Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

డిగ్రీ చదువుకు చెదలు

భారీగా మిగిలిపోతున్న సీట్లు

మూడు విడతల ప్రవేశాల్లో సగం సీట్లయినా నిండలేదు

గత ఏడాది కంటె తగ్గిన చేరికలు

ప్రమాణాలు పెంచే విధానాలే కారణమా?

Degree

హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీల పరిధిలోని డిగ్రీ కళాశాల ల్లో 50 శాతం సీట్లు కూడా భర్తీ కావడం లేదు. భర్తీ అయిన వాటి కంటే మిగిలిన సీట్లే అధికంగా ఉంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో మొత్తం 4,10,267 సీట్లు అందుబాటులో ఉండగా, మూడవ విడత ప్రవేశాలు ముగి సే నాటికి మొత్తం 1,87,368 మంది విద్యార్థులు కళాశాలల్లో ప్రవేశాలు పొందారు. 4వ విడతలో 5-10 వేలకు మించి ప్రవేశాలు జరిగే అవకాశాలు లేవని దోస్త్ అధికారులు చెబుతున్నారు. దాంతో ఈ ఏడాది డిగ్రీ ప్రవేశాలు 2 లక్షలకు మించే అవకాశం లేదు. గత ఏడాది మొత్తం 2.13 మంది విద్యార్థులు డిగ్రీలో ప్రవేశాలు పొందగా, సగానికిపైగా సీట్లు మిగిలాయి.
ఆప్షన్లిచ్చినా 6 వేల మందికి లభించని సీట్లు :
ఒకపక్క ప్రతి ఏడాది 2 లక్షలకు పైగా సీట్లు మిగిలిపోతుండగా, మరోపక్క కొంతమంది విద్యార్థులకు సీట్లు లభించడం లేదు. గత విద్యాసంవత్స రం నుంచి డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ఆన్‌లైన్‌లో చేపడుతున్నారు. ఆన్‌లైన్ విధానంపై సరైన అవగాహ న లేక గ్రామీణ ప్రాంతాలకు చెందిన కొంతమం ది విద్యార్థులు గందరగోళానికి గురై సకాలంలో రిజిస్ట్రేషన్ చేసుకోలేక గడువు ముగిసిన తర్వాత ఇబ్బందులు పడుతున్నారు. బిఎ, బికాం, బిఎస్‌సి వంటి సంప్రదాయ కోర్సుల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులే చేరుతుంటారు. మారుమూల ప్రాంతాల వారికి ఇప్పటికీ ఇంటర్నె ట్, ఆన్‌లైన్ విధానంపై సరైన అవగాహన లేదు. ఎక్కువగా మీ-సేవ, ఇ-సేవ, ఇంటర్నెట్ కేంద్రాలపై ఆధారపడుతుంటారు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్నా, సరైన అవగాహన లేక తక్కువ కళాశాలలను ఎంపిక చేసుకోవడంతో కొన్ని కళాశాలల్లో మాత్రమే సీట్లు భర్తీ అవుతున్నాయి. ఈ ఏడాది వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకుని, సీట్లు లభించని విద్యార్థులు 6,000 మంది ఉండగా, సీట్లు లభించి కళాశాలల్లో ప్రవేశాలు పొందని విద్యార్థులు 44,000 మంది ఉన్నారు.
మారుతున్న విధానాల వల్లనే తగ్గాయా..? : ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో గత విద్యాసంవత్సరం నుంచి సిబిసిఎస్(క్రెడిట్ బేస్డ్ ఛాయిస్ సిస్టమ్) అమలు చేస్తుండగా, ఈ ఏడాది నుంచి డిటెన్షన్ విధానం కూడా అమలవుతోంది. దాంతోపాటు కళాశాలల్లో హాజరు పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ కొత్త విధానాలు అమలు చేయడం వల్లనే డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు తగ్గినట్లు తెలుస్తోంది. సిబిసిఎస్ విధానంలో విద్యార్థులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి సెమిస్టర్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. సెమిస్టర్ మధ్యలో ఇంటర్నల్ పరీక్షలు కూడా ఉంటాయి. విద్యార్థులు రెగ్యులర్‌గా కళాశాలకు వెళితే తప్ప పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉండదు. డిగ్రీ కోర్సుల్లో కూడా వృత్తి విద్యా కోర్సుల తరహాలోనే సెమిస్టర్ విధానం అమలవుతుండడంతో ప్రవేశాలు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇంటర్మీడియేట్ విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు వివిధ ప్రవేశ పరీక్షలు రాసి, మెరుగైన ర్యాంకులు రాక ఎక్కడా సీటు లభించకపోతే, డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ తీసుకునేవారు. కళాశాలలకు వెళ్లకపోయినా డిగ్రీ చేయొచ్చు అనే ధీమా ఉండేది. కానీ మారిన విధానాలతో తప్పనిసరిగా కళాశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. దాంతో సీరియస్‌గా డిగ్రీ చేయాలనుకునే విద్యార్థులే ప్రవేశాలు పొందుతున్నారు.

Comments

comments