Home బిజినెస్ మూడు వారాల గరిష్ఠానికి సెన్సెక్స్

మూడు వారాల గరిష్ఠానికి సెన్సెక్స్

Sensexముంబయి: ఈక్విటీ మార్కెట్లు మళ్లీ పుంజుకుని లాభాల వైపు పయనిస్తున్నాయి. తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయినప్పటికీ దేశీయ మార్కెట్లపై అంతగా ప్రభావం చూపలేదు. మదుపర్ల నుంచి కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కూడా సెంటిమెంట్‌ను బలపర్చాయి. ఉదయం ప్రారంభంలో సూచీలు కాస్త నెమ్మదించినా, ఫార్మా, అటోమొబైల్ రంగాల షేర్ల అండతో మధ్యాహ్నం తర్వాత జోరును కొనసాగించాయి. సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ మళ్లీ 10వేల మైలురాయికి చేరువైంది. క్రితం సెషన్లో 31,730 వద్ద ముగిసిన సెన్సెక్స్, ఈ ఉదయం 25 పాయింట్ల స్వల్పలాభంతో ప్రారంభమైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 162 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ 31,892 వద్ద స్థిరపడింది. మరోవైపు నిప్టీ కూడా మళ్లీ 10వేల మైలురాయికి తాకింది. ట్రేడింగ్‌లో నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 9,974 వద్ద ముగిసింది. ఇక అమెరికాలో పేటెంట్ హక్కుల కేసులో డాక్టర్ రెడ్డీస్‌కు అనుకూలంగా తీర్పు రావడంతో ఆ సంస్థ షేర్లు భారీగా పెరిగాయి. ఒక్కో షేరు ధర 9 శాతం వరకూ పెరిగింది. అరబిందో ఫార్మా, ఏషియన్ పెయింట్స్, టాటామోటార్స్, బజాజ్ ఆటో షేర్లు లాభాలను నమోదు చేశాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, టిసిఎస్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్‌టెల్, విప్రో షేర్లు స్వల్పంగా నష్టపోయాయి.