Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

33.000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్

bs

ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మరోసారి పతనమయ్యాయి. సోమవారం కీలక బిఎస్‌ఇ సెన్సెక్స్ 33 వేల పాయింట్ల దిగువకు పడిపోగా, మరోవైపు నిఫ్టీ 10,100 పాయింట్ల దిగువకు చేరింది. గతేడాది డిసెంబర్ తర్వాత ఇంత కనిష్టస్థాయి వద్ద సూచీలు పతనం కావడం ఇదే తొలిసారి.. దేశీయ కరెంట్ ఖాతా లోటు(క్యాడ్) పెరగడం, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు, మార్చి 20, 21న ఫెడరల్ రిజర్వు సమీక్ష వంటి అంశాలు మార్కెట్‌ను కృంగదీశాయని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో చివరివరకూ అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఫెడ్ ఈ ఏడాది నాలుగు దఫాలు వడ్డీ రేట్లు పెంచవచ్చనే అంచనాలు ఇప్పటికే వున్నాయి. మార్చి 21నాటి సమీక్షలో ఫెడ్ రేట్ల పెంపుపై ప్రకటన చేయనున్నందున ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. ఓ వైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై దర్యాప్తు జరుగుతుండగా,. మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కొత్త మోసాలు వెలుగుచూస్తున్నాయి. వ్యాపార, వాణిజ్యవేత్తలకు ఎల్‌ఒయులను బ్యాంకులు జారీచేయడాన్ని నిషేధించడం, ఉప ఎన్నికల్లో అధికార ఎన్‌డిఎ పరాజయం పాలవడం వంటి ప్రతికూల అంశాలు గత కొద్దిరోజులుగా మార్కెట్‌ను దెబ్బతీశాయి. సోమవారంనాటి ట్రేడింగ్‌లో బ్యాంకింగ్, మెటల్ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కాగా అంతర్జాతీయంగా ఇనుప ఖనిజం ధరలు తగ్గడంతో ఎన్‌ఎండిసి, సెయిల్‌లు భారీగా క్షీణించాయి. నిఫ్టీలో భాగస్వామ్య కంపెనీలైన టాటా స్టీల్, హిందాల్కో, వేదాంతలు 1.5-3 శాతం మేరకు పడిపోయాయి. ఇక పిఎస్‌యు బ్యాంకింగ్ షేర్లు రోజంతా అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. పిఎస్‌యు బ్యాంకింగ్ దిగ్గజం 2 శాతం క్షీణించి రూ. 248 వద్ద ముగిసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు 6, 4 శాతం చొప్పున తగ్గాయి. ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లయిన యస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్‌లు 2-3 శాతం మేర క్షీణించాయి. కీలకమైన బ్యాంక్ నిఫ్టీ 1 శాతం తగ్గి 24,245 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రధాన షేర్లలో ఎన్‌టిపిసి, పవర్‌గ్రిడ్, మారుతి సుజుకి ఇండియాలు 1-2 శాతం మధ్య పెరిగాయి. హెచ్‌సిఎల్ టెక్, భారతి ఎయిర్‌టెల్‌లు 4 శాతంపైగా తగ్గుముఖం పట్టాయి.

Comments

comments