Home జాతీయ వార్తలు స్వలింగ సంపర్కం నేరం కాదు

స్వలింగ సంపర్కం నేరం కాదు

ఇతరులకున్న హక్కులు వారికీ ఉంటాయి, 377 సెక్షన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

Suprem-Court2

న్యూఢిల్లీ: పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు గురువారం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించిన భారత శిక్షాస్మృతి( ఐపిసి)లోని 377 సెక్షన్ చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు తుది తీర్పు ప్రకటించింది. ఇతరుల హక్కులను తగ్గించడం సామాజిక నైతికత కాదని, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించడం సహేతుకం కాదని కోర్టు అభిప్రాయపడింది. అయితే జంతువులతో లైంగిక చర్యను, చిన్నారులతో అసహజ శృంగారాన్ని మాత్రం నేరంగానే పరిగణించాలని స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపిసిలోని 377 సెక్షన్‌ను సవాలు చేస్తూ దాఖలయిన పలు పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం.. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదని స్పష్టం చేస్తూ ముక్తకంఠంతో తీర్పు చెప్పింది.

లైంగిక స్వభావం ఆధారంగా ఒకరి పట్ల వివక్ష చూపించడం అంటే వారి ప్రాథమిక హక్కులను హరించడమే. లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జండర్, క్వీర్(ఎల్‌జిబిటిక్యు) వర్గానికి చెం దిన వారికి కూడా సాధారణ పౌరులకు ఉండే హక్కులే ఉంటాయి. వారి వ్యక్తిత్వాన్ని మనం గౌరవించాలి. ఐపిసి సెక్షన్ 377 సమానత్వ హక్కులకు భంగం కలిగిస్తోంది’ అని బెంచ్ తన 493 పేజీల తీర్పులో స్పష్టం చేసింది. ఈ వర్గం సభ్యులను వేధించడానికి ఈ సెక్షన్‌ను ఒక ఆయుధంగా ఉపయోగించున్నారని, ఫలితంగా వారి పట్ల వివక్షకు కారణమైందని ప్రధాన న్యాయమూర్తితో పాటుగా న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, ఆర్‌ఎఫ్ నారిమన్, ఎం ఖన్విల్కర్, ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. శతాబ్దాలుగా అంతులేని వేదనను, వివక్షను ఎదుర్కొన్నందుకు ఈ వర్గం వారికి, వారి తల్లిదండ్రులకు సమాజం క్షమాపణ చెప్పాల్పి ఉం దని విడిగా ఇచ్చిన తీర్పులో జస్టిస్ ఇందు మల్హోత్రా వ్యా ఖ్యానించారు. 377 సెక్షన్ కారణంగా ఈ వర్గం వారు రహస్యంగా, రెండోతరగతి పౌరులలాగా జీవించాల్సి వచ్చిందని జస్టిస్ చంద్రచూడ్ కూడా వ్యాఖ్యానించారు.

అసహజ నేరాలకు సంబంధించిన సెక్షన్ 377 ప్రకారం.. స్వలింగ సంపర్కం, జంతువులతో లైంగిక చర్యలు, అసహజ శృంగారానికి పాల్పడిన వారికి పదేళ్లవరకు జైలు శిక్ష విధించవచ్చు. ఈ సెక్షన్‌ను సవాలు చేస్తూ నాజ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ 2001లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పరస్పర అంగీకారంతో ఒకే లింగానికి చెందిన ఇద్దరు వయోజనుల మధ్య జరిగే లైంగిక చర్యను నేరంగా పరిగణించరాదని హైకోర్టు 2009లో తీర్పు ఇచ్చింది. అయితే 2013లో సుప్రీంకోర్టు ఈ తీర్పును రద్దు చేసి తిరిగి పాత నిబంధనలనే వర్తింపజేయాలని తీర్పు చెప్పింది.

తాజాగా దీనిపై స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు, మరికొందరు 377 సెక్షన్ చట్టబద్ధతను సవాలు చేస్తూ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ ఏడాది జూలై 17న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా స్వలింగ సంపర్కం నేరం కాదంటూ తీర్పు చెప్పింది. దీంతో దాదాపు 157 ఏళ్లుగా సాగుతున్న ఈ వివాదానికి శాశ్వతంగా తెరపడినట్లయింది. ఈ సెక్షన్‌ను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ప్రముఖ డ్యాన్సర్ నవ్‌తేజ్ జౌహర్, జర్నలిస్టు సునీల్ మెహ్రా, ప్రముఖ చెఫ్ రితు దాల్మియా, హోటల్ యజమానులు అమన్‌నాథ్, కేశవ్ సూరి, వాణిజ్యవేత్త అయేషా కపూర్, పలువురు మాజీ, ప్రస్తుత ఐఐటి విద్యార్థులు ఉన్నారు.

సామాజిక అంగీకారానికి ముందడుగు

న్యూఢిల్లీ : పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకి, సామాజిక అంగీకారానికి ముందడుగని అభివర్ణించింది. పురాతనమైన వలస చట్టం ప్రస్తుత ఆధునిక సమాజానికి పనికిరాదని, సుప్రీంకోర్టు తీర్పు పౌరుల ప్రాథమిక హక్కులను పునరుద్ధరించిందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా అన్నారు. ఈ తీర్పు లైంగికత ఆధారంగా చూపే వివక్షని తుడిచి పెడుతుందని ఆయన చెప్పారు. ఐపిసి 377 సెక్షన్‌పై ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రసంశనీయమని ఆయన అన్నారు. ప్రగతిశీలమైన ఈ తీర్పు వల్ల సమాజంలో లైంగికత ఆధారంగా చూపే వివక్ష తొలగిపోయి సామాజిక సమానత్వం సంతరించుకుంటుందని ఆయన చెప్పారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురితో కూడిన ధర్మాసనం 158 ఏళ్లనాటి సెక్షన్ 377 అమానవీయమైనదని ఏకగ్రీవంగా తేల్చి చెప్పింది. పరప్సర అంగీకారంతో సాగిం చే స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం తీర్పు చెప్పింది. ఈ చట్టం పౌరుల సమానత్వ హక్కుకు భంగకరమని తీర్పులో వెల్లడించింది.

సమానత్వం కోసం పోరాడే వారికి భరోసా

న్యాయం, సమానత్వం కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి సుప్రీంకోర్టు తీర్పు విజయాన్ని చేకూర్చిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తెలిపింది. పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్పీంకోర్టు ఏకగ్రీవంగా ఇచ్చిన తీర్పు భారతదేశ చరిత్రలోని చీకటి అధ్యాయానికి చరమగీతం పాడిందని వ్యాఖ్యానించింది. భారతదేశంలోని లక్షలాది మందికి ఈ తీర్పు ఒక కొత్త సమానత్వ యుగాన్ని ప్రసాదించిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా కార్యక్రమాల డైరెక్టర్ అస్మితా బసు అన్నారు. సుప్రీం తీర్పు మూడు దశాబ్దాలుగా పోరాడుతున్న స్వలింగ సంపర్కులు, వారి మద్దతుదారులకు విజయం ప్రసాదించిందని అన్నారు. ఈ తీర్పు ఒక చారిత్రక మైలు రాయి అని అభివర్ణించారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగాంలోని సెక్షన్ 377 అర్థరహితమని తేల్చి చెప్పిందని అస్మితా బసు చెప్పారు. లైంగిక స్వభావం ఆధారంగా ఒకరిపై పక్షపాతం చూపడం వారి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రశంసనీయమని తెలిపారు.

హెచ్‌ఐవి కేసులు పెరుగుతాయి

స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును బిజెపి వివాదాస్పద నేత, ఎంపి సుబ్రహ్మణ్య స్వామి తప్పు పట్టారు. దీని వల్ల హెచ్‌ఐవీ కేసులు మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సెక్షన్ 377పై సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్వలింగ సంపర్కం గురించి సుప్రీం తీర్పే చివరిది కాదు. దీన్ని ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్‌కి తీసుకెళ్లవచ్చని అభిప్రాయపడ్డారు. సెక్షన్ 377పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక దుష్ప్రవర్తనకు దారి తీయడమే కాక పలు లైంగిక వ్యాధుల సంక్రమణకు అవకాశం కల్పించినదిగా ఆయన అభిప్రాయపడ్డారు. దీని వల్ల హెచ్‌ఐవీ కేసులు పేరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక స్వలింగ సంపర్కం అనేది ఒక జన్యుపరమైన రుగ్మతగా సుబ్రహ్మణ్య స్వామి అభివర్ణించారు.

వివక్షకు అంతం: ఐరాస

న్యూఢిల్లీ : స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై యునైటెడ్ నేషన్స్ ఇండియా హర్షం వ్యక్తం చేసింది. స్వలింగ సంపర్కం నేరమని తెలిపే ఐపిసి సెక్షన్ 377 సహేతుకం కాదని, యవ్వనంలో ఉన్న వారు జరిపే స్వలింగ సంపర్కం నేరమని చెప్పడం వారి పట్ల వివక్ష చూపడమేనని సుప్రీంకోర్టు ప్రకటించడం ఇన్నాళ్లు సాగిన వివక్ష అంతానికి నాంది అని తెలిపింది. లైంగికత, లైంగిక వ్యక్తీకరణ అనేది ప్రపంచవ్యాపితంగా వ్యక్తిగతమైందని, వారిపట్ల హింస, వివక్ష అనేవి మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటనలో తెలిపింది. బ్రిటన్ వలస పాలనలో ఉన్న సమయంలో భారత్‌లో ప్రవేశపెట్టిన ఈ చట్టం స్వలింగ సంపర్కకుల హక్కులను హరించిందని యుఎన్ తెలిపింది. సుప్రీం తీర్పు స్వలింగ సంపర్కుల ప్రాథమిక హక్కులను పునరుద్ధరించిందని ప్రకటించింది.

స్వలింగ పెళ్లిళ్లకు మద్దతివ్వం

స్వలింగ సంపర్కం నేరం కాదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) తెలిపింది. అయితే స్వలింగ పెళ్లిళ్లకు మద్దతు తెలుపమని, ఇది అసహజమైనదని ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ ప్రముఖ్ అరుణ్ కుమార్ అన్నారు. సెక్షన్ 377 స్వలింగ సంపర్కం నేరమని చెప్తుంది. ఇది సమానత్వ హక్కుకు భంగకరమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంగా, స్వలింగ సంపర్కానికి తాము వ్యతిరేకులం కాదని ఆయన చెప్పారు. స్వలింగ పెళ్లిళ్లు ప్రకృతికి విరుద్ధమని ఆయన అన్నారు. ఇటువంటి సంబంధాలను తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. భారతీయ సంప్రదాయాలు ఇటువంటి వాటిని అంగీకరించవని, మనుషులు అనుభవాల నుంచి నేర్చుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ అరుణ్ కుమార్ అన్నారు. దీనిపై సామాజిక, మానసిక స్థాయిలో చర్చ జరగాలని ఆయన చెప్పారు.