Home తాజా వార్తలు మార్కెట్లకు ‘ఎగ్జిట్’ కిక్

మార్కెట్లకు ‘ఎగ్జిట్’ కిక్

Sensex gains 1,422 points in single day, markets want Modi

 

భారీగా 1422 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
పదేళ్ల తర్వాత ఒకరోజు అతిపెద్ద గెయిన్
ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం

ముంబై : ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో స్టాక్‌మార్కెట్లు దుమ్మురేపాయి. పదేళ్ల తర్వాత తొలిసారిగా ఒక్క రోజులోనే దేశీయ స్టాక్‌మార్కెట్లు 3.75 శాతం పెరిగాయి. సెన్సెక్స్ భారీగా 1422 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 421 పాయింట్లు లాభపడింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎ ప్రభుత్వం మళ్లీ అధికార పగ్గాలు చేపట్టనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా చెప్పడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది. దీంతో మార్కెట్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. 30 షేర్ల బాంబే స్టాక్ ఎక్సేంజ్(బిఎస్‌ఇ) సెన్సెక్స్ 1422 అంటే 3.75 శాతం పెరిగి 39,352 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ సూచీ గరిష్ఠం 39,412 పాయింట్లు, కనిష్టం 38,570 పాయింట్లు నమోదైంది. ఇదే విధంగా నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ కూడా 421 పాయింట్లు పెరిగి అంటే 3.69 శాతం పెరిగి 11,828 పాయింట్ల వద్ద ముగిసింది. ఆదివారం నాడు చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి కొనసాగనున్నారని చెప్పాయి.

బిజెపి నేతృ-త్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం 300లకు పైగా స్థానాల్లో గెలవనుందని, లోక్‌సభలో 272 మెజారిటీ మార్క్‌ను స్పష్టంగా దాటనుందని పోల్స్ వెల్లడించాయి. ఈ ఫలితాలు మే 23న ప్రకటించనున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్పినట్టుగానే మోడీ ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే.. తొలి టర్మ్‌లో సంస్కరణలు చెపట్టినట్టుగానే మళ్లీ కొనసాగిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. సెన్సెక్స్‌లో టాప్ గెయినర్స్‌గా ఎస్‌బిఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎల్ అండ్ టి, యస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఎం అండ్ ఎం, మారుతీ, ఒఎన్‌జిసి, ఆర్‌ఐఎల్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు నిలిచాయి. ఈ షేర్లు దాదాపు 8 శాతానికి పైగా లాభపడ్డాయి. మరోవైపు బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్‌లు నష్టపోయాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు బెంచ్‌మార్క్‌ల మాదిరిగానే 3.57 శాతం లాభపడ్డాయి. రీసెర్చ్ ఎంకే వెల్త్ మేనేజ్‌మెంట్ హెడ్ జొసెఫ్ థామస్ మాట్లాడుతూ, దేశీయ ఈక్విటీ మార్కెట్లు అనూహ్య రీతిలో లాభాలను నమోదు చేశాయని, అన్ని రంగాలు, విభాగాలు భారీగా పెరిగాయని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయని, ఇదే మార్కెట్లలో అత్యంత ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు.

పదేళ్ల తర్వాత..
దాదాపు పదేళ్ల క్రితం 2009 మే 18న సెన్సెక్స్ ఒక రోజు అతిపెద్ద లాభాన్ని నమోదు చేసింది. అప్పుడు ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 2,110 పాయింట్లు పెరిగింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడంతో మార్కెట్లు లాభాలతో హోరెత్తించాయి. ఆ తర్వాత సెన్సెక్స్ ఒక రోజులో 2000 పాయింట్లు లాభపడటం మళ్లీ ఇప్పటి వరకు జరగలేదు. ఆ తర్వాత 2015 జనవరి 15న ఆర్‌బిఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో సెన్సెక్స్ భారీగా 729 పాయింట్లు లాభపడింది. మరోసారి 2016 మార్చి 1న సెన్సెక్స్ 777 పాయింట్లు పెరిగింది. కేంద్ర బడ్జెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు అప్పట్లో మార్కెట్లకు జోష్‌ను నింపాయి. ఆ తర్వాత రెండున్నరేళ్లకు అంటే 2018 అక్టోబరు 12న 732 పాయింట్లు లాభపడింది. తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో సూచీలు రికార్డు స్థాయిలో 1422 పాయింట్లు పెరిగాయి.

అదే జరిగితే..
మే 23 ఫలితాల్లోనూ ఎన్‌డిఎ 300 స్థానాల మార్కును దాటితే మార్కెట్లలో ఇదే ర్యాలీ తర్వాత కొద్ది రోజులు కొనసాగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. వ్యవస్థలో నగదు ప్రవాహ పరిస్థితి, కార్పొరేట్ లాభాలు, ప్రపంచ వ్యాప్త పరిస్థితులు వంటి అంశాలను దృష్టిలోపెట్టుకొని మార్కెట్ జోరు కొనసాగింది. స్థిరమైన ప్రభుత్వం వస్తే ఆటో, ఇన్ఫ్రా, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగాలు మెరుగైన పనితీరుకనబరుస్తాయని మార్కెట్ వర్గాలు భావించాయి. అందుకే ఆయా రంగాల షేర్లు పరుగులు తీశాయి. మార్కెట్లు ప్రధానంగా స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయని, అందువల్ల సంస్కరణలు చేపడుతున్న ఎన్‌డిఎ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్పడంతో మార్కెట్లు దూసుకెళ్లాయి.

6 శాతం పెరిగింది..
మార్కెట్ల ర్యాలీ అద్భుతంగా ఉంది. ఈ నెలలో ఇప్పటివరకు సెన్సెక్స్ 6 శాతం పెరిగింది. కేవలం పది రోజుల్లోనే సెన్సెక్స్ 2,150 పాయింట్లకు పైగా లాభపడింది. ఇప్పటికే ఎన్‌డిఎ ప్రభుత్వం వస్తుందని మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. దీనికి తోడు ఎగ్జిట్ పోల్స్ తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు మార్కెట్లలో ఉత్సాహం నింపాయి. దీనికి మిడ్‌క్యాప్,స్మాల్ క్యాప్‌షేర్ల దూకుడు జోరు పెంచింది. బ్యాంక్ నిఫ్టీ పదిసెషన్లలో ఏకంగా 10శాతం లాభపడింది. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వంటి షేర్లు జోష్‌తో ఉన్నాయి.

ఎఫ్‌ఐఐల కీలకపాత్ర
ఎఫ్‌ఐఐలు ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.30వేల కోట్లను మార్కెట్లలోకి తీసుకొచ్చారు. గురువారం ఒక్కరోజే రూ.1,482.99 కోట్ల మేరకు కొనుగోళ్లు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనాన్ని దృష్టిలో పెట్టుకొని పలు దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను పెంచడంలేదు. అమెరికా ఫెడ్ కూడా వడ్డీరేట్ల పెంపుపై కొంత దూకుడు తగ్గించింది. ఇది భారత మార్కెట్లకు సానుకూలంగా మారింది. మరోవైపు ఆర్‌బిఐ వడ్డీ రేట్లను మరింత తగ్గించే సూచనలు ఉండడంతో మార్కెట్లకు సానుకూలం అయ్యాయి.

రూ.5 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.5.33 లక్షల కోట్లు పెరిగింది. ఎగ్జిట్ పోల్స్ బిజిపికి స్పష్టమైన మెజారిటీ వస్తుందని చెప్పడంతో సెన్సెక్స్ భారీగా 1423 పాయింట్లు (3.75 శాతం) పెరిగింది. ఈక్విటీ షేర్లు భారీగా లాభపడడంతో బిఎస్‌ఇ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.5,33,463 కోట్లు పెరిగింది. గత వారాంతం శుక్రవారం రోజు బిఎస్‌ఇ కంపెనీల మార్కెట్ విలువ రూ.1.46 లక్షల కోట్లు ఉంది. ఇది సోమవారం ట్రేడింగ్ సెషన్‌లో అమాంతం రూ.1.51 లక్షల కోట్లకు పెరగడం విశేషం. వరుసగా మూడు రోజుల లాభాలతో బిఎస్‌ఇ కంపెనీల విలువ మొత్తంగా రూ.7.48 లక్షల కోట్లకు చేరి రికార్డు నెలకొల్పింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 11,800 పాయింట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎకు స్పష్టమైన మెజారిటీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చేప్పడంతో ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ఉన్నారు.

Sensex gains 1,422 points in single day, markets want Modi