Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

ఫైనల్లో సెరెనా, ఒసాకా

Serena Williams and Naomi Osaka face off in final

న్యూయార్క్: యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మహిళల సింగిల్స్‌లో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్, జపాన్ సంచలనం నొవామి ఒసాకా ఫైనల్‌కు చేరుకున్నారు. మాజీ చాంపియన్ సెరెనా లాత్వియా క్రీడాకారిణి అనస్తాజియా సెవస్తోవాపై, ఒసాకా కిందటిసారి రన్నరప్, అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్‌ను ఓడించింది. సెరెనాఒసాకాలు ఫైనల్లో తలపడుతారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్), మూడో సీడ్, అర్జెంటీనా స్టార్ డెల్‌పొట్రోలు సెమీస్‌లో తలపడుతారు. మరో సెమీస్‌లో సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్, జపాన్ ఆశాకిరణం నిషికోరితో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

సెరెనా జోరు..
మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్, 17వ సీడ్ సెరెనా విలియమ్స్ ప్రకంపనలు సృష్టిస్తూ ఫైనల్‌కు చేరుకుంది. భారీ ఆశలతో అమెరికా ఓపెన్‌లో బరిలోకి దిగిన సెరెనా అందరి అంచనాలను నిలబెడుతూ ఫైనల్‌కు దూసుకొచ్చింది. 19వ సీడ్, లాత్వియా క్రీడాకారిణి సెవస్తోవాతో జరిగిన సెమీఫైనల్లో సెరెనా 63, 60తో విజయం సాధించింది. ప్రారంభం నుంచే సెరెనా చెలరేగి ఆడింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగింది. సెరెనా కళ్లు చెదిరే షాట్లతో విరుచుకు పడడంతో సెవస్తోవా కనీసం ప్రతిఘటన కూడా ఇవ్వలేక పోయిది. దూకుడైన ఆటతో చెలరేగిన సెరెనా ఏమాత్రం ప్రతిఘటన లేకుండానే తొలి సెట్‌ను అలవోకగా గెలుచుకుంది. సెరెనా విజృంభణతో సెవస్తోవా తీవ్ర ఒత్తిడికి గురైంది. దీని ప్రభావం రెండో సెట్‌లో స్పష్టంగా కనిపించింది. ఈసారి సెరెనా ఆకాశమే హద్దుగా చెలరేగి పోయింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సెరెనా లక్షం దిశగా అడుగులు వేసింది. ఇదే సమయంలో ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా గెలిచే అవకాశం ఇవ్వలేదు. వరుసగా ఆరు గేమ్‌లను దక్కించుకున్న సెరెనా అలవోకగా ఫైనల్‌కు చేరుకుంది. ఇక, సెరెనా తన ఖాతాలో మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ జమ చేసుకునేందుకు ఒక విజయం దూరంలో నిలిచింది. ఇందులోనూ గెలిచి తన సత్తా చాటాలని తహతహలాడుతోంది.

కీస్‌కు ఒసాకా షాక్…
మరో సెమీఫైనల్లో జపాన్ సంచలనం, 20వ సీడ్ నొవామి ఒసాకా విజయం సాధించింది. అమెరికా స్టార్, 14వ సీడ్ మాడిసన్ కీస్‌తో జరిగిన పోరులో ఒసాకా 62, 64 తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ప్రారంభం నుంచే ఒసాకా చెలరేగి ఆడింది. చూడచక్కని షాట్లతో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించింది. ఒసాకా చెలరేగి ఆడడంతో కీస్ తీవ్ర ఒత్తిడికి గురైంది. దీని ప్రభావం ఆమె ఆటపై కనిపించింది. ఒత్తిడిలో ఆడిన కీస్ వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఒసాకా సఫలమైంది. చివరి వరకు జోరును కొనసాగిస్తూ సునాయాసంగా తొలి సెట్‌ను గెలుచుకుంది. కాగా, కీలకమైన రెండో సెట్‌లో కీస్ పుంజుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఒక దశలో ఆధిక్యంలోకి కూడా దూసుకెళ్లింది. కానీ, ఒసాకా కీలక దశలో మళ్లీ పుంజుకుంది. ఒత్తిడిని సైతం తట్టుకుంది మళ్లీ పైచేయి సాధించింది. కీస్ దూకుడును అడ్డుకుంటూ లక్షం దిశగా సాగింది. ఇదే క్రమంలో ప్రత్యర్థిపై ఒత్తిడిని పెంచడంలో సఫలమైంది. ఒత్తిడిని తట్టుకోవడంలో విఫలమైన కీస్ మళ్లీ తప్పిదాల కు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమైన ఒసాకా 64తో సెట్‌ను గెలిచి టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. కాగా, ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఒసాకా ఏకంగా ఫైనల్‌కు చేరి పెను సంచలనమే సృష్టించింది. ఫైనల్లో కూడా దూకుడును కొనసాగించాలనే లక్షంతో ఒసాకా ఉంది.

ఊహించినట్టే…
ఇక, పురుషుల సింగిల్స్‌లో ఊహించినట్టుగానే స్టార్ ఆటగాళ్లు నొవాక్ జకోవిచ్ (సెర్బియా), టాప్ సీడ్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌లు సెమీఫైనల్‌కు చేరుకున్నారు. మూడో సీడ్ డెల్‌పొట్రో కూడా సెమీస్ రేసులో నిలిచాడు. ఇలా ముగ్గురు అగ్రశ్రేణి ఆటగాళ్లు టైటిల్ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు. డిఫెండింగ్ చాంపియన్ నాదల్ సెమీఫైనల్లో అర్జెంటీనా స్టార్ డెల్‌పొట్రోతో తలపడుతాడు. వింబుల్డన్ ఓపెన్‌లో డెల్‌పొట్రోపై చెమటోడ్చి విజయం సాధించిన నాదల్ ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలనే లక్షంతో ఉన్నాడు. డెల్‌పొట్రోను ఓడించడం ద్వారా టైటిల్ పోరుకు చేరుకోవాలని భావిస్తున్నాడు. దీని కోసం ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగుతున్నాడు. మరోవైపు వింబుల్డన్ ఓపెన్ గెలిచి మళ్లీ గాడిలో పడిన మాజీ చాంపియన్ జకోవిచ్ కూడా జోరుమీదున్నాడు. జపాన్ స్టార్ నిషికోరితో జరిగే సెమీస్ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమయ్యాడు. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఫైనల్‌కు చేరుకోవాలనే లక్షంతో ఉన్నాడు. గాయం కారణంగా రెండేళ్లపాటు ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్న జకోవిచ్ ఈ సీజన్‌లో నిలకడైన ఆటతో పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే వింబుల్డన్ టైటిల్‌తో ప్రత్యర్థులకు హెచ్చరిక జారీ చేశాడు. తాజాగా యుఎస్ ఓపెన్‌లోనూ విజయంపై కన్నేశాడు. కాగా, సెమీస్ రేసులో నిలిచిన నలుగురు కూడా ప్రతిభావంతులే కావడంతో పోరు రసవత్తరంగా సాగడం ఖాయం.

Comments

comments