగలు ఉండే తండాల్లో కనీస విద్యార్హత గల వారు తక్కువ కాబట్టి ఎస్టీల రిజర్వ్ స్థానాల్లో విద్యార్హతలు లేని వారే అధికంగా ఉన్నారు. కొత్తగా తండాలు పంచాయతీలుగా చేస్తున్నందున కనీస విద్యార్హత ఉన్న అభ్యర్థులు లభించడం కష్టమేననే చర్చలూ జరుగుతున్నాయి.

Comments

comments