Home ఆఫ్ బీట్ ఆ గ్రామంలో తేళ్లు కుట్టవు..!

ఆ గ్రామంలో తేళ్లు కుట్టవు..!

Scorpion sting is very dangerous

రాష్ట్రమంతటా నాగుల పంచమి నిర్వహిస్తుండగా దానికి భిన్నంగా తేళ్ల పంచమిని ఇక్కడ జరుపుకోవడం ఒక వైవిధ్య సంప్రదాయం. మహబూబ్‌నగర్ జిల్లా, నారాయణపేట డివిజన్ కేంద్రం, సరిహద్దులోని కర్నాటకలోని యాద్గిర్ జిల్లా కందుకూర్ గ్రామంలో కొండమవ్వ గుట్టపై జరిగిన తేళ్ల పంచమికి భక్తులు వందలాదిగా కొండపైకి బారులు తీరారు. నిటారుగా ఉన్న గుట్టపైకి మహిళలు, పిల్లలు, వృద్ధులు నడిచి వెళ్లారు. ఆలయంలో ఏర్పాటు చేసిన తేళ్ల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. పిల్లలు, యువత గుట్టపై రాళ్ల కింద ఉన్న తేళ్లను పట్టుకొని సెల్ఫీలు తీసుకొన్నారు. పూర్వకాలం నుండి ఇది ఆచారంగా వస్తోందని, ఈ సమయంలో తేళ్లు కుట్టవు, ఒక వేళ కుట్టినా గుడిలోని విభూతిని రాస్తే ఏమీ కాదని భక్తులు అంటున్నారు. తేళ్లకు పుట్టినిల్లుగా పేరొందిన ఈ గ్రామంలో కొండపై ఉన్న కొండమాయి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పంచమి రోజున కొండపై అనేక జాతులకు చెందిన, ఎర్ర తేలు, ఇనుప తేళ్లు వంటి విషపూరితమైన తేళ్లు ఎక్కడ పడితే అక్కడ అధిక సంఖ్యలో దర్శనమిస్తాయి. జాతి, మత భేదాలు లేకుండా దేవస్థానంలో పూజలను నిర్వహిస్తారు. దేవస్థానానికి వచ్చే భక్తులు, పిల్లలు ఈ తేళ్లను పట్టుకునేందుకు పోటీలు పడుతుంటారు. పాములను కూడా మెడలో వేసుకుని ఆడుకుంటుంటారు. ఈ రోజున ఏ విష జంతువు అయినా హాని తలపెట్టదని, కాటు వేసినా కొండమాయి దేవి విబూధిని పెట్టుకుంటే నయమవుతుందని, ఈ పద్ధతి అనేక సంవత్సరాల నుండి కొనసాగుతోందని స్థానికులు తెలిపారు.