Home హైదరాబాద్ తరుగుతో జేబులకు చిల్లు

తరుగుతో జేబులకు చిల్లు

Selling with color ful packs

తూకాల్లో మోసాలు..ధరల్లో వ్యత్యాసాలు!
కలర్‌ఫుల్ ప్యాకింగ్‌లతో అమ్మకాలు
కిలోకు 150 గ్రాముల తరుగు!
ఎలక్ట్రానిక్ కాంటాలతో మరింత మోసం
గమనించకపోవడంతో మోసపోతున్న వినియోగదారులు

మన తెలంగాణ /సిటీబ్యూరో: కలర్‌ఫుల్ ప్యాకింగ్‌లు…ఆకర్షణీయమైన ప్రకటనలతో కొందరు వ్యాపార సంస్థలు వినియోగదారులను మోసం చేస్తున్నాయి. చిల్లర దుకాణాల దగ్గరనుంచి పెద్ద పెద్ద వ్యాపార సముదాయాల వరకు కళ్లకు కనబడని మోసాలతో కనికట్టు చేస్తున్నారు. తూకాల్లో మోసాలు..ధరల్లో వ్యత్యాసాలతో ఎడాపెడా జనం సొమ్మును దొచేసుకుంటున్నారు. గతంలో ఆహార పదార్థా లు, కూరగాయలు, ఇతరత్రా కొనుగోలు చేసినప్పుడు కొసరు, మొగ్గు అని వ్యాపారు లు కాస్తంత ఎక్కువ తూకం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ధరలు ఆకాశానంటుతున్న నేపథ్యంలో కాటాలు, తక్కెడలు పోయి వాటి స్థానంలో డిజిటల్ కాటాలు వచ్చి చేరాయి. దీంతో పక్కాగా తూకం వేయడంతో పాటు చేతి వాటాన్ని చూపి తక్కువ తూకం వేసి డబ్బులు దండుకుంటున్నారు. ప్రతి పదార్థాన్ని బంగారంలానే భావిస్తున్నారు. కొందరు వ్యాపారులైతే కనికట్టు విద్యలను ప్రదర్శిస్తూ కొనుగోలు దారులను తెలివిగా మోసం చేస్తున్నారు. రాళ్ల కాటాలల్లో హెచ్చు తగ్గులు ఉంటాయనే విషయం అందరికీ తెల్సిన వి షయమే. ఇప్పుడు వ్యాపారులు పంథాను మార్చి ఎలక్ట్రానిక్ కాంటాల ద్వారా ఎక్కువ మోసానికి పాల్పడుతున్నారు. తూకాల్లోనే కాదు ధరల్లోనూ హోల్ సేల్, రిటైల్ దుకాణాలు, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్ నిర్వాహకులు కళ్లకు కనబడకుండా చాలా తెలివిగా మోసాలకు పాల్పడి వినియోగదారుల సొమ్మును దోచుకుంటున్నారు. ఆహారపదార్థాలపై ఉండే ఎంఆర్‌పి(మాక్జిమం రిటైల్ ప్రైస్) ధరల కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

తూకంలో తేడాలు ఇలా…
సాధారణంగా మనం షాపులకు వెళ్లి ద్రవ పదార్థాలను లీటర్లలో, ఘన పదార్థాలలను కిలో గ్రాముల్లో కొలిచి తీసుకుంటాము. కానీ మనం ఘన పదార్థాలు కొనుగోలుకు వెళ్లినా కొన్ని దుకాణాల్లో ఎలక్ట్రానిక్ కాటాల్లో ద్రవ పదార్థాల తూకం మోడ్‌లో ఉంచి తూకం వేసి దొచుకుంటున్నారు. కాటా స్క్రీన్‌పై (ఎల్) అనే అక్షరం మాత్రం కనిపించకుండా స్టిక్కర్ అతికిస్తున్నారు. లీటర్ ఘన పదార్థం బరువు 1000 గ్రాములు అయితే ద్రవ పదార్థం బరువు 850 గ్రాములు మాత్రమే వస్తుంది. ఎలక్ట్రానిక్ కాటాలో ఆప్షన్‌ను లీటర్ల మోడ్‌లోకి మార్చి ఘనపదార్థాల తూకం వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. స్క్రీన్‌పై కనిపించేది లీటర్ల తూకం అయినా కొనుగోలు దా రులకు మాత్రం కిలోలుగా చూపించి మోసం చేస్తున్నారు. అంతగా గమనించరు. వినియోగదారుడు 100 నుంచి 150 గ్రాముల వరకు నష్ట పోతున్నారు. ఈ తంతు అంతా చిన్న దుకాణాల దగ్గర నుంచి పెద్ద దుకాణాలు, మార్కెట్స్‌ల్లో బహిరంగంగానే జరుగుతోంది.

నామమాత్రపు దాడులతోనే సరి….
చిల్లర దుకాణాలు, చికెన్, మటన్, చేపల షాపులు, కూరగాయాల మార్కెట్లపై తూనికలు కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వ్యాపారులు ఇష్టం వచ్చినట్లు తూకం వేసి వినియోగదారులను తెలివిగా దోచుకుంటున్నారు. కాటాల్లో మోసం జరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా వినియోగదారుడికి తెలియని పరిస్థితి. తూనికల కొలతల శాఖ అంటూ ఒకటి ఉంటుందని చాలా మందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎలక్ట్రానిక్ కాటాలకు ప్రభుత్వ సీల్ ఉండాలి. కానీ కొన్ని దుకాణాల్లో సీల్ లేకుండానే ఎలక్ట్రానిక్ కాటాలు వినియోగిస్తున్నారు. ఈ మోసాలు చలిల్లర దుకాణాల్లో కొద్దిమేర మాత్రమే వ్యత్యాసం వస్తుండగా చికెన్, మటన్, చేపల దుకాణాల్లో మాత్రం భారీగా తేడాలు వస్తున్నట్లు తెలుస్తోంది. మాంసాన్ని కాటా వేసే ముందు ఆ మాంసాన్ని తడుపు తుండటంతో ఎక్కువ బరువు తూగుతోంది. ఇలా మార్కెట్‌లో జరిగే క్రయ విక్రయాల్లో వినియోగదారుడు నిత్యం మోసపోతున్నాడు. పట్టించుకోవాల్సిన అధికారులు నామమాత్రపు దాడులతో సరిపెట్టుకుంటున్నారు. ఇటీవల మెహిదీపట్నం, బంజారా హిల్స్ షాపింగ్ మాల్స్‌లో అధికారులు దాడులు చేసి పదికి పైగా కేసులు నమోదు చేసి, దాదాపు రూ30లక్షల ఖరీదైన ఆహార పదార్థాలను సీజ్ చేసిన విషయం తెలిసిందే.