Home జాతీయ వార్తలు వివక్ష వల్లే అనర్థం

వివక్ష వల్లే అనర్థం

స్వలింగ సంపర్కులను సమాజం హీనంగా చూడడం వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది
తరతరాలుగా నాటుకుపోయిన చిన్నచూపు తొలగితే వారి అనర్హతలు అంతమవుతాయి
ఐపిసి 377పై విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్య

Supreme respond on SC and ST judgmentన్యూఢిల్లీ: వయోజనుల పరస్పర అంగీకార స్వలింగ సంపర్కం నేరంగా పరిగణిస్తున్న నిబంధన తొలగిపోతే దానితో పాటే అలాంటి సంబంధాలను సమాజం హీనంగా చూడడం,  ఎల్‌జిబిటి(లెస్బియన్,గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గం పట్ల వివక్ష లాంటి దానికి సంబంధించిన సమస్యలన్నీ పోతాయని సుప్రీం కోర్టు గురువారం వ్యాఖ్యానించింది. స్వలింగ సంపర్కం తీవ్రమైన నేరమనే వాతావరణాన్ని మన సమాజంలో చాలా సంవత్సరాలుగా సృష్టించారని, ఆ వర్గం పట్ల బలంగా నాటుకు పోయిన వివక్షకు అదే కారణమని స్వలింగ సంపర్కాన్ని నేరంగా  పేర్కొంటున్న భారత శిక్షాస్మృతి(ఐపిసి)లోని 377సెక్షన్‌ను కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న అయిదుగురు న్యా యమూర్తుల ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ అలాంటి వారి పట్ల వివక్ష వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావానికి కారణమవుతోందని పేర్కొంది. స్వలింగ సంపర్కులు  మిగతా వారికి లభించే హక్కుల్లో దేన్నయినా పొందకుండా అడ్డుకొనే  చట్టం, నిబంధన, సబ్ లా, లేదా మార్గదర్శకం ఏదైనా ఉందా అని ఒక పిటిషనర్ తరఫు న్యాయవాది మనేకా గురుస్వామిని ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. అలాంటి నిబంధన ఏదీ లేదని దానికి ఆమె సమాధానమిచ్చారు. దీంతో పరస్పర అంగీకార స్వలింగ సంపర్కం  నేరంగా పరిగణిస్తున్న కారణంగానే  ఆ వర్గం సమాజంనుంచి ఏవగింపును ఎదుర్కొంటోందని, అది పోతే వివక్ష, ఏవగింపు లాంటివన్నీ పోతాయని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు ఆర్ ఎఫ్ నారిమన్, ఎఎం ఖన్విల్కర్, డివై చంద్రచూడ్, ఇందు మల్హోత్రాలు సభ్యులుగా ఉన్నారు.ఐపిసి లోని 377వ సెక్షన్  ‘అసహజ నేరాల’ గురించినది. ఒక మగవాడితో, లేదా స్త్రీతో, లేదా జంతువుతో సహజమైన రీతిలో కాకుండా అసహజంగా రతి జరిపిన వ్యక్తికి జీవిత ఖైదు లేదా, విచక్షణ ఆధారంగా పదేళ్ల దాకా  జైలు శిక్ష,  జరిమానా విధించవచ్చని ఈ సెక్షన్ చెబుతోంది. కాగా మానసిక వైద్యం చట్టంలోని నిబంధనను బెంచ్ ప్రస్తావిస్తూ, లైంగిక పాఠాల పేరుతో అలాంటి వ్యక్తుల పట్ల వివక్ష చూపించరాదనే వాస్తవాన్ని అది కూడా గుర్తించిందని వ్యాఖ్యానించింది. ఎల్‌జిబిటి వర్గం వివిధ కారణాల వల్ల వివక్షకు గురవుతున్న కారణంగా కేవలం 377 సెక్షన్‌ను కొట్టివేసినంతమాత్రాన సరిపోదని మరో పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సియు సింగ్ వ్యాఖ్యానించినప్పుడు  బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. సమాజంలో నెలకొన్న వివక్ష కారణంగా తమకు సరయిన వైద్య చికిత్స కూడా లభించదనిఆ వర్గం భావిస్తోందని  జస్ట్టిస్ మల్హోతా్ర అంటూ, చివరికి వైద్య రంగంలోని ప్రొఫెషల్స్ కూడా గోప్యత పాటించరని అన్నారు. వయోజన పరస్పర అంగీకార స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్న నిబంధన రాజ్యాంగ బద్ధతను తేల్చే బాధ్యతను బుధవారం కేంద్రం సుప్రీంకోర్టుకే వదిలిపెట్టిన విషయం తెలిసిందే. అయితే  ఐపిసి 377 సెక్షన్‌లోని ఈ ఒక్క అంశంపైనే  కోర్టు నిర్ణయం తీసుకోవాలని కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌ను బెంచ్ ప్రస్తావిస్తూ,  ఇద్దరు వయోజనుల పరస్పర అంగీకార స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే  చట్టాన్ని మాత్రమే పరిశీలిస్తామని, ఒక వేళ తాము ఆ చట్టంలోని  శిక్షార్హమైన నిబంధనలను తొలగిస్తే, ఎల్‌జిబిటి వర్గంపై ఉన్న అనర్హ్హతలు తొలగి పోయి వారు కూడా త్రివిధ దళాల్లో చేరడం, ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలవుతుందని పేర్కొంది. ఇదే జరిగితే అలాంటి వారిని  చిన్న చూపు చూసే రోజులు పోతాయని పేర్కొంది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొంటున్న ఇలాంటి చట్టం సమాజం ఏవగింపునకు ఒక ఉదాహరణ అని బెంచ్ తీవ్రంగా వ్యాఖ్యానించడం తెలిసిందే