Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ఇంగ్లాండ్‌లో ఎస్‌బిఐ పునర్నిర్మాణం

SBI

‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యుకె లిమిటెడ్’ పేరిట కొత్త బ్రాండ్

లండన్: ఇంగ్లాండ్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) కార్యకలాపాల పునర్నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు ఆ బ్యాంకు తెలిపింది. ఇంగ్లాండ్‌లో ఎస్‌బిఐ కార్యకలాపాలను ఏప్రిల్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యుకె లిమిటెడ్ అనే అనుబంధం పేరిట నిర్వహించబోతున్నది. ఈ చర్య వల్ల ఇంగ్లాండ్‌లోని ఎస్‌బిఐ రిటైల్ బ్రాంచ్‌లన్నీ కొత్త అనుబంధ సంస్థ కిందికి వచ్చేస్తాయి. అంటే ఇదివరకటి విదేశీ శాఖలనేవి ఉండబోవు. అన్నీ కూడా యుకెఇన్‌కార్పొరేటెడ్ బ్యాంకింగ్ సంస్థ కిందికే వచ్చేస్తాయి. ‘పైకి కనిపించే మార్పులు పెద్దగా ఏమీ లేకపోయినప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యుకె లిమిటెడ్ అన్న కొత్త బ్రాండ్ పేరు మార్పు ఉండబోతుంది. ఇంగ్లాండ్‌లో ఎస్‌బిఐకి మొత్తం 12 రిటైల్ శాఖలున్నాయి. వాటిలో 7 లండన్‌లో , మిగతావి లండన్ బయట ఉన్నాయి. అవన్నీ ఇకపై ఎస్‌బిఐ యుకె లిమిటెడ్ శాఖలు కానున్నాయి. అయితే వాటిని వేరే చోటకి మార్చడం అంటూ ఏదీ ఉండబోదు’ అని ఎస్‌బిఐ యుకె ప్రాంతీయ అధినేత సంజీవ్ ఛధా అన్నారు. ‘వినియోగదారులు తమ డెబిట్ కార్డులను, బ్యాంకింగ్ సదుపాయాలను ఎప్పటిలానే వినియోగించుకోవచ్చు. యుకె మార్కెట్‌పై వ్యూహాత్మక దృష్టినే కేంద్రీకరించబోతున్నాం. యుకెలో మరింత బిజినెస్ చేయాలనుకుంటున్నాం. యుకె మార్కెట్‌కు అనుగుణంగా ఉత్పత్తులను విస్తరించబోతున్నాం’ అని ఆయన తెలిపారు. విదేశీ మార్కెట్ ఒడిదుడుకుల నుంచి ఇంగ్లాండ్‌లో ఉన్న డిపాజిటర్లను రక్షించేందుకు విదేశీ బ్యాంకులు తమ విదేశీ శాఖ హోదాను వదిలిపెట్టి స్వతంత్ర సంస్థలుగా రూపొందాలని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు చెందిన ప్రుడెంషియల్ రెగ్యులేషన్ అథారిటీ(పిఆర్‌ఎ) విదేశీ బ్యాంకులకు జారీ చేసిన ఆదేశాల మేరకే ఈ మార్పు జరిగింది. ‘ అనుబంధ బ్యాంకుగా మూలధనంకు కంచె వలయం(రింగ్ ఫెన్స్‌డ్) ఏర్పడుతుంది. అంతేకాక కావలసినంత అదనపు మూలధనం వస్తుంది’ అని ఛధా చెప్పారు. ఇంగ్లాండ్‌లో ఎస్‌బిఐ పునర్నిర్మాణం ముఖ్యాంశాలను ఆయన ఎత్తి చూపారు. అంతర్జాతీయ బిజినెస్‌కు లండన్ మంచి ప్రదేశం.

Comments

comments