Search
Friday 21 September 2018
  • :
  • :

ఒడిదుడుకులు ఉంటాయ్..

Sensex rises 304 points to close at 38,252, Nifty stopped

ఈ వారంలోనే డెరివేటివ్స్ గడువు రూపాయి, అంతర్జాతీయ పరిణామాలను పరిశీలించాలి: విశ్లేషకులు

ముంబయి: ఈవారం మార్కెట్‌ను దేశీయ, అంతర్జాతీయ అంశాలు శాసించనున్నాయి. ఆగస్ట్ సిరీస్ గడువు, రూపాయి కదలికలు, ముడి చమురు ధరలు వంటి వాటిపై దృష్టి పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. గతవారం సెన్సెక్స్ నికరంగా 304 పాయింట్లు(0.8 శాతం) పుంజుకుని 38,252 వద్ద నిలిచింది. అయితే ఈ వారం ఒడిదుడుకులు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఆగస్ట్ సిరీస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గడువు ముగియనుండటం, జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) గణాంకాలు ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ జిడిపి గణాంకాలను ప్రభుత్వం శుక్రవారం(31న) విడుదల చేయనుంది. జనవరి-మార్చిలో దేశీయ జిడిపి 7.7 శాతం పుంజుకుంది. ఈసారి కూడా ఇదే విధమైన వృద్ధి నమోదుకాగలదని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆగస్ట్ డెరివేటివ్స్ గడువు కారణంగా వచ్చే వారం ట్రేడర్లు తమ పొజిషన్లను సెప్టెంబర్ సిరీస్‌కు రోలోవర్ చేసుకునే అవకాశముంది. దీంతో మార్కెట్లు కొంతమేర ఒడిదొడుకులను ఎదుర్కొనే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో డాలరుతో రూపాయి మారకం విలువ సరికొత్త కనిష్టాలను చేరిన తరుణంలో కరెన్సీపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. మళ్లీ పెరుగుతున్న ముడిచమురు ధరలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని అంటున్నారు. వాణిజ్య వివాదాలకు చెక్ పెట్టేందుకు గత వారం చైనా, అమెరికా ప్రతినిధులు రెండు రోజులపాటు సమావేశమయ్యారు. అయితే దిగువస్థాయిలో జరిగిన ఈ చర్చలతో ఎలాంటి పురోగతినీ సాధించలేదని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు రెండు దేశాలూ 1600 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులపై పరస్పరం 25 శాతం సుంకాలను విధించుకోవడం గమనార్హం. వడ్డీ రేట్ల పెంపునకే అమెరికా ఫెడరల్ రిజర్వ్ మొగ్గు చూపుతున్నట్లు అటు మినిట్స్‌తోపాటు ఇటు జాక్సన్ హోల్ వద్ద వార్షికోత్సవం సందర్భంగా చైర్మన్ పావెల్ సంకేతాలిచ్చారు. ఈ ఏడాది రెండో క్వార్టర్(ఏప్రిల్-జూన్)కు అమెరికా జీడీపీ గణాంకాలు బుధవారం విడుదలకానున్నాయి.

గత వారం సెన్సెక్స్ 304 పాయింట్లు ఆప్
గత వారం దేశీ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒక రోజు మార్కెట్లు పనిచేయలేదు. శుక్రవారం ముగిసిన వారంలో సెన్సెక్స్ 304 పాయింట్లు పెరిగి 38,252 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 86 పాయింట్లు లాభపడి 11,557 వద్ద ముగిసింది. స్మాల్ క్యాప్ సూచీ యథాతథంగా ముగియగా, మిడ్ క్యాప్ సూచీ మార్కెట్లను మించుతూ 1.5 శాతం లాభపడింది. సెన్సెక్స్ దిగ్గజాలలో ఎల్ అండ్ టి 8 శాతంపైగా దూసుకెళ్లింది. సుమారు రూ. 9,000 కోట్లతో షేరుకి రూ. 1500 ధర మించకుండా 6 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించడంతో ఈ షేరు భారీగా పెరిగింది. ఇంధన దిగ్గజాలు ఒఎన్‌జిసి 7 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 6 శాతం మేరకు జంప్ చేశాయి. ఇన్ఫోసిస్ సిఎఫ్‌ఒ రంగనాథ్ రాజీనామా చేయడంతో కంపెనీ షేరు విలువ 3.6 శాతం తిరోగమించింది. విప్రో 4.5 శాతం పెరిగింది. యస్‌బ్యాంక్, ఇండస్‌ఇండ్, ఐసిఐసిఐ, యాక్సిస్ 5 నుంచి -2 శాతం మధ్య క్షీణించాయి. బ్యాంక్ నిఫ్టీ, ఆటో, ఎఫ్‌ఎంసిజి, ఐటి, రియల్టీ రంగాలు 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. గత గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐలు) రూ. 433 కోట్లు, దేశీ ఫండ్స్(డిఐఐలు) రూ. 142 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి.

Comments

comments