Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

భారమవుతున్న బడి చదువులు

School education is becoming burdensome

ప్రైవేట్ స్కూళ్లలో అడ్డగోలు ఫీజులు
అమలుకు నోచుకోని విద్యాహక్కు చట్టం
పట్టించుకోని అధికారులు
పేదలకు భారమవుతున్న విద్య

మన తెలంగాణ/మహబూబ్‌నగర్: పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు సర్వస్వం ధార పోస్తున్నారు. ఎంత ఖర్చయినా తమ పిల్లలను ఉన్నత స్థాయిలో నిలపాలని ఆశిస్తున్నారు. వారి ఆశలను జిల్లాలోని కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. వేలాది రూపాయలు ఫీజుల పేరిట వసూలు చే స్తూ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఐఐటీ, ఈ టెక్నో, డీజీ, మోడల్, కాన్సెప్ట్, గ్రామర్ అంటూ కొత్త పేర్లు స్కూళ్లకు తగిలించి ఫీజులు, డొనేషన్ల పేరిట అందినంతా దండుకుంటున్నారు. ఫలితంగా పాఠశాల విద్య పోషకులకు భారంగా మారుతోంది. జూన్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో సామాన్యుడికి ఫీజుల భయం పట్టుకుంది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం గతంలో జారీ చేసిన జివో అటకెక్కింది. జివో అమలుకు ప్రైవేట్ పాఠశాలల్లో ఏర్పా టు చేసిన కమిటీలు యాజమాన్యాలకు కొమ్ముకాస్తున్నాయి. కమిటీలో తమకు అనుకూలమైన వారిని సభ్యులుగా నియమించుకుని ఫీజులుం చేస్తున్న పాఠశాలలే అత్యధికమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫీజులుం…
పదేళ్ల క్రితం జిల్లాలో ఒకటి, రెండు కార్పొరేట్ విద్యాసంస్థలు ఉండగా ప్రస్తుతం వీధికొకటి వెలిశాయి. జిల్లాలో కార్పొరేట్ పాఠశాలలు ఏడాదికి రూ.21 వేలు వరకు చేస్తుండడంతో సామాన్యుడి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పుస్తకాలు, యూనిఫాం, పాఠశాలల్లో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల పేరిట అదనంగా మరో రూ.10 వేలు ఖర్చు అవుతుంది. స్కూల్ అండ్ హస్టల్‌కు అయితే రూ.45 వేల నుంచి రూ.60 వేల వరకు ముట్టజెప్పాల్సిందే. వీటితో పాటు పుస్తకాలు, ఇతర ఖర్చులు రూ.20 వేలు అదనం. స్థానికంగా పేరుగాంచిన పాఠశాలల్లో ఫీజుల వివరాలు చూసి తల్లిదండ్రలు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి తోడు కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ఐఐటీ, ఈ టెక్నో, డీజీ, మోడల్, కాన్సెప్ట్, గ్రామర్, డిజిటల్ అంటూ కొత్త కొత్త పేర్లు తగిలించి వేలాది రూపాయలు గుంజుతున్నారు. ఇక అడ్మిషన్ ఫీజు పేరిట యధేచ్ఛగా డొనేషన్లు వసూలు చేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడు. తరగతి ఆధారంగా అడ్మిషన్ ఫీజు రూ.4 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి భారమవుతున్న బడి చదువులు ఈ ఫీజు అంశాన్ని పాఠశాల పేరెంట్స్ కమిటీలో చర్చించి అనుమతి తీసుకుని డిఈఒ దృష్టికి తీసుకెళ్లి వసూలు చేసుకోవాలనే నిబంధన ఉంది. కానీ ఎక్కడా ఈ నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

కనీస సౌకర్యాలు కరువు..
ఓ పక్క నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూనే మరో పక్క పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యాలు నిర్లక్షం వహిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. జిల్లాలో 90 శాతం పాఠశాలలకు మైదానాలు, పార్కింగ్ స్థలాలు లేవనేది అధికారులకు తెలియనిది కాదు. కనీసవసతులైన తాగునీరు, విద్యార్థులకు తగినన్ని మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంలోనూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిర్లక్షం వ్యవహరిస్తున్నాయి. అంతే కాకుండా అధిక వసూలు చేస్తున్నారే తప్పా అర్హులైన బీఈడీ, డీఎడ్ చదివిన ఉపాధ్యాయులను నియమించాల్సి ఉన్నా.. చాలా పాఠశాలల్లో వీరి జాడే లేదని, అర్హతలు లేనివారితో బోధన చేయించి తక్కువ వేతనం చెల్లిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
ప్రభుత్వ గుర్తింపు లేకుండా పాఠశాలలు ఏర్పాటు చేయకూడదు.
ప్రవేశ పరీక్ష నిర్వహించకూడదు.
అర్హత కలిగిన టీచర్లనే విద్యాబోధన చేపట్టాలి.
ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ (ప్రైవేట్ పాఠశాలలు) పాఠశాలల్లో ఒకటో తరగతిలో నిరుపేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు కల్పించాలి.
అందుకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలి.
బడిలో ప్రవేశం పొందిన పిల్లలను అదే తరగతిలో మళ్లీ కొనసా గించడం, బడి నుంచి తీసేయడం నిషేధం.
బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్లు నిర్మించాలి.
మైదానాలు, పార్కింగ్ స్థలాలు ఖచ్ఛితంగా ఏర్పాటు చేయాలి.
తరగతి గదులు బాగా వెలుతురు వచ్చే విధంగా ఉండాలి.
పాఠశాలలో విద్యార్థులకు తాగునీరు, తదితర మౌళిక సదుపా యాలు కల్పించాలి.
విద్యార్థులకు అందుబాటులో వైద్యుడు ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ రూం ఏర్పాటు చేయాలి.
క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ఎటువంటి అదనపు ఫీజు లేకుండా శిక్షణను ఇవ్వాలి.

సర్కార్ బడుల్లో చేర్పించండి : మహబూబ్‌నగర్ జిల్లా విద్యాధికారి సోమిరెడ్డి
తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ బడుల్లో చేర్పించాలి. విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత దుస్తులతోపాటు నాణ్యమైన విద్య అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల్లో అర్హత, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయిస్తున్నాం. పేద విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రైవేట్ పాఠశాలను దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌళిక సదుపాయాలు కల్పించడమే కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రత్యేక శిక్షణను ఇస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయకూడదు. నిబంధనలను అతిక్రమించిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం.

Comments

comments