Search
Saturday 17 November 2018
  • :
  • :

తల్లికి బంగారు బోనం

kcr

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి
అమ్మకు 3 కిలోల బంగారు బోనం
1008 మంది మహిళలతో కలిసి
వెళ్లి సమర్పించిన ఎంపి కవిత
ప్రారంభమైన లష్కర్ బోనాలు
అమ్మవారిని దర్శించుకున్న
ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు,
ఎంపి సంతోష్‌కుమార్, మంత్రులు
నాయిని, ఇంద్రకరణ్, మేయర్
రాంమోహన్ తదితర ప్రముఖులు
నేడు రంగం

మన తెలంగాణ/హైదరాబాద్ సిటీబ్యూరో: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ లష్కర్ బోనాలు ఘనంగా ప్రారంభమైనాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడితో దేవాలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఉదయం 11.30 గంటలకు సిఎం కె.చంద్రశేఖర్‌రావు సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టువస్త్రాలను సమర్పించారు. కెసిఆర్ దంపతులకు వేదమంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రభుత్వం సమర్పించిన 3 కేజీల బంగారంతో ప్రత్యేకంగా తయారు చేసిన బోనాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. అమ్మవారికి బంగారు ముక్కుపుడక, ఖడ్గం, వజ్రాల బొట్టును మంత్రి తలసాని సమర్పించారు.

bonalu

తెల్లవారు జామున 4.05 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మహాకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి తొలిబోనాన్ని సమర్పించారు. ఉదయం 9.30 గంటలకు మోండామార్కెట్ ఆదయ్య నగర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం తరపున తయారు చేయించిన బంగారు బోనానికి రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి..ఎంపి కవితకు అప్పగించారు. బోనాలు ఎత్తుకున్న 1008 మంది మహిళలతో కలసి ఆమె బంగారు బోనాన్ని ఎత్తుకుని మహాంకాళి దేవాలయం వరకు ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి పూజలు జరిపి బోనాన్ని సమర్పించారు. రంగం కార్యక్రమం నేడు నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, రాష్ట్రమంత్రులు, నాయిని నరసింహారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు బండారు దత్తాత్రేయ, గుండు సుధారాణి, సీహెచ్.మల్లారెడ్డి, సంతోష్‌కుమార్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎంఎల్‌ఏలు శ్రీనివాస్‌గౌడ్, కిషన్‌రెడ్డి, జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్, కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి సర్వేసత్యనారాయణ, మాజీ ఎంపీ వీహెచ్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
బోనాలకు హైదరాబాద్ ప్రసిద్ధ్ధి : కరణ్ రెడ్డి

indrakaran
ఆషాఢ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో అమ్మవారికి ప్రభుత్వం బంగారు బోనాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా తెలుగు వారందరికి శుభాకాంక్షలు. బోనాలకు హైదరాబాద్ ప్రసిద్ధి చెందింది. తెలంగాణ ఉద్యమంలో ఆడపడుచులందరూ బోనంను ఎత్తుకొని స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొని బోనాల పండుగ విశిష్టత గురించి ప్రపంచానికి చాటిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా 1500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు రెండు నెలల నుంచి ఉత్సవాల కోసం మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు గౌడ్, ఎంపి మల్లారెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. పాత బస్తీలో ఆగస్టు 5న బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సోమవారం రంగం కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
సుభిక్షంగా ఉండాలని కోరాను : నాయిని
బోనాల ఉత్సవాల సందర్భంగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డితో కలసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండాలని, రైతుల కష్టానికి తగిన న్యాయం జరిగి, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారికి కోరినట్లు చెప్పారు. గత నాలుగు సంవత్సరాలుగా ఏ ఒక్క ఘటన జరగకుండా తెలంగాణ పోలీసు శాఖ బాగా పనిచేస్తుందని ఆయన అన్నారు.

kavita

తెలంగాణ ఆడబిడ్డలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. రాష్ట్రాన్ని సాధించుకున్నాకే మన గుర్తింపు
వచ్చింది. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఉజ్జయిని అమ్మవారికి
ఎంపి  కవిత

Comments

comments