Home తాజా వార్తలు నిఫ్టీ @ 11,000

నిఫ్టీ @ 11,000

 36,548 పాయింట్ల మార్క్ దాటిన సెన్సెక్స్

  జీవనకాల గరిష్ఠానికి మార్కెట్ సూచీలు

bs

న్యూఢిల్లీ : దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం రికార్డులను నెలకొల్పాయి. ముడి చమురు ధరల పతనంతో పాటు ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్ షేర్ల ర్యాలీతో మార్కెట్ వరుసగా ఐదో రోజూ లాభాలతో ముగిసింది. నిప్టీ50 సూ చీ కీలక మైలురాయి 11 వేలను దాటింది. సెన్సెక్స్ కూడా 282 పాయింట్ల లాభంతో రికార్డు స్థాయి 36,548 పాయింట్ల మార్క్‌ను చేరుకుంది. దీంతో 2018 జనవరి 29న రికార్డు స్థాయి గరిష్ఠం 36,283 పాయింట్లను అధిగమించినట్టయింది. అదే సమయంలో 75 పాయింట్ల లాభంతో నిఫ్టీ 11,023 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో మార్కెట్లు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాయి. ఫైనాన్షియల్, ఎనర్జీ స్టాక్స్ ర్యాలీతో సూచీలు దూసుకెళ్లాయి. కార్పొరేట్ ఫలితాలు, ఏసియన్ షేర్లు పటిష్ఠంగా ఉండడంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి, ఎల్ అండ్ టి షేర్లు భారీగా లాభపడడంతో ఇంట్రాడేలో సెన్సెక్స్ రికార్డు స్థాయి 36,699 పాయింట్లను దాటింది. ఇంట్రాడేలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటల్ 100 బిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసింది. టిసిఎస్ తర్వాత ఈ మైలురాయిని దాటిన కంపెనీ రిలయన్స్ కావడం గమనార్హం.
అయితే మార్కెట్ పెరగడానికి కారణాలు అనేక ఉన్నాయి. వాటి ఒకటి టిసిఎస్ ఫలితాలు.. ఇతర కంపెనీల జూన్ త్రైమాసిక ఫలితాలు ఇలాగే ఉండవచ్చని ఇన్వెస్టర్లలో ఆశలురేపాయి. దేశీయ వృద్ధిరేటు పెరగటం, మార్చి త్రైమాసికానికి జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) పెరుగుదల 7.7శాతం చేరడం సానుకూల అంశంగా ఉన్నా యి. జూన్ త్రైమాసికానికి బిఎస్‌ఇ సెన్సెక్స్‌లోని కంపెనీల ఆదాయం 23 శాతం పెరుగుదల నమోదు చేయవచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ట్రేడింగ్‌లో భారీ స్టాక్స్ ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్, యస్ బ్యాంక్, కొటక్ మ హీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ 1శాతం లాభపడ్డాయి. ఇది సూచీలపై సానుకూల ప్రభావం చూపింది. రిలయన్స్ 4శాతానికి పైగా లాభపడింది. ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి.
విదేశీ ఇన్వెస్టర్లు
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ. 636 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. అదే సమయంలో దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 15 కోట్లను మాత్రమే ఇన్వెస్ట్ చేశాయి. బిఎస్‌ఇలో మిడ్ క్యాప్ 0.5 శాతం బలపడింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1474 నష్టపోగా, 1168 షేర్లు లాభపడ్డాయి.
లాభాల స్వీకరణ
సూచీలు గరిష్టస్థాయికి చేరడంతో మార్కెట్ ముగియడానికి గంట ముందు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో సూచీల భారీ ర్యాలీకి బ్రేక్ పడింది. ఓ దశలో సెన్సెక్స్ సాధించిన 400పాయింట్ల లాభాల నుంచి స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందిఇ. మరోసూచీ నిఫ్టీ ఇంట్రాడే గరిష్ఠం 11,078 నుంచి కొంత దిగివచ్చింది.

100 బిలియన్ డాలర్లకు ఆర్‌ఐఎల్ 

bns

నిఫ్టీ దిగ్గజాలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఒక దశలో 6 శాతం లాభపడి రూ.1099 గరిష్టాన్ని అందుకుంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్ల(రూ.6,85,550 కోట్లకు పైగా) మార్కును దాటేసింది. కంపెనీ షేర్లు రూ.1,091 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఈ మేర పెరిగింది. చివరికి ఆర్‌ఐఎల్ షేరు 4 శాతం లాభంతో ముగిసింది. ఎన్‌ఎస్‌ఇలో బ్యాంక్ నిఫ్టీ 1 శాతం, ఎఫ్‌ఎంసిజి 0.5 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇక రియల్టీ, ఆటో, మెటల్ రంగాలు 1-0.5 శాతం మధ్య క్షీణించాయి. ప్రధాన కంపెనీల్లో బిపిసిఎల్, బజాజ్ ఫైనాన్స్, విప్రో బజాజ్ ఫిన్, డాక్టర్ రెడ్డీస్, ఎల్ అండ్ టి, హెచ్‌సిఎల్ టెక్, హెచ్‌యూఎల్, హెచ్‌డిఎఫ్‌సి 1.6 నుంచి 3- శాతం మధ్య ఎగశాయి. అయితే మరోపక్క యుపిఎల్, వేదాంతా, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, గ్రాసిమ్, ఇన్‌ఫ్రాటెల్, లుపిన్, అదానీ పోర్ట్, జీ, హీరోమోటో -1 నుంచి 4.2 శాతం మధ్య క్షీణించాయి.