Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

ఏం మజాకానా..

స్కాలర్‌షిప్ కాజేస్తే.. మీడియాకు చెబుతారా?
కావాలంటే ఎంతోకొంత తీసుకోండి..
కానీ గమ్మునుండండి
విద్యార్థులపై నకిలీ కళాశాల ఒత్తిడి
విద్యాశాఖ మౌనంపై ఎన్నో సందేహాలు

“ ఏం మజాకానా… నిజమే మీ పేర్లతో మీకు తెలియకుండా ఫీజురీయింబర్స్‌మెంట్ తీసుకున్నం. అయితే పత్రికల వాళ్లకు చెబుతారా.. కావాలంటేఎంతోకొంత తీసుకోండి.. కానీ ఇకనైనా గమ్మునుండండి… జర జాగ్రత్త…” ఇదీ నకిలీ వికాస్ యాజమాన్యం విద్యార్థులను బెదిరిస్తున్న తీరు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ మిన్నకుండడం అనుమానాలకు తావిస్తోంది. కోట్లాది రూపాయలు మింగేసి.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి… ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోరనేది అంతుపట్టని ప్రశ్న! అయితే ఆర్థిక బంధాలే అడ్డొస్తున్నాయనే ఆరోపణకు అధికారుల తీరే తార్కాణం.

Scholarship1ఖమ్మం ప్రతినిధి: జిల్లాలోని కారేపల్లిలో గల ఓ ప్రైవేట్ కళాశాల దొడ్డి దారిన డిగ్రీలో అడ్మిషన్లు చేయించి విద్యార్థులకు తెలియకుండానే ఫీజు రీయింబర్స్‌మెంట్ కాజేసిన వ్యవహారం మన తెలంగాణ వెలికీ తీయడంతో యాజ మాన్యం ఉలికి పడింది. పదో తరగతి మార్కుల జాబితా, జిరాక్స్, ఆధార్‌తో దోస్త్ వెబ్ సైట్ ద్వారా డిగ్రీలో ప్రవేశం కల్పించి ఈ యాజమాన్యం కోట్లు దోచుకుంటోంది. బ్యాంకులో వేరే వ్యక్తుల ఫొటోలు పెట్టి ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని దర్జాగా నొక్కేస్తుండడాన్ని ఆధారాలతో సహా బయటపెట్టడంతో విద్యార్థులతోమంతనాలు సాగిస్తోంది.

“మేము చేసింది తప్పే కావాలంటే ఏదైనా ఇస్తాం. పత్రికలకు మాత్రం చెప్పకండి” అంటూ ఓ పక్క బతిమిలాడుతూనే “అయితే మాత్రం చెబుతారా.. జర జాగ్రత్త” అంటూ బెదిరించే ప్రయత్నం చేస్తోంది. వారి బెదిరింపులకు సంబంధించి కొందరు బాధితులు ఫోన్లో రికార్డు చేసి మన తెలంగాణ ప్రతినిధులకు విన్పించారు. కోట్లాది రూపాయలు కాజేసిన కళాశాల యాజమాన్యం గతంలో ఓ అనుమతి లేని పాఠశాలను నిర్వహించింది. పలువురి ఫిర్యాదుతో అధికారులు  పాఠశాలను మూసివేయించారు. కనీసం 300 మంది విద్యార్థులు కూర్చునేందుకు కూడా వీలు లేని ఈ కళాశాలలో వెయ్యి
మంది విద్యార్థులు ఎలా విద్యనభ్యసిస్తారన్న కనీస ఆలోచన విద్యాశాఖాధికారులకురాలేదు.

వచ్చినా ఆ ఆలోచన ఎలా మరుగున పడింతో అంతుపట్టని ప్రశ్న. ఇంత జరిగి ఫీజు రీయింబర్స్‌మెంట్ కుంభకోణం గుట్టురట్టయినా.. అధికార యంత్రాంగం నోరు మెదపడం లేదు. జిల్లాలో విద్యాశాఖ అక్రమార్కులకు ఎంత సహకరిస్తుందో ఈ ఉదంతం ద్వారా అవగతమవుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయమై నిర్వహించిన తనిఖీల్లో డొల్లతనం బయటపడింది. అంతా ఓకే అన్న అధికారులు, యూనివర్శిటీ బాధ్యులు ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి. కనీస వసతులు లేకుండా నకిలీ అడ్మిషన్లతో కళాశాల నడుపుతుంటే విద్యాశాఖ పరిశీలన తీరు అవగతమవుతోంది. ఇప్పటికైనా ఫీజు రీయింబర్స్‌మెంట్ కాజేసిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడతామని బాధితులు తెలిపారు.

Comments

comments