Search
Sunday 22 July 2018
  • :
  • :

రెండో విడత గొర్రెల పంపిణీని విజయవంతం చేయాలి

Second installment be successful in distribution of sheep

మనతెలంగాణ/జగిత్యాల : జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు అంకితభావంతో పని చేయాలని, నిర్లక్షం చూపితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శరత్ హెచ్చరించారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంపై పశు సంవర్దక శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, గతంలో గొర్రెలు కొనుగోలు చేసిన ప్రాంతాలకు కాకుండా గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లి నాణ్యమైన గొర్రెలను కొనుగోలు చేయాలన్నారు. గొర్రెలను ఎంపిక చేసేటప్పుడు వాటి ఆరోగ్య పరిస్థితిని గమనించిన తర్వాతే కొనుగోలు చేయాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పెద్ద గొర్రెలను కొనుగోలు చేయాలని, చిన్న పిల్లలను కొనుగోలు చేయవద్దన్నారు. గొర్రెలను కొనుగోలు చేయడానికి వెళ్లిన వారికి అక్కడ కొనుగోలు దారుల వివరాలు, గొర్రెలకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు వీలుగా జిల్లాలోని 18 మండలాలకు గాను ఒక్కోక్కరికి ల్యాప్‌టాప్ ఇస్తామన్నారు. ఈ విధానం వల్ల కొనుగోలు చేయబోయే గొర్రెల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చన్నారు. కొనుగోలు దారుల వివరాలు అక్కడే నమోదు చేయడం వల్ల వారికి సులువుగా డబ్బులు చెల్లించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. లబ్దిదారులకు డిడిల రూపంలో చెల్లింపులు చేస్తామని, గొర్రెలను కొనుగోలు చేసినప్పటి నుంచి ఇక్కడకు చేర్చే వరకు పూర్తి బాధ్యత గొర్రెల కొనుగోలుకు వెళ్లిన వారిదేనన్నారు. కొనుగోలు చేసిన వెంటనే గొర్రెలకు బీమా చేయించాలని, బీమా చేయించిన తర్వాతే గొర్రెలను ఇక్కడికి తీసుకురావాలన్నారు. మండలాల్లోని పశువైద్యశాలలో పని చేసే డాక్టర్లు క్యాచ్‌మెంట్‌కు వెళ్లినప్పుడు వారు తిరిగి వచ్చ వరకు అక్కడ మరో డాక్టర్‌కు బాధ్యతలు అప్పగించాలని జిల్లా పశు సంవర్దక శాఖ అధికారి అశోక్‌రాజ్‌కు సూచించారు. జిల్లాలో జూలై 7న మంత్రి పర్యటన ఉన్నందున రెండవ విడత పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రారంభోత్సవం రోజున మండలానికి కనీసం 10 యూనిట్లు సరఫరా చేయాలని, అందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పశువైద్యాధికారులు అందుబాటులో ఉండటం లేదని తమ దృష్టికి వచ్చిందని, అధికారులు తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. లబ్దిదారులకు సకాలంలో గొర్రెల దాణా అందించేలా, పశు వైద్యశాలల్లో అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఆర్‌డిఓ నరేందర్, జిల్లా పశు సంవర్దక శాఖ అధికారి డాక్టర్ అశోక్‌రాజ్, సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీధర్, పశు వైద్యాధికారులు పాల్గొన్నారు.

Comments

comments