Home తాజా వార్తలు మహాకూటమిలో తెగని సీట్ల పంచాయితీ

మహాకూటమిలో తెగని సీట్ల పంచాయితీ

మరో రెండురోజుల్లో స్పష్టత, హస్తం గుర్తుపై పోటీకి సిద్ధంగా లేని టిజెఎస్

Uttam-Kumar-reddy

మన తెలంగాణ/హైదరాబాద్: మహాకూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాకపోయినప్పటికీ రాహుల్‌గాంధీ పర్యటన అనంతరం రెండు మూడు రోజుల్లో తేలనుంది. టిడిపి. తెలంగాణ జన సమితి, సిపిఐ సీట్ల సర్దుబాటు అంశాన్ని కాంగ్రెస్ సున్నితంగా పరిష్కరించేలా ఆలోచిస్తోంది. హైదరాబాద్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్‌లో కాంగ్రెస్ సహా మహాకూటమి నేతలు సుమారు మూడుగంటల పాటు సమావేశమై సీట్ల సర్దుబాటు చర్చలు జరిపారు. కాంగ్రెస్ తరఫున రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్‌సి కుంటియా, భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం తరఫున ఎల్ రమణ, సిపిఐ తరఫున చాడ వెంకటరెడ్డి, తెలంగాణ జన సమితి తరఫున కోదండరాం హాజరై సుమారు మూడు గంటలకు పైగా సీట్ల సంఖ్య, స్థానాల ఖరారు తదితర పలు అంశాలపై చర్చించారు. స్పష్టత రాకపోయినప్పటికీ రెండు మూడు రోజుల్లో కొలిక్కి వస్తుందని కూటమి నేతలు వ్యాఖ్యానించారు.

హస్తం గుర్తుపై పోటీ చేసేది లేదు : కోదండరాం

సీట్ల సర్దుబాటులో భాగంగా తెలంగాణ జన సమితి తరఫున పోటీచేసే అభ్యర్థులు సైతం కాంగ్రెస్ ఎన్నికల చిహ్నంపైనే పోటీ చేయాలనే ఊహాగానాల గురించి పాత్రికేయులు కోదండరాంను ప్రశ్నించగా, ‘ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్ హస్తం గుర్తుపై పోటీచేసే ప్రసక్తే లేదు. మా పార్టీ అభ్యర్థులు మా పార్టీ గుర్తుపైనే పోటీ చేస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మా పార్టీకి ఎన్నికల చిహ్నం లభించింది. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆ గుర్తుపైనే పోటీచేస్తారు’ అని స్పష్టం చేశారు. ఉమ్మడి ఎన్నికల ప్రణాళికపై కూడా లోతుగానే చర్చించినట్లు కోదండరాం వివరించారు. పొత్తులో భాగంగా 15 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తే విజయం సాధిస్తామని కోదండరామ్ ధీమా వ్యక్తంచేశారు.

అయితే 8 సీట్ల వరకు టిజెఎస్‌కు సర్దుబాటు చేసేందుకు కాంగ్రెస్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. కొంత పట్టువిడుపులతో మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసి ఎన్నికల ప్రచారానికి కూటమి కలిసికట్టుగా వెళ్లాలని నిర్ణయించినట్లు భాగస్వామ్య పార్టీల నాయకులు వ్యాఖ్యానించారు. సమావేశాలు సానుకూల వాతావరణంలో జరుగుతున్నాయని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కుంటియా చెప్పారు. సీట్ల సర్దుబాటు త్వరలో తేలిపోతుందని తెలిపారు. కూటమిలోని రాజకీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంతోనే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ గెలిచే సీట్లను వదులు కోకుండా కూటమి పక్షాలకు ఇబ్బందిలేకుండా సమస్య త్వరలో పరిష్కారం అవుతుందనే ఆశాభావాన్ని కుంటియా వ్యక్తంచేశారు.

రాహుల్‌తో మహాకూటమి నేతల భేటీ?

రాష్ట్ర పర్యటనకు రాహుల్‌గాంధీ శనివారం రానున్న నేపథ్యంలో మహాకూటమి భాగస్వామ్య పక్షాల్లోని టిడిపి, సిపిఐ నాయకులు భేటీ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ సొంత కార్యక్రమానికి వస్తున్న రాహుల్ గాంధీని కలవడం లేదని టిజెఎస్ నేత కోదండరాం స్పష్టం చేశారు.