Home ఎడిటోరియల్ బీహార్‌పై సెక్యులరిస్టుల ఆశలు

బీహార్‌పై సెక్యులరిస్టుల ఆశలు

Politicalబీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒక అసాధారణమైన ఆసక్తి ఈ రోజున దేశమంతటా ఏర్పడి ఉంది. బహుశా అంతర్జాతీయంగా కూడా కావచ్చు. నవంబర్ 8న వెలువడగల ఫలితాల గురించి సాధారణమైన ఆసక్తులు రెండు ఉండగా, అసాధారణమైంది ఒకటున్నది. బీహార్‌లో ఉన్నత వర్గాల పాలన ముగిసి దాని స్థానంలో బలహీన వర్గాలు అధికారానికి వచ్చే కొత్త చరిత్ర మొదలై ఇప్పటికి పాతికేళ్ళు గడిచింది. మొదట పదిహేనేళ్ల పాటు లాలూప్రసాద్ యాదవ్, రాబ్డీ దేవి, తర్వాత గత పదేళ్లుగా నితీశ్‌కుమార్ ముఖ్యమంత్రులుగా ఉన్నారు. వారి పార్టీలు లోహియా, జయప్రకాశ్ నారాయణ్‌ల వారసత్వాలు, మండల్ నివేదిక నేపథ్యం గలవి. వీరినుంచి అధికారాన్ని తిరిగి చేజిక్కించు కునేందుకు ఉన్నత వర్గాలు ఈ మధ్య కాలంలో శాయశక్తులా ప్రయత్నించి విఫల మయ్యాయి. ఇప్పుడు మరొకమారు ఉద్దండరణం సాగిస్తున్నాయి. ఇందులో ఎవరు గెలవనున్నారు?
రెండవ ప్రశ్న 2014 సాధారణ ఎన్నికల నాటి నరేంద్రమోడీ ఉధృతి ఈ బీహార్ ఎన్నికలలో ఏ విధంగా ప్రతిఫలించగలదన్నది సూటిగా చెప్పా లంటే, ఏడాదిన్నర పాలన తర్వాత ఆ ఉధృతి ఇంకా నిలిచి ఉందా లేదా అన్నది. గత పద్దెనిమిది మాసాల కాలంలో దేశంలో పలు ఎన్నికలు చట్టసభలకు, స్థానిక సంస్థలకు కూడా జరిగాయి. అవి మిశ్రమ ఫలితాలనిచ్చాయి. వాస్తవానికి లోక్‌సభ ఉప ఎన్నికలు, కొన్ని అసెంబ్లీలకు జరిగిన సాధారణ ఎన్నికలనుంచి మొదలుకొని స్థానిక ఎన్నికల వరకు జరిగిన ఎన్నికలన్నింటిని మోడీకి ముడిపెట్టి చూడ నక్కరలేదు. కాని ఆ పనిచేయటానికి రెండు కారణా లున్నాయి. ఒకటి, ఆ పని వేరెవరోగాక మోడీ, బిజెపి, సంఘ్‌పరివార్ స్వయంగా చేసినవే, చేస్తు న్నదే. 2014ఎన్నికలలో బిజెపి సిద్ధాంతాలు, మేనిఫెస్టోను దాదాపు పూర్తిగా విస్మరించి వ్యక్తిగతం గా నరేంద్రమోడీయే సిద్ధాంతం-మేనిఫెస్టో కూడా అన్నట్లుగా సాగింది ప్రచారం. కారణాలు ఏవైనా ఆ ప్రచారం విజయవంతమైనమాట కాదనలేనిది. ఇది ఒక కారణం కాగా, అదే మోడీ ప్రతిష్టను కొనసాగించి యావద్దేశాన్ని తమ పాలన లోకి తెచ్చుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తున్నది. మరొక విధంగా చెప్పాలంటే ఆ పార్టీ సిద్ధాంతం-మేనిఫెస్టో ఇప్పటికీ మోడీయే అన్నట్లు వారు ముందుకు సాగుతున్నారు. అందువల్లనే ఆయనను 2014 తర్వాతి ఎన్నికలనుంచి మొదలుకొని ప్రస్తుత బీహార్ ఎన్నికలవరకు ముడిపెట్టి మాట్లాడవలసి వస్తున్నది. స్వయంగా మోడీ కూడా తనను తాను అదే పద్ధతిలో ఆవిష్కరించుకుంటున్నారు గనుక, మనకు భిన్నమైన దృష్టి ఏర్పడే అవకాశం లేదు. అందువల్ల, 2014 నాటి మోడీ ఉధృతి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ఏ విధంగా ప్రతి ఫలించనున్నది రెండవ ఆసక్తికరమైన విషయమవు తున్నది. మామూలుగా నైతే ఇది కూడా అసాధార ణమైన ఆసక్తిని కలిగించే అంశమే. కాని మతతత్త-లౌకికవాద సిద్ధాంతాల ఘర్షణకు సంబంధించి ఇటీవల కొత్త పరిస్థితి ఏర్పడినందువల్ల ఇది అసా ధారణమై, మోడీ ప్రభావం కొనసాగుదల అన్నది సాధారణ విషయ మవుతున్నది. బిజెపికి, పరివార్‌కు తమ దృక్కోణం నుంచి ఇది అసాధారణమే. కాని తక్కిన దేశానికి ఇతర పరిస్థితుల వల్ల ఇది సాధారణమైన మత తత్తం-సెక్యులరిజం ప్రశ్న ప్రధానంగా మారింది.
ఇపుడు బీహార్ ఫలితాలపై దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కూడా ఆ ఫలితాలు మతతత్తా నికి సంబంధించి, లౌకికవాదానికి సంబంధించి ఎటువంటి సంకేతాలనివ్వబోతున్నాయనే ఆసక్తి ఏర్పడింది. ఆ ఫలితాలు ఏ ధోరణిని ఉత్సాహపరచి దేనిని నిరుత్సాహపరచనున్నాయని అందరూ ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారనటం అతిశయోక్తి కాదు. బిజెపి విజయం మతతత్త శక్తుల విజయ మవుతుందన్న భావన సాధారణ రూపంలో ఎప్పుడూ ఉన్నదే. కాని ఇటీవలి మాసాల్లో పరివార్ సంస్థలు మోడీ పాలనను ఆసరాగా చేసుకొని తమ భావజాలాన్ని ఇతరులపై రుద్ద జూస్తున్న తీరు చాలా ఆందోళనకరంగా మారింది. కనుకనే బీహార్‌లో బిజెపి గెలుస్తుందా, ఓడుతుందా అన్నది అసాధా రణమైన ఆసక్తిని కలిగిస్తున్నది. సెక్యులర్ వాదులు బిజెపి ఓటమి కోసం నితీశ్-లాలూ కూటమి గెలుపు అనే దానిని పక్కన ఉంచి ఈ దృష్టితో భగవంతునికి ప్రార్థనలు జరుపుతుండవచ్చుకూడా. ఒకవేళ బిజెపి ఓడకపోతే, పరివార్ స్థైర్యం ఎంత పెరుగుతుందో, సెక్యులర్ వాదులకు ఎంతగా దెబ్బతగులుతుందో ఊహించటం కష్టం. ఇటువంటి విపత్కర స్థితిని సెక్యులర్ వాదులు మొదటినుంచీ గల తమ వైఫల్యాల వల్ల తెచ్చుకున్నారన్నది వేరే విషయం. ఆ చర్చ అప్రస్తుతం. కాని ఒకవేళ బిజెపి ఓడినట్లయితే సెక్యులర్ వాదులు ఏమి చేయగలరన్నది మాత్రం విచారించదగినదే. దానితో ఇక సెక్యులరిజానికి ముప్పు తప్పిందని భావించి తిరిగి తమ పాత పద్ధతులలోకి పోతారా, లేక కనీసం ఇకనుంచైనా లౌకికభావనలను నిజమైన అర్థంలో పెంపొందించేం దుకు కృషి చేస్తారా చూడాలి.
పరివార్ గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగు తుంది. ఆ సంస్థల అంతిమ లక్షమేమిటో అందరికీ తెలిసిందే. అది హిందూ రాష్ట్రస్థాపన. భారతదేశం లో హిందూజాతి నిర్మాణం. హిందూ జాతి ఆధిపత్య సాధన. అందుకోసం నేరుగా అదేపేరిట ప్రయత్నించి సఫలం కావటం సాధ్యం కాదని వారికి తెలుసు. మతం పేరుతో, జాతిపేరుతో ముందుకు వెళ్లటం రాజ్యాంగబద్ధం, చట్టబద్ధం కాని విషయాలు. బహుశా అంతకన్న ముఖ్యంగా, హిందువులు మత విశ్వాసపరులేగాని మతతత్తపరులు కానందున పరివార్ ప్రత్యక్ష వ్యూహం నెరవేరగలది కాదు. ఈ రెండు కారణాలవల్ల లోగడ జనసంఘ్, తర్వాత బిజెపి అనే రెండు పార్టీలను ఏర్పాటు చేసిన ఆర్‌ఎస్‌ఎస్, పరోక్ష వ్యూహాలతో ముందుకు వెళ్లేం దుకు ప్రయత్నిస్తూ వస్తున్నది. బిజెపి ఇతర పార్టీలకు మద్దతు ఇచ్చిన సందర్భాలలో ఆ పార్టీల మెతక దనాన్ని ఆధారం చేసుకుని, సంకీర్ణ ప్రభుత్వాలలో చేరినపుడు తమ మంత్రుల అధికారాన్ని అనువు చేసుకుని, ఒకవేళ తమ ప్రభుత్వమే ఏర్పడితే ఆ అధికారంతో చాపకింద నీరువలె హిందూ వాదాన్ని ముందుకు తీసుకుపోవటం వారి పద్ధతి.
అంతవరకు బాగానే ఉంది. అది సఫలమైనా, విఫలమైనా సంఘర్షణాస్థితి మాత్రం ఉండదు. ప్రజలను పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఒప్పించ టం లేదా ఒక మేరకు విధిలేని పరిస్థితులను సృష్టిం చటం, లేదా ప్రచారాలతో తప్పుదారి పట్టించటం, లేదా ప్రలోభపెట్టటంవంటివి ఉంటాయి. ఇవన్నీ ఆమోదకరమైనవి, నైతికమైనవని కాదు. కాని కనీసం ఘర్షణాస్థితి, హింసలేక పోవటం వరకు సంతోషించ వచ్చు. వాజపేయి నాయకత్వాన మొదటి ఎన్‌డిఎ మైనారిటీ ప్రభుత్వం కనీసం ఒక్కరి మద్దతు అయినా పొందలేక రెండు వారాలకే పతనమైన తర్వాత పరివార్ కొత్త ఎత్తుగడకు మారింది. అది రామ మందిరం, ఆర్టికల్ 370, ఉమ్మడి పౌరస్మృతి గురించి మాట్లాడటానికి బదులు సామాన్యుడు-అభివృద్ధి-రోటీ కపడా మకాన్-సుపరిపాలన-ప్రజల భద్రత వగైరాలను అజెండాపై ముందుకు తెచ్చి పై మూడింటిని వెనుకకు నెట్టటం. దానిని బట్టి, ఈ దేశంలో వాస్తవిక పరిస్థితులు ఏమిటో పరివార్ కు అనుభవపూర్వంగా తెలిసివచ్చిందనే అభి ప్రాయం కలిగింది. ఆ స్థితిలో వారు గతంలోవలె పరోక్ష పద్ధతులలో తమ హిందూత్వ అజెండాను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయగలరని, ఇక ఘర్షణ స్థితికి, ప్రత్యక్ష పద్ధతులకు పూనుకోరని అనిపించింది.
2014 ఎన్నికలలో మోడీని ముందుకు తెచ్చినపుడు కూడా ఇదే ధోరణి కనిపించింది. అపుడు ప్రచారమంతా సమర్ధవంతమైన పరిపాలన, అభివృద్ధి, అవినీతి రాహిత్యం, ఉపాధికల్పన, భద్రత అనే అంశాలచుట్టే తిరిగింది. ఈ హామీలను మోడీ నిలబెట్టుకుంటూ ప్రజలలో సదభిప్రాయాన్ని పెంచు కుంటూపోతే, ఆ సానుకూల వాతావరణాన్ని అనువు గా చేసుకుంటూ, బిజెపి పాలన ఇతర పార్టీల పాలనకన్నా బాగా ఉందనే అభిప్రాయాన్ని మొదట ప్రజలలో కలిగించే ప్రచారం చేయటం మొదటి అడుగవుతుంది. ఆ పాలన బాగుందంటే వారి సిద్ధాంతాలు కూడా బాగుండటమని, బాగుండవచ్చు నని, కనుక వాటిని నమ్మవచ్చుననే అభిప్రాయం ప్రజలకు కలిగించటం రెండవ అడుగవుతుంది. ఇది క్రమంగా జరుగుతూ, ఎవరితోనూ ఘర్షణలేకుండా జాగ్రత్తపడితే తమ లక్షాలవైపు పురోగమనం ఉండే అవకాశం ఉంటుంది. కాస్త ఆలోచించగలవారు ఎవరికైన తోచే పద్ధతి ఇది. కాని, కాప్ పరివార్ సంస్థలు ఉన్నట్లుండి ఘర్షణవైపు తిరిగాయి. అది కూడా మోడీ పాలన పట్ల ప్రజలలో ఆదరణ తగ్గటం మొదలైన తర్వాత. ఆ విధంగా అది రెండింతల పొరపాటవుతుంది. పరివార్ తీరు ఆశ్చర్యాన్ని కలిగించటం అందుకే. కనుక బీహార్‌పై సెక్యుల రిస్టుల ప్రార్థనలను దేవుడు మన్నించవచ్చు.
-9848191767