Home ఎడిటోరియల్ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం!

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం!

Ambedkar-1

మన రాజ్యాంగ నిర్ణాయక సభ భారత రాజ్యాంగాన్ని రూపొందించి 1949లో దాన్ని ఆమోదించటం, చట్టం చేయటం భారతదేశానికేగాక యావత్ మానవాళికి కూడా చారిత్రక ప్రాముఖ్యతగల విషయం. రాజ్యాంగ ప్రధాన రూపకర్త డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, రాజ్యాంగ నిర్ణాయక సభలోని గొప్ప నాయకులు దేశానికిచ్చిన రాజ్యాంగం కాల పరీక్షకు నిలబడింది, మిగతా ప్రపంచానికి నమూనాగా ఆవిర్భవించింది. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావటంతో భారతదేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని అంబేడ్కర్ అభిభాషించారు. భారతదేశానికి సంబంధించి ఆ ప్రకటనకు అపారమైన ప్రాముఖ్యత ఉంది. భారతదేశం తన సుదీర్ఘమైన ఎగుడుదిగుడు చరిత్రలో రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రకారం చట్టాన్ని అనుసరించే పరిపాలనను తొలిసారి చైతన్య పూరితంగా ఎంచుకుంది. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులను హామీ యిచ్చింది. అదే సమయంలో సమాజంలోని బలహీన, పీడిత విభాగాల సాధికారీకరణకు, దేశ సామాజిక ఆర్థిక పురోభివృద్ధికీ అవసరమైన చట్రాన్నిచ్చింది. మన రాజ్యాంగంలో పొందుపరిచిన మన స్వాతంత్య్ర ఘనమైన ఆశయాలు – అంబేడ్కర్ మాటల్లో మన పౌరులను ఒక మనిషి – ఒక ఓటు నుంచి ఒక వ్యక్తి – ఒక విలువ స్థాయికి తీసుకెళ్లటానికి ఉద్దేశితమైనాయి. మన పౌరులు ఆచరించే విశ్వాసం, మాట్లాడే భాషతో నిమిత్తం లేకుండా సమానత్వం, సమాన అవకాశాలతో కూడిన దేశ నిర్మాణం చాలా కష్టమైన కర్తవ్యం, చిత్తశుద్ధిపూర్వకంగా ఆచరించాల్సిన కర్తవ్యం. భారతదేశంలో మెజారిటీ వాద ధోరణులు పుంజుకుంటున్న ఈ సమయంలో, రాజ్యాంగంపై, మన రిపబ్లిక్ లౌకిక (సెక్యులర్ ) పునాదిపై దాడి చేయటానికి హిందూత్వ శక్తులు అత్యంత దుర్మార్గపూరితంగా చర్యలు తీసుకుంటున్న ఈ తరుణంలో మనం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి.
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రాజ్యాంగ నిర్ణాయక సభలో తన చివరి ప్రసంగంలో ఎంతో నిశిత దృష్టితో ఇలా చెప్పారు : “స్వాతంత్య్రం సిద్ధించిన మీదట, ఏ తప్పు జరిగినా బ్రిటీష్ వారిని నిందించే సాకును మనం కోల్పోయాం. ఇక మీదట, తప్పులు జరిగితే ఎవర్నీ నిందించలేము, మనల్ని మనం నిందించుకోవటం తప్ప. పరిస్థితులు తప్పుత్రోవ పట్టే ప్రమాదం చాలా హెచ్చుగా ఉంది”. నిజానికి 2014 మే తర్వాత పరిస్థితులు తప్పుత్రోవపట్టాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రూపొందించిన లోపభూయిష్ట విధానాలవల్ల సమాజంలోని దళితులు, మైనారిటీలు, ఇతర పీడిత విభాగాలపై జరిగిన పాశవిక దాడులు దాన్ని సూచిస్తున్నాయి. గుజరాత్‌లోని ఉనాలో మృత గోవు చర్మం వలుస్తున్న దళితులను స్వయం ప్రకటిత గో సంరక్షక గుంపులు కొట్టిన సంఘటన సమాజంలో అత్యంత పీడితులు, అణగదొక్కబడిన విభాగాలకు రానున్న ప్రమాదాన్ని స్పష్టంగా తెలియజేసింది. రాజ్యాంగ నిబంధనల ద్వారా అటువంటి పీడిత విభాగాలకు రక్షణ కల్పించాలన్న డాక్టర్ అంబేడ్కర్ దార్శనికతను రాజ్యాంగానికీ అట్టడుగు తరగతుల మానవ హక్కులకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులు పూర్తిగా తిరస్కరించాయి, కాలరాశాయి.
ప్రస్తుత ప్రభుత్వ విధానాలు రాజ్యాంగ విలువలను తిరస్కరించే నిమిత్తం ప్రతీఘాత విప్లవంలో విశ్వాసమున్న శక్తులను దేశం మీదకు విడిచిపెట్టాయి. అవి కుల ఆధిక్యతల ప్రాతిపదికపై కొద్దిమంది గుత్తాధికారం కలిగి ఉండే సామాజిక – ఆర్థిక వ్యవస్థను శాశ్వతం చేయాలని కోరుకుంటున్నాయి. అగ్రవర్ణ సంపూర్ణ ఆధిక్యతకు బలం చేకూర్చే, దళితులు, మైనారిటీలపై దాడులు సాగించే అటువంటి దృక్పథం స్పష్టంగా దేశద్రోహకరమైంది.
కులం దేశద్రోహకరమైందని డాక్టర్ అంబేడ్కర్ సరిగ్గా అభివర్ణించారు. అందువల్ల రాజ్యాంగ నైతికతను అలవరుచుకోవాలని ఆయన వక్కాణించారు. రాజ్యాంగ నైతికత అంటే రాజ్యాంగాన్ని గౌరవించటం, సాధకబాధకాల పరిష్కారానికి, విమర్శ చేసేందుకు, అధికారం వినియోగించే బాధ్యతను పొందినవారి తప్పుల అభిశంసనకు రాజ్యాంగ పద్ధతులు అనుసరించటం. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకమైన వైఖరి తీసుకునేటటువంటి, దాని దుష్పరిపాలనను ఎండగట్టేటటువంటి వారిపై రాజద్రోహ నేరం మోపటం, దేశద్రోహులుగా ముద్రవేయటం దిగ్భ్రాంతికరం. అంబేడ్కర్ రాజ్యాంగ నిర్ణాయక సభలో చెప్పినట్లు కులాలను దేశద్రోహం అని పిలిచేబదులు, కేంద్ర ప్రభుత్వ స్థాయిలోని పాలకులు ప్రభుత్వ విధానాలను లోతుగా పరిశీలించేవారిని దేశద్రోహులుగా వర్గీకరిస్తున్నారు. ఇది రాజ్యాంగాన్ని,వేరుచేయవీలులేని ప్రాథమిక హక్కులను, సహజ న్యాయ సూత్రాలను ఘోరంగా ఉల్లంఘించటమే.
నవంబర్ 26 ఇప్పుడు రాజ్యాంగ దినంగా పాటించబడుతున్నది. అయితే పార్లమెంటు అధికారాలను కుదించటం, దానిపట్ల ధిక్కారం ప్రదర్శించటం మన రిపబ్లిక్ వ్యవస్థాపక పత్రాన్ని ఏమాత్రం గౌరవించినట్లు కాదు.
మన రాజ్యాంగంలో న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాలకు సంబంధించి అనేక నిబంధనలున్నాయి. ముఖ్యంగా చట్టం, న్యాయ సూత్రాలపై ఆధారపడిన విస్తృత చట్రంతో సామరస్యంగా సహజీవనం చేస్తున్న సామాజిక, ఆర్థిక విషయాలు ప్రశంసలు పొందాయి. అయితే సామాజిక, ఆర్థిక విషయాలను విస్మరించటం విషాదకరం. ఈ రెండు స్థాయిల్లో అసమానత కొనసాగుతూ, ప్రజలు బాధలనుభవిస్తూ ఉండటం రాజ్యాంగానికి అభిశంసన అవుతుంది. ఆర్థిక అసమానత పెరుగుతూ ఉండటం కులం, సామాజిక కారణాల రీత్యా సమాజంలో అట్టడుగున ఉన్న విభాగం ప్రజల దారిద్య్రాన్ని పెంచుతున్నది. నయా ఉదార ఆర్థిక వ్యవస్థ సామాజికంగా, ఆర్థికంగా అవకాశాలులేని ప్రజల అసమానతను మరింతగా పెంచిందని ఐ.ఎం.ఎఫ్ నివేదికలు తెలుపుతున్నాయి. అది రాజ్యాంగబద్ధపాలన పథకం కుప్పకూలే ప్రమాదం సృష్టిస్తున్నది. ఆ విధంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న నయా ఉదార విధానాలు సెక్యులరిజం ప్రాతిపదికగా ఉదార ప్రజాస్వామ్యాన్ని మనకు ప్రసాదించిన రాజ్యాంగానికే ముప్పుతెస్తున్నాయి. ప్రసిద్ధ బొమ్మయ్ కేసు తీర్పులో 9 మంది జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సెక్యులరిజాన్ని రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంగా స్పష్టంగా వక్కాణించింది. సెక్యులరిజానికి విరుద్ధమైన హిందూత్వ, మరేదైనా భావనతో సెక్యులరిజాన్ని తిరస్కరించటం రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంపై దాడి అవుతుంది. అందువల్ల అన్ని విశ్వాసాలు సామరస్యంగా జీవించేందుకేగాక మత విలువలపై ఆధారపడిన పితృస్వామిక వ్యవస్థకు బలిఅవుతున్న మహిళలకు ఇతోధిక సమానత్వం, అవకాశాల కొరకు కూడా రాజ్యాంగ ప్రాథమిక స్వరూపాన్ని సమర్థించటం అవసరం. సెక్యులరిజం కొరకు పోరాటం మహిళల హక్కుల కొరకు పోరాటమని సరిగ్గా చెప్పబడింది. లింగ న్యాయంపై అంబేడ్కర్ దృష్టి హిందూ కోడ్ బిల్లు రూపొందించేందుకు ఆయన చేసిన ప్రయత్నాల్లో చక్కగా వ్యక్తమైంది. పురుషులు- స్త్రీల సమానత్వాన్ని బలపరిచిన, అందరికీ – లింగం, విశ్వాసం, కులం, ఉప జాతీయతతో నిమిత్తం లేకుండా సమానావకాశాలను హామీ ఇచ్చిన రాజ్యాంగం భావనను నెరవేర్చేందుకుగాను లింగ న్యాయం, సమానత్వం భావాన్ని సమాజం, దేశం స్థాయిలో నిర్దిష్టంగా అమలుజరపాల్సిన అవసరముంది. తప్పుగా రూపొందించిన, తప్పుగా అమలు జరుపుతున్న విధానాలతో ప్రభుత్వం ప్రజలను అనవసరమైన వేధింపులకు, ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రస్తుత తరుణంలో భారతదేశం అనే భావనను కాపాడుకునేందుకు, వృద్ధి చెందుతున్న కోట్లాది జనాభాకు సంక్షేమం అందించేందుకుగాను మనం రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, రాజ్యాంగ నైతికతను పటిష్టపరుచుకోవాలి.
రాజ్యాంగానికి వస్తున్న ప్రమాదం చాలా ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుత రాజ్యాంగాన్ని వినాశానికి గురిచేస్తే భారతదేశం తన స్వాతంత్య్రాన్ని శాశ్వతంగా కోల్పోతుందని డాక్టర్ అంబేడ్కర్ చెప్పారు. కొన్ని సంవత్సరాల క్రితం రాజ్యాంగాన్ని సమీక్షించే ప్రయత్నం జరిగింది. అప్పుటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ లోతైన ఆలోచనతో ఇలా ప్రశ్నించారు: “రాజ్యాంగం మనల్ని విఫలం చేసిందా లేక మనం రాజ్యాంగాన్ని విఫలం చేశామా, మనం పరిశీలించుదాం”. రాష్ట్రపతి నారాయణన్ శోధనాపూర్వక ప్రశ్నను మనం మననం చేసుకుంటే, ప్రస్తుత ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు రాజ్యాంగ విరుద్ధమన్న సమాధానానికి వస్తాం. అందువల్ల, రాజ్యాంగాన్ని సమర్థించటం అవసరం. అది లేకపోతే మన స్వాతంత్య్రం, ఐక్యత, సమగ్రత ప్రమాదంలో పడతాయి. ఇప్పుడు కావలసిందేమిటంటే, మితవాత ఫాసిస్టు శక్తులు ఎంతో పట్టుదలతో ఆచరిస్తున్న అరాచకాలను తిప్పికొట్టేందుకు రాజ్యాంగ నైతికత ఉన్నత ప్రమాణాన్ని, రాజ్యాంగ పద్ధతిని ఆచరించటం.

– డి. రాజా

(రచయిత సిపిఐ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు)