Home జాతీయ వార్తలు మోడీకి సౌదీ చమురు దెబ్బ

మోడీకి సౌదీ చమురు దెబ్బ

modi

న్యూఢిల్లీ/దుబాయ్: ప్రధాని మోడీకి సౌదీ దెబ్బ పడింది. చమురు ధరల సమస్య క్రమేపీ సంక్షోభంగా మారుతోంది. ప్రధాన చమురు ఉత్పత్తి దేశం అయిన సౌదీ అరేబియా వివిధ కారణాలతో దశలవారిగా వేగంగా ముడిచమురు ధరలను పెంచుతోంది. ఈ నిత్యావసర ఇంధన సరుకు చివరికి బ్యారెల్ ధరను 80 డాలర్ల ఆంక్షలకు మించి పెంచాలని సౌదీ కంపెనీలు నిర్ణయించుకున్నాయి. దీనితో అత్యధికంగా చమురు అవసరాలకు గల్ఫ్ దేశాలపై ఆధారపడే భారత్‌లోని చమురు సంస్థలపై ప్రభావం పడుతోంది. ఈ కంపెనీలు ఈ భారాన్ని వినియోగదారులపై మోపాల్సి వస్తోంది. ప్రధాని మోడీ వివిధ పథకాలకు ఖరారు చేసిన బడ్జెట్ కేటాయింపులపై ప్రత్యేకించి జనాకర్షక పథకాలపై ఈ పెరుగుతున్న చమురు వ్యయం భారం పడుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు ముంచుకొచ్చిన ఈ పెట్రోబాంబుతో కేంద్రం ఆందోళన చెందుతోంది. ప్రధాని మోడీ ఇటీవలే చమురు ఉత్పత్తి దేశాల కీలక సమావేశంలో చమురు ధరలు హేతుబద్ధంగా ఉండాలని, కృత్రిమ సంవిధానాలతో చివరికి వినియోగదారుడిపై పెను భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే మోడీ ప్రభుత్వం ఇంతకు ముందు ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు కూడా పన్నుల విధానాలలో వెసులుబాట్లకు దిగలేదని , దీనితో చివరికి అప్పటికీ ఇప్పటికీ వినియోగదారుడి నెత్తిన పిడుగుపాట్లు అదేపనిగా ఉంటున్నాయని వెల్లడైంది. స్థానిక పన్నులు ఇతరత్రా సుంకాలను సరళీకృతం చేసే అధికారం స్థానికంగా ప్రభుత్వంపై ఉంటుంది. అయితే కేంద్రం ప్రతిసారీ ఇది విదేశీ కంపెనీల ధరల దెబ్బ అని చెపుతూ వస్తోంది. అయితే ధరలు అంతర్జాతీయంగా తగ్గినప్పుడు ధరలు తగ్గని వైనంపై సమాధానం లేకపోవడం కీలకంగా మారింది. ఇప్పుడు డీజిల్ ఇతర ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరినప్పుడు కేంద్రంపై అనేక రకాలుగా ధరల విధానంపై విమర్శలు వస్తున్నాయి. చాలా భారీ స్థాయిలోనే ఇంధన ధరలపై వివిధ రకాల పన్నులతో కేంద్రానికి లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, దీనిపై ఏం సమాధానం చెపుతారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ఎక్సైజ్ సుంకం తగ్గింపునునకు మరోసారి అవకాశం ఉందని, ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను కుదించుకునేందుకు వీలుందని నోమురా ఫైనాన్షియల్ అడ్వైయిజరీ సంస్థకు చెందిన నిపుణులు రవి అడుకియ, అనిల్ శర్మ తెలిపారు. గత వారం ప్రపంచ స్థాయిలో ముడిచమురు ధరలు బ్యారెల్ ధరలు గత వారంలో 80 డాలర్ల స్థాయికి చేరాయి. దీనితో వినియోగదారుల జేబులు కాలిపోతున్నాయి. గతంలో ఒకసారి ముడిచమురు ధరలు రికార్డుల రికార్డు స్థాయిలో అత్యధికంగా 147.50 డాలర్లకు చేరింది. ఇప్పుడున్న ధరలు ఆ స్థాయికి చేరితే భారత్‌తో సహా పలు ఆయిల్ ఆధారిత దేశాలపై అనేక రకాలుగా ప్రభావం పడుతుంది. చివరికి అధికారంలో ఉన్న పార్టీల ఆశలు , ఇక ముందటి అధికారపు అవకాశాలను దెబ్బతీస్తాయి.
ఇంధన సబ్సిడీ రూ. 35,500 కోట్లు!
బ్యారెల్‌కు చమురు ధర సగటున 70 డాలర్లు అని అనుకున్నా 2019 ఆర్థిక సంవత్సరంలో ఇంధన సబ్సిడీ స్థాయి దాదాపుగా రూ 35,500 కోట్లకు చేరుతుంది. అంటే ఇంతకు ముందు ఖరారు చేసిన దాని కన్నా ఇది దాదాపు రూ 10,500కోట్లు ఎక్కువ అవుతుంది. ఇంధన సబ్సిడీలు 2015 నుంచి ఇప్పటివరకూ చూస్తే వచ్చే ఏడాదే అత్యధికంగా ఉంటుందని కొటక్ ఇనిస్టూషనల్ఈక్విటిస్ సంస్థకు చెందిన నిపుణులు తెలిపారు. ఇప్పటికైతే ధరలు ఏ స్థాయిలో ఉంటాయనేదానిపై సౌదీ కంపెనీలు ఏమీ చెప్పడం లేదు. వాటి ధరలను బట్టి ఇక్కడ ధరల పెంపుదల దానిని బట్టి ప్రజలలో ఆదరణ తగ్గుతుందనే భయాందోళనలతో అధికార బిజెపి కలవరంతో ఉంది. ఇదే సమయంలో కర్నాటకలో సంకీర్ణ విజయం తరువాత ఈ ధరల అస్త్రాన్ని కేంద్రంపై ప్రయోగించి ముందు ముందు ముప్పు తిప్పలు పెట్టాలని సంఘటిత ప్రతిపక్షం వ్యూహరచనకు దిగుతోంది.

11వ రోజూ పెట్రో పిడుగు 

 వరుసగా 11వ రోజు కూడా వాహనదారుడిపై పెట్రో పిడుగు పడింది. గురువారం పెట్రోల్, డీజిల్  ధరలు లీటర్‌కు 30 పైసలు చొప్పున పెరిగాయి. సౌదీ ముడిచమురు ధరలు బ్యారెల్ లెక్కన పెరుగుతూ ఉండటంతో డీలర్ల దాని భారాన్ని దేశంలో వినియోగదారుల నెత్తిన మోపుతున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసీముగియగానే అంటే ఈ నెల  14 నుంచి పెట్రోలు, డీజి ల్ ధరలు ఆగకుండా పెరుగుతూ పోతున్నాయి. గురువారం ధరల పెరుగుదలతో వివిధ మెట్రో మహానగరాలలో ఈ నిత్యావసర ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. స్థానిక పన్నులు సుంకాలు ఇతరత్రాలు కలిపితే లీటర్ పెట్రోలు ధర ఇప్పుడు ముంబైలో రూ 85కు చేరుకుంది. కాగా కోల్‌కతాలో రూ 80కి, హైదరాబాద్‌లో లీటర్‌కు రూ 82 వరకూ ఎగబాకింది. ఇతరత్రా వాహనాలకు ఉపయోగపడే డీజిల్ ధరలు గురువారం లీటర్‌కు 30 పైసలు చొప్పున పెరిగాయి. దీంతో ముంబైలో అత్యధికంగా ఇప్పుడు డీజిల్ లీటర్‌కు రూ 72.96 పైసలకు చేరింది. చెన్నైలో రూ 72.35, కోల్‌కతాలో రూ 71. 08 స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 68.53గా నిలిచింది. ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం దీర్ఘకాలిక, స్వల్పకాలిక పరిష్కార మార్గాలను అన్వేషిస్తోంది.