Search
Wednesday 21 November 2018
  • :
  • :

నోటి దురుసు వల్ల ‘సెల్ఫీ రాజా’కు సమస్యలు

selfie-rajaఅల్లరి నరేష్, సాక్షి చౌదరి, కామ్న రానావత్ హీరో, హీరోయిన్‌లుగా ఈశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై.లి. సుంకర రామబ్రహ్మం సమర్పణలో గోపి ఆర్ట్ పతాకంపై చలసాని రామబ్రహ్మం చౌదరి నిర్మిస్తున్న చిత్రం ‘సెల్ఫీ రాజా’. ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ ఈనెల 15న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం పాటలను వినూత్న పద్ధతిలో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సినిమాలోని మొదటి పాటను సీనియర్ జర్నలిస్టులు పసుపులేటి రామారావు, వినాయకరావు, సాయి రమేష్, ఆనంద్ కలిసి సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ “రచయితలు శ్రీధర్ సీపాన, డైమండ్ రత్నబాబు, విక్రంరాజు ఈ సినిమాకు పనిచేశారు. మా టీం అంతా కలిసి మంచి హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమాకు పనిచేశాం. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ ఇది. స్పూఫ్‌ల్లాంటివి ఉండవు. సినిమాలో ‘సెల్ఫీ రాజా’కు ఒక సమస్య ఎదురవుతుంది. దీని నుండి బయట పడడానికి రకరకాల గెటప్‌లు వేస్తుంటాడు. సెల్ఫీల వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది చాలా కొత్తగా చూపించాం. ఈ సినిమాలో సాయికార్తీక్ ఐదు మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్‌సాంగ్ రిలీజ్ చేశాం. రెండో పాటను వైజాగ్, మూడో పాటను విజయవాడ, నాలుగో పాటను వరంగల్‌లో రిలీజ్ చేయాలని చూస్తున్నాం”అని అన్నారు. సంగీత దర్శకుడు సాయికార్తీక్ మాట్లాడుతూ “ఈమధ్యనే ఈడో రకం ఆడో రకం, సుప్రీమ్ చిత్రాలు సక్సెస్ అయి 50 రోజుల ఫంక్షన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాం. ‘సెల్ఫీరాజా’తో కూడా 50 రోజుల ఫంక్షన్ జరుపుకుంటామని చాలా నమ్మకంగా ఉన్నాం. ఆడియోతో పాటు సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. దర్శకుడు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ “ఈ చిత్రంలో నరేష్ చాలా కొత్తగా కనిపిస్తాడు. సినిమా కూడా అలాగే కొత్తగా ఉంటుంది. రెండు గంటలపాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే చిత్రమిది. ఇందులో హీరోకు సెల్ఫీ వీక్‌నెస్ ఉంటుంది. సెల్ఫీ వల్ల మంచి, చెడు రెండూ జరుగుతాయి. మా సెల్ఫీ రాజా నోటి దురుసు వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి… వాటిని అతను ఎలా ఎదుర్కొన్నాడు అనేది ప్రధాన కథాంశం. సాయికార్తిక్ అద్భుతమైన పాటలనిచ్చాడు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సాక్షి చౌదరి, పాటల రచయిత గణేష్, కమేడియన్‌లు పృథ్వీ, నల్లవేణు, తాగుబోతు రమేష్, రచ్చ రవి, నాగినీడు, కిషోర్ గరికపాటి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments