Home తాజా వార్తలు ఐదు రోజుల్లో 3.7% లాభపడింది

ఐదు రోజుల్లో 3.7% లాభపడింది

Sensex

ఎన్నికల నోటిఫికేషన్
స్థిరమైన ప్రభుత్వం అంచనాలతో జోష్
కీలక మైలురాళ్లను చేరుకున్న సెన్సెక్స్, నిఫ్టీ
(మార్కెట్ సమీక్ష)

ముంబై: వరుసగా ఐదో సెషన్‌లోనూ దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు ర్యాలీని కొనసాగించాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత సూచీలు ఉత్సాహంతో దూసుకెళ్తున్నాయి. ఓ వైపు నిఫ్టీ కీలక 11,400 పాయింట్లు, మరోవైపు సెన్సెక్స్ 38,000 పాయింట్ల మార్క్‌ను దాటాయి. వారాంతం శుక్రవారం ఆఖరి సమయంలో లాభాల స్వీకరణ కనిపించింది. అయినప్పటికీ సెన్సెక్స్ 264 పాయింట్లు(0.7 శాతం) లాభపడి 38,024 పాయింట్ల వద్ద ముగిసింది. ఈనెల 10న ఎన్నికల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో వారమంతా మార్కెట్లు ర్యాలీ బాటలో కొనసాగాయి. అంతర్జాతీయంగా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ విదేశీ ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులకు మొగ్గుచూపారు. మరోవైపు డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా మరింత బలపడడం మార్కెట్లకు మరింత జోష్‌ను ఇచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు.

మరోసారి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుపై అంచనాలు కూడా సానుకూలంగా పనిచేశాయి. గత వారం ఐదు రోజుల్లో సెన్సెక్స్ 1,353 పాయింట్లు(3.7 శాతం) లాభపడింది. అదే సమయంలో 2018 సంవత్సరం తర్వాత మళ్లీ 38,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. ఇక నిఫ్టీ 391 పాయింట్లు(3.5 శాతం) పెరిగి 11,427 వద్ద స్థిరపడింది. దీంతో 2019 సంవత్సరం మార్కెట్లకు సరికొత్త గరిష్ఠాలకు నెలవైంది. బిఎస్‌ఇలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.5 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ 2.1 శాతం బలపడింది. మార్కెట్లు గురువారం రోజు మాత్రమే ఫ్లాట్‌గా ముగియగా, మిగతా నాలుగు రోజులూ లాభాలతో పరుగులు తీశాయి.

బ్యాంకింగ్ హవా

మార్కెట్లు ఇంతలా లాభాలను నమోదు చేయడంలో గతవారం బ్యాంకింగ్ స్టాక్స్ కీలకంగా నిలిచాయి. ఇండస్‌ఇండ్ 12 శాతం దూసుకెళ్లగా, కొటక్ మహీంద్రా, ఐసిఐసిఐ, స్టేట్‌బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి 7- నుంచి 5 శాతం మధ్య పెరిగాయి. మిగిలిన దిగ్గజాలలో ఆర్‌ఐఎల్, ఎల్ అండ్ టి 4.5 శాతం మేరకు లాభపడ్డాయి. సన్ ఫార్మా 2 శాతం బలపడింది. మిడ్, స్మాల్ క్యాప్స్‌లో గత వారం సిజి పవర్, ఐఐఎఫ్‌ఎల్, మన్‌పసంద్, దిలీప్ బిల్డ్ ట్రెంట్, వెస్ట్‌లైఫ్, ఎడిల్‌వీజ్, బాంబే డయింగ్, గాడ్‌ఫ్రే ఫిలిప్ వంటి షేర్లు భారీగా లాభపడ్డాయి. ఆర్‌కామ్ భారీగా నష్టపోయింది.

Sensex gained over 1,353 pts in 5 days