Home తాజా వార్తలు 36,000 దాటిన సెన్సెక్స్

36,000 దాటిన సెన్సెక్స్

Domestic stock markets

453 పాయింట్లు  లాభపడిన సూచీ

ముంబయి : వరుసగా నాలుగో సెషన్ మార్కెట్లు దుమ్మురేపాయి. గురువారం మార్కెట్లు అత్యంత ఉత్సాహంగా కనిపించాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడంతో సెన్సెక్స్ 36 వేల మార్క్‌ను క్రాస్ చేసింది. 2019లో ఆశించిన మేరకు వడ్డీ రేట్ల పెంపు ఉండబోదని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ సంకేతాలు ఇవ్వడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గడువు తేదీ అయినప్పటికీ ప్రారంభంలోనే సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీతో 36,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఓ దశలో సెన్సెక్స్ ఏకంగా 500 పాయింట్లను దాటింది. ఆఖరికి 453 పాయింట్లు లాభం తో 36,170 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 130 పాయింట్లు పెరిగి 10,859 వద్ద నిలిచింది. 2016 మార్చి తరువాత నవంబర్ సిరీస్‌లో నిఫ్టీ అత్యధిక లాభాలను ఖాతాలో వేసుకుంది. ఎన్‌ఎస్‌ఇలో అన్ని రంగాలూ లాభపడగా, రూపాయి బలపడటం ఐటి కంపెనీలకు ప్రతికూలంగా మారి నష్టాలకు కారణమైంది. మెటల్, బ్యాంక్ నిఫ్టీ 2 శాతం మేరకు లాభపడ్డాయి. ఎఫ్‌ఎంసిజి, ఆటో, రియల్టీ రంగాలు 1.3 శాతం మేరకు పెరిగాయి.

ఇదే బాటలో ఫార్మా కూడా 1 శాతం లాభపడింది. బుధవారం అమెరికా మార్కెట్లు 2.5 శాతం లాభపడడంతో ఆసియాలోనూ మార్కెట్లు సానుకూలంగా ముందుకు సాగాయి. ప్రధానంగా బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంక్, బజాజ్ ఆటో, హిందాల్కో, ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్, బజాజ్ ఫిన్, జెఎస్‌డబ్లు స్టీల్, డాక్టర్ రెడ్డీస్, బిపిసిఎల్ 4 నుంచి -3 శాతం మధ్య పెరిగాయి. హెచ్‌సిఎల్ టెక్, పవర్‌గ్రిడ్, ఒఎన్‌జిసి, టెక్ మహీంద్రా, ఎన్‌టిపిసి, టిసిఎస్, యస్ బ్యాంక్, కోల్ ఇండియా నష్టాలను మూటగట్టుకున్నాయి. బిఎస్‌ఇలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం బలపడింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1,317 లాభపడగా, 1,294 షేర్లు నష్టాలతో ముగిశాయి. బుధవారం ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు) రూ. 961 కోట్లను ఇన్వెస్ట్‌చేశారు. మరోవైపు డిఐఐ(దేశీ ఫండ్స్) రూ. 330 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించాయి.

Sensex Crosses 36,000 Mark

telangana latest news