Home వార్తలు వానియా కింగ్‌ను ఓడించిన సెరెనా

వానియా కింగ్‌ను ఓడించిన సెరెనా

మూడో రౌండ్‌కు సెరెనా, ముర్రే, రద్వంస్కా

serenaన్యూయార్క్: వాన పడుతున్నా కొత్త హైటెక్ రిట్రాక్టెబుల్ రూఫ్ ఉన్న ఆర్థర్ యాష్ స్టేడియంలో స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్, వానియా కింగ్‌ను 65 నిమిషాల పోటీలో 6-3,6-3 స్కోరుతో ఓడించి మూడో రౌండ్‌లోకి సునాయాసంగా వెళ్లింది. మూసి ఉన్న స్టేడియంలో ఆడడం కాస్త ప్రత్యేకంగా ఉన్నప్పటికీ అందులో ఆడడం గొప్పగా అనిపించిందని సెరెనా విలియమ్స్ తెలిపింది. కానీ ఆ స్టేడియంలో గోల కాస్త ఎక్కువగానే ఉందని అన్నది. ఇండోరో ఔట్‌డోరో, రేయోపగలో, వానపడ్డా పడకపోయినా యుఎస్ ఓపెన్‌లో సెరెనాకు అవి పెద్ద తేడా అనిపించవు. ఫ్లషింగ్ మీడోస్‌లో ఇప్పుడు 86వ విజయాన్ని సెరెనా విలియమ్(34) నమోదు చేసింది. సెరెనా ఆడిన మ్యాచ్ వన్‌సైడెడ్‌గా ఉండింది. ఈసారి ఆటలో తాను తప్పులు చేసినట్లు భావిస్తున్నానని, కానీ దానికి ఇప్పుడు తానేమి చేయలేనని కూడాసెరెనా అన్నది. గెలువాలన్నదే తనకు ముఖ్యం అని తెలిపింది. ఈ ఏడాది జూలైలో జరిగిన వింబుల్డన్‌లో విజేతగా నిలవడం ద్వారా 22 గ్రాండ్ స్లామ్ ట్రోఫీలతో స్టెఫీగ్రాఫ్ సరసన నిలిచిన నల్లకలువ, అమెరికా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ … తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. యూఎస్ ఓపెన్‌లో రెండో రౌండ్‌లో విజయం సాధించిన సెరెనా.. అత్యధికంగా 306 గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన మార్టినా నవ్రతిలోవా రికార్డును సమం చేసింది. భుజం నొపి కారణంగా సెరెనా సిన్సినాటీ టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. రియో ఒలింపిక్స్‌లో కూడా ఓడిపోయింది. కానీ ఇప్పుడు ఫిట్‌గా ఉండి ఆడుతోంది. కింగ్ 13 ఏసెస్‌ని బ్లాస్ట్ చేసేసింది. ఏడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా ఇప్పటికే రెండు ఆడేసానని సెరెనా తెలిపింది. తనకిపుడు కుడి భుజం నొప్పి అంతగా అనిపించడంలేదని కూడా చెప్పింది. ఇప్పటివరకూ 17 సార్లు యుఎస్ ఓపెన్‌లో పాల్గొన్న సెరెనాకు ఇలా రూఫ్ కింద ఆడటం, గెలవడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఆరు యుఎస్ ఓపెన్ లు గెలిచిన సెరెనా.. ఏడో టైటిల్ పై కన్నేసింది. ఒకవేళ యుఎస్ గ్రాండ్ స్లామ్‌ను సెరెనా సాధిస్తే ఓపెన్ ఎరాలో అత్యధిక టైటిల్స్ గెలిచిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది.
విజయ పంథాలో ముర్రే: జులైలో వింబుల్డన్ విజయం తర్వాత రియో ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని సాధించిన ఆండీ ముర్రే తన విజయపంథాని యుఎస్ ఒపెన్‌లో కూడా చెదరనివ్వలేదు. వాన పడుతున్న, కోర్టులో గోలగోలగా ఉన్నా చెక్కుచెదరక స్పానియార్డ్ మార్సెల్ గ్రానోల్లర్స్‌పై 6-4, 6-1, 6-4తో విజయాన్ని సాధించాడు. కప్పు ఉన్న టెన్నిస్ కోర్టులో ఆడడం అదృష్టమని, లేకుంటే వానకు ఆట నిలిచి గల్లంతయ్యేదని ముర్రే అన్నాడు. 45 ర్యాంకరైన గ్రానోల్లర్స్‌పై ముర్రే సునాయాసంగానే విజయం సాధించాడు. వాన పడేప్పుడు టెన్నిస్ కోర్టుపైన ఉన్న మూసే కప్పు సమయానికి మూసుకోకుండా కాస్త ఇబ్బంది పెట్టింది.
మూడో రౌండ్‌కు అగ్నియెజ్క రద్వంస్కా: నాలుగో సీడెడ్ అగ్నియెజ్క రద్వంస్కా మూడో రౌండుకు చేరుకుంది. ఆమె తన ప్రత్యర్థి బ్రిటన్‌కు చెందిన నోమి బ్రోడిపై గురువారం 7-6(11/9), 6-3తో విజయాన్ని సాధించింది. గతంలో ఫ్లసింగ్ మీడోస్‌లో రద్వంస్కా ఎన్నడూ నాలుగో రౌండ్‌కు చేరలేదు. ఆమె తదుపరి ఫ్రాన్స్‌కు చెందిన 25వ సీడ్ క్రీడాకారిణి కరోలిన్ గార్సియాతో తలపడనుంది. కరోలిన్ గార్సియా చెకస్కోవేకియాకు చెందిన కతెరినా సినియాకోవను 4-6, 6-4, 6-4 తో ఓడించిన క్రీడాకారిణి.