Home తాజా వార్తలు రెండో రోజూ దుమ్మురేపాయి

రెండో రోజూ దుమ్మురేపాయి

stock market 482 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
11,300 పాయింట్లను క్రాస్ చేసిన నిఫ్టీ
5 శాతం పెరిగిన భారతీ ఎయిర్‌టెల్

ముంబై: క్రితం రోజు లాభాలతో ఉత్సాహంగా కనిపించిన మార్కెట్లు.. రెండో రోజూ మంగళవారం కూడా ఇంతకంటే ఎక్కువ జోష్‌ను చూపాయి. ప్రధానంగా ఎన్నికల ప్రకటన వెలువడటం, బాలాకోట్ ఉగ్రస్థావరంపై భారతీయ వైమానిక దళం మెరుపుదాడి అనంతరం మోడీకి మళ్లీ ఆదరణ పెరగ్గా, మళ్లీ అధికారంలోకి వస్తారనే అంచనాలు మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. విదేశీ పెట్టుబడుల వరద వంటివి అంశాలు సానుకూలంగా మారాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ భారీగా 481.56 పాయింట్లు లాభపడింది. ఆఖరికి 37,535.66 వద్ద స్థిరపడింది.

ఇక నిఫ్టీ 133.15 పాయింట్లు పెరిగి 11,301 వద్ద ముగిసింది. ముఖ్యంగా నిఫ్టీ బ్యాంకు సూచీ మంచి లాభాలను నమోదు చేసింది. ఐసిఐసిఐ, ఇండస్‌ఇండ్ బ్యాంకులు లాభాలను ఆర్జించాయి. భారతీ ఎయిర్‌టెల్ షేర్లు 5 శాతం లాభాలతో దూసుకెళ్లి, షేరు విలువ రూ.350.50 వద్ద స్థిరపడింది. ఆర్‌ఐఎల్ షేర్లు 52వారాల గరిష్ఠాన్ని తాకాయి.

సానుకూల సంకేతాలు

రూపాయి బలపడడం, ఎఫ్‌ఐఐల నిధుల వరద వంటివన్నీ మార్కెట్లకు కలిసొచ్చాయి. నిఫ్టీ 11,300 పాయింట్ల మార్కును క్రాస్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ తన జీవిత కాల గరిష్ట స్థాయి 28,488 పాయింట్ల మార్కును టచ్ చేసింది. ఉదయం 11,231 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ మిడ్ సెషన్ తర్వాత వేగం పుంజుకుంది. ఇంట్రాడేలో 11,320 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివర్లో కొద్దిగా తడబడినా 11,301 దగ్గర ముగిసింది. ఐటి, పిఎస్‌యు బ్యాంక్ స్టాక్స్ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లూ లాభాల్లోనే ముగిశాయి. భారతి ఎయిర్టెల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ అండ్ టి, అదాని పోర్ట్ టాప్ 5 గెయినర్స్‌గా నిలిచాయి. ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, భారతి ఇన్ఫ్రాటెల్, ఒఎన్‌జిసి, ఇన్ఫోసిస్ టాప్ 5 లూజర్స్ జాబితాలో ఉన్నాయి.

ఐటి మినహా అన్నీ లాభాల్లో

రూపాయి బలం పుంజుకోవడంతో ఐటి స్టాక్స్ నీరసించడం మినహా మిగిలిన అన్నీ రంగాలూ జోరును ప్రదర్శించాయి. ప్రధానంగా రియాల్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్స్, మీడియా, ఎఫ్‌ఎంసిజి రంగ కౌంటర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా లాభాల్లోనే ముగిశాయి. చాలావరకు స్టాక్స్ 52 వారాల గరిష్ట స్థాయిని నమోదు చేశాయి.

5 శాతం పెరిగిన ఎయిర్‌టెల్

సూచీలకు అనుగుణంగా భారతి ఎయిర్‌టెల్ షేరు విలువ కూడా పైపైకి ఎగబాకింది. స్టాక్ 5.4 శాతం పెరిగి రూ.351.80 దగ్గర ముగిసింది. గత రెండు రోజుల్లో ఈ షేరు మొత్తంగా 14 శాతం పెరిగింది. రైట్స్ ఇష్యూకు ప్రమోటర్ గ్రూప్ నుంచి మంచి స్పందన రావడం, ఇన్ఫ్రాటెల్‌లో వాటాలకు సంబంధించి వార్తలు స్టాక్ కౌంటర్‌లో కొనుగోళ్లకు మొగ్గుచూపాయి.

ఇకపై నిఫ్టీ ఐటి సూచీలో వీక్లీ ఆప్షన్స్

ప్రస్తుతం నిఫ్టీ ఐటిలో మూడు నెలల గడువుతో నెలవారీ ఆప్షన్లున్నాయి. ఇకపై నిఫ్టీ ఐటి సూచీలో వీక్లీ ఆప్షన్స్‌ను ప్రవేశపెడుతున్నట్టు నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ ప్రకటించింది. మూడునెలల గడువుతోపాటు వారం వారీ ఆప్షన్లను కూడా ఎన్‌ఎస్‌ఇ ప్రవేశపెట్టింది. వీటితో మరింత వెసులుబాటు కల్గుతుందని, వివిధ ట్రేడింగ్ వ్యూహాలు అవలంబించే అవకాశముంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్ కదలికల ఆధారంగా పొజిషన్లను మరింత సమర్ధవంతంగా హెడ్జ్ చేసుకోవచ్చంటున్నారు. నెలవారీ ఆప్షన్స్‌తో పోలిస్తే వారం వారీ ఆప్షన్స్ అటు రైటర్స్‌కు ఇటు బయ్యర్స్‌కు తక్కువ ధరకు లభిస్తాయని చెప్పారు. అంతర్జాతీయంగా కూడా స్వల్పకాలిక ఆప్షన్లే మంచి లాభాలను అందించినట్లు తెలుస్తోందన్నారు.

Sensex gains 482 points