Home తాజా వార్తలు నిఫ్టీ@ 11,000

నిఫ్టీ@ 11,000

 

దేశీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాలు
358 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
ఐదో రోజూ లాభాల ముగింపు

ముంబై: వరుసగా ఐదో రోజు స్టాక్‌మార్కెట్లు లాభాలతో దూసుకెళ్లాయి. మొత్తానికి 2019 సంవత్సరంలో తొలిసారిగా నిఫ్టీ కీలక 11 వేల మార్క్‌ను దాటింది. ఇక సెన్సెక్స్ 358 పాయింట్ల లాభంతో 36,975 పాయింట్లకు చేరుకుంది. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టిసిఎస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడటంతో సూచీలు కూడా చురుగ్గా కదిలాయి. లోహరంగ, ఐటీ సూచీలు మంచి లాభాలను చూడగా, అడాగ్ షేర్లు కుప్పకూలాయి. ఒక్క రిలయన్స్ ఇన్ఫ్రానే 27 శాతం నష్టపోయింది. ఎస్‌ఆర్‌ఎఫ్ షేర్లు భారీగా 10 శాతం లాభపడ్డాయి. మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 128 పాయింట్లు లాభపడి 11,067 వద్ద ముగిశాయి. అయితే కొత్త సంవత్సరంలో తొలిసారి సెన్సెక్స్ 11వేల మార్కును దాటింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో పాటు ఆర్‌బిఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహానిచ్చాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ప్రధాన రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో సూచీలు 4నెలల గరిష్ట స్థాయి వద్ద ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ 130 పాయింట్ల లాభపడి 27,402 వద్ద ముగిసింది. ముఖ్యంగా మిడ్‌సెషన్ అ నంతరం మెటల్, ఐటి, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసిజి షేర్లలో కొనుగోళ్లతో సూచీలు పరుగులు పెట్టాయి.
మరింత పెరిగిన వొడాఫోన్ ఐడియా నష్టం

టెలికామ్ దిగ్గజం వొడాఫోన్ ఇండియా క్యూ3లో రూ.5004 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. నెట్‌వర్క్ విస్తరణ, వ్యయాలు వెరసి మూడో త్రైమాసిక ఫలితాలపై ప్రభావం చూపాయి. ఇంకా ఈ మూడు నెలల కాలంలో సంస్థ 35 మిలియన్ల కస్టమర్లను కోల్పోయింది. వొడాఫోన్, ఐడియా సెల్యులార్ విలీనం తర్వాత రెవెన్యూ రూ.11,764 కోట్లు నమోదు చేయగా, ఇంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 2.2 శాతం క్షీణించింది.
జెఎస్‌డబ్లు లాభం 7 శాతం డౌన్
డిసెంబర్ 31 ముగింపు నాటి క్యూ-3 జఎస్‌డబ్లు స్టీల్ ఫలితాల్లో నికర లాభం 7 శాతం తగ్గి రూ.1,603 కోట్లుగా నమోదైంది. రెవిన్యూ మాత్రం 11 శాతం పెరిగి రూ. 20,318 కోట్లకు చేరింది. మార్జిన్లు 21.1 శాతం నుండి 22.1శాతం పెరిగాయి. ఎబిటా 17 శాతం పెరిగి రూ.4,501 కోట్లు నమోదైంది. జెఎస్‌డబ్లు స్టీల్ ఫలితాల వెల్లడి తరువాత అత్యధికంగా 2.18 శాతం పెరిగి రూ.280 వద్ద స్థిరపడింది.
లుపిన్ నష్టం రూ.152 కోట్లు
ఔషధ రంగ సంస్థ లుపిన్ క్యూ3 ఫలితాల్లో తీవ్ర నిరాశపర్చింది. డిసెంబర్ 31 ముగింపు నాటి క్యూ3(అక్టోబర్‌డిసెంబర్)లో సంస్థ రూ.152 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.222 కోట్లుగా ఉంది. విశ్లేషకులు కంపెనీ రూ.289 కోట్ల లాభాలను నమోదు చేస్తుందని అంచనా వేశారు. కానీ ఏమాత్రం అంచనాలను అందుకోలేదు. వన్ టైమ్ చార్జ్ వల్ల ఈ త్రైమాసికంలో సంస్థ లాభాలను పడిపోయాయని లుపిన్ పేర్కొంది.