Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

సెరెనా@ 308

*క్వార్టర్స్‌లో ముర్రే, నిషికోరీ కూడా

*  నాడల్‌కు షాక్

tennisన్యూయార్క్ : అమెరికా నల్లకలువ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో రికార్డు విజయం సొంతం చేసుకుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సెరెనా 6-2, 6-3తో స్వెడోవాయరోస్లవా (కజికిస్థాన్)ను 70 నిమిషాల్లోనే మట్టికరిపించి క్వార్టర్స్‌కు చేరింది. గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌లో సెరెనాకు ఇది 308వ విజయం. దీంతో ఇప్పటి వరకు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్‌లో అత్యధిక విజయాలు సాధించిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ రికార్డు(307) తుడిచిపెట్టుకుపోయింది. క్వార్టర్స్‌లో సెరెనా.. హాలెప్‌తో తలపడనుంది. హాలెప్ 6-2, 7-5తో సారెజ్‌నవరో(స్పెయిన్)పై నెగ్గింది. మరోమ్యాచ్‌లో సెరెనా అక్క వీనస్ విలియమ్స్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో వీనస్ 6-4, 4-6, 6-7(3/7) పోరాడి ఓడింది.
నాడల్ అవుట్ : స్పెయిన్ బుల్ నాడల్ జోరుకు బ్రేక్ పడింది. తొలిరౌండ్ నుంచి ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ప్రిక్వార్టర్స్‌కు చేరిన నాడల్‌కు ఫ్రాన్స్ యువ ఆటగాడు లుకాస్ పౌలీ చెక్‌పెట్టాడు. నాలుగు గంటలా 11 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో నాడల్ 1-6, 6-2, 4-6, 6-3, 6-7(6/8) పోరాడి ఓడాడు. తొలిసెట్‌లో ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయిన నాడల్ రెండోసెట్‌ను ఏకపక్షంగా సొంతం చేసుకున్నాడు. తరువాతి రెండు సెట్‌లలో చెరో ఒకటి సొంతం చేసుకోవడంతో మ్యాచ్ నిర్ణయాత్మక ఐదోసెట్‌కు దారితీసింది. ఐదోసెట్ మొదటిగేమ్‌లోనే పౌలీ సర్వీస్ బ్రేక్ చేసిన నాడల్ వరుస గేమ్‌లు నెగ్గి 4-2తో నిలిచాడు. దీంతో మ్యాచ్ నాడల్‌దే అని భావించారంతా. కానీ అద్భుతంగా పుంజుకోవడంతో గేమ్ టైబ్రేక్‌కు దారితీసింది. టైబ్రేక్‌లో నాలుగుసార్లు మ్యాచ్ పాయింట్ కాపాడుకున్నా నాడల్ ఐదోసారి సర్వీస్‌తో పాటు మ్యాచ్‌నూ కోల్పోయాడు. బ్రిటన్ స్టార్ ఆటగాడు ఆండీముర్రే సునాయాస విజయం సాధిం చాడు. 22వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరి యా)తో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ముర్రే 6-1, 6-2, 6-2తో గెలిచాడు. మరో మ్యాచ్‌లో నిషికోరీ(జపాన్)6-3, 6-4, 7-6(7/4) తో ఇవోకార్లోవిక్ (క్రొయేసియా)ను చిత్తుచేశాడు.
క్వార్టర్స్‌లో సానియా జోడీ : మహిళల డబుల్స్‌లో ప్రపంచ నెం.1 సానియామీర్జా క్వార్టర్స్‌కు చేరింది. నికోలస్ గిబ్స్(అమెరికా)-నావోహిబినో(జపాన్)తో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సానియా-స్ట్రికోవాబార్బోరా(చెక్) 6-4, 7-5తో సునాయాసంగా గెలిచింది. క్వార్టర్స్‌లో ఫ్రెంచ్ టాప్ సీడ్స్ కరోలిన్ గార్షియా-క్రిస్టినాతో సానియా జోడీ తలపడనుంది. కాగా మిక్స్‌డ్ డబుల్స్ భారత ప్రాతినిధ్యం ముగిసింది. పోటీలో నిలిచిన రోహన్‌బోపన్న క్వార్టర్స్‌లోనే ఓడాడు. డబ్రోవాస్కి-బోపన్న ద్వయం 6-1, 2-6, 8-10తో గ్రోన్‌ఫెల్డ్-రాబర్ట్‌ఫరా చేతిలో ఓడింది.
రెండోరౌండ్‌కు ప్రాంజల : యుఎస్ ఓపెన్ బాలికల సింగిల్స్‌లో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల రెండోరౌండ్‌కు చేరింది. తొలిరౌండ్‌లో ప్రాంజల 2-6, 6-3, 6-2తో కులిక్ విక్టోరియా(పొలాండ్)పై పోరాడి గెలిచింది. అయితే డబుల్స్‌లో ప్రాంజల తొలిరౌండ్‌లోనే ఓటమిచవిచూసింది. చైనా భాగస్వామి జిమా డు జతగా బరిలోకి దిగిన ప్రాంజల తొలిరౌండ్‌లో 4-6, 6-3, 5-7తో ఓడింది.
సెమీస్‌కు కెర్బర్ : రెండోసీడ్ ఎంజెలికె కెర్బర్(జర్మనీ) సెమీస్‌కు చేరింది. ఇటలీ భామ రాబెర్టా విన్సీతో జరిగిన క్వార్టర్స్‌లో కెర్బర్ 7-5, 6-0తో గెలిచింది. తొలిసెట్‌లో గట్టిపోటీ ఎదుర్కొన్న కెర్బర్ రెండోసెట్‌ను ఏకపక్షంగా సొంతం చేసుకుంది.

Comments

comments