Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

సెమీస్‌లో ఒస్టాపెంకో, సెరెనా

sprt

కెర్బర్, జొకొవిచ్, డెల్‌పొట్రో ముందుకు, వింబుల్డన్ ఓపెన్

లండన్: వింబుల్డన్ ఓపెన్‌లో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్, అంజెలిక్ కెర్బర్ (జర్మనీ), జెలినా ఒస్టాపెంకో (లాత్వియా) సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. జర్మనీ క్రీడాకారిణి 13వ సీడ్ జూలియా జార్జెస్ కూడా క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ నొవాక్ జొకొవిచ్ (సెర్బియా), అర్జెంటీనా స్టార్ మార్టిన్ డెల్‌పొట్రో క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. ఇతర పోటీల్లో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా), జూలియా జార్జెస్ విజయం సాధించారు. కాగా, మహిళల సింగిల్స్‌లో టాప్ టెన్‌లోని అందరు నిష్క్రమించగా, పురుషుల విభాగంలో అగ్రశ్రేణి ఆటగాళ్లు రేసులో నిలువడం విశేషం. టాప్ సీడ్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), రెండో సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్) ఇప్పటికే క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు.

కెర్బర్ జోరు…

మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జర్మనీ స్టార్, 11వ సీడ్ కెర్బర్ విజయం సాధించింది. రష్యా క్రీడాకారిణి 14వ సీడ్ కసాట్కినాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ సమరంలో కెర్బర్ జయకేతనం ఎగుర వేసింది. ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం చెలాయించిన కెర్బర్ 63, 75తో కసాట్కినాను ఓడించింది. తొలి సెట్‌లో కెర్బర్‌కు ఏమాత్రం ప్రతిఘటన ఎదురు కాలేదు. ప్రారంభం నుంచే మ్యాచ్‌పై కెర్బర్ పట్టు సాధించింది. కళ్లు చెదిరే షాట్లతో ప్రత్యర్థిని హడలెత్తించింది. కెర్బర్ చెలరేగి ఆడడంతో కసాట్కినా కనీస పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసింది. అయితే రెండో సెట్‌లో కసాట్కినా పుంజుకుంది. కెర్బర్‌కు గట్టి పోటీ ఇస్తూ ముందుకు సాగింది. చూడచక్కని ఆటతో కెర్బర్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. కానీ, కీలక సమయంలో కసాట్కినా ఒత్తిడికి గురైంది. దీంతో వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న కెర్బర్ టైబ్రేకర్‌లో సెట్‌ను గెలిచి సెమీ ఫైనల్‌కు చేరుకుంది.
చెమటోడ్చింది…
మరో క్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ ఒస్టాపెంకో చెమటోడ్చి విజయం సాధించింది. స్లోవేకియా క్రీడాకారిణి డొమినిక్ చెబుల్కొవాతో జరిగిన పోరులో ఒస్టాపెంకో 75, 64తో జయభేరి మోగించింది. ప్రారంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇరువురు ఎటాకింగ్ గేమ్‌తో ముందుకు సాగారు. ఇద్దరు అద్భుత పోరాట పటిమను కనబరచడంతో తొలి సెట్‌లో పోరు టైబ్రేకర్ వరకు వెళ్లక తప్పలేదు. ఇందులో పైచేయి సాధించిన ఒస్టాపెంకో సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో కూడా చిబుల్కొవా మెరుగ్గానే ఆడింది. స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా శ్రమించింది. మరోవైపు ఒస్టాపెంకో కూడా పట్టు వీడకుండా ముందుకు సాగింది. ఇదే క్రమంలో సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది.
అలవోకగా…

jokovich
పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ నొవాక్ జొకొవిచ్ (సెర్బియా) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ జొకొవిచ్ 64, 62, 62 తేడాతో రష్యా ఆటగాడు కరెన్ కచనొవ్‌ను చిత్తు చేశాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన జొకొవిచ్ ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్న జొకొవిచ్ ఈ మ్యాచ్‌లో అసాధారణ ఆటను కనబరిచాడు. జొకొ దూకుడుగా ఆడడంతో ప్రత్యర్థి ఆటగాడు కనీస ప్రతిఘటన ఇవ్వకుండానే చేతులెత్తేశాడు.
గట్టిక్కిన డెల్‌పొట్రో..

srp
కాగా, అర్జెంటీనా స్టార్, ఐదో సీడ్ డెల్‌పొట్రో ప్రిక్వార్టర్ ఫైనల్ సమరంలో అతి కష్టం మీద విజయం సాధించాడు. ఫ్రాన్స్ ఆటగాడు గిల్స్ సిమోన్‌తో జరిగిన పోరులో డెల్‌పొట్రో 76, 76, 57, 76తో విజయం సాధించాడు. చివరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో డెల్‌పొట్రో జయభేరి మోగించాడు. ప్రారంభం నుంచే ఇద్దరి మధ్య ఉత్కంఠ సమరం కొనసాగింది. ఇద్దరు ప్రతి పాయింట్ కోసం సర్వం ఒడ్డారు. దీంతో పోరు యుద్ధాన్ని తలపించింది. తొలి రెండు సెట్లను డెల్‌పొట్రో గెలుచుకున్నాడు. మూడో సెట్‌లో సిమోన్ విజయం సాధించాడు. ఇక, నాలుగో సెట్‌లో మళ్లీ డెల్‌పొట్రో జయకేతనం ఎగుర వేసి ముందంజ వేశాడు. మరో పోటీలో 8వ సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) చెమటోడ్చి విజయం సాధించాడు. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అండర్సన్ 76, 76, 57, 76తో ఫ్రాన్స్ ఆటగాడు మోన్‌ఫీల్స్‌ను ఓడించాడు. ఇద్దరు చివరి వరకు నువ్వానేనా అన్నట్టు పోరాడారు. అయితే ఆఖరు వరకు పట్టును నిలబెట్టుకున్న అండర్సన్ మ్యాచ్‌ను సొంతం చేసుకుని క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్ పోటీలో జపాన్ ఆటగాడు నిషికోరి విజయం సాధించాడు.

ఎదురులేని సెరెనా…

serena

మరోవైపు మాజీ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) కూడా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్న సెరెనా అసాధారణ ఆటతో సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇటలీ క్రీడాకారిణి కామిలా గివోర్గిను ఓడించింది. మూడు సెట్ల హోరాహోరీ సమరంలో సెరెనా 36, 63, 64తో జయభేరి మోగించింది. తొలి సెట్‌లో కామిలా పైచేయి సాధించింది. సెరెనాను హడలెత్తిస్తూ ముందుకు సాగింది. ఇదే క్రమంలో సెట్‌ను గెలిచి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ తర్వాత సెరెనా పుంజుకుంది. తనకు మాత్రమే సాధ్యమయ్యే షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. సెరెనా ఆటను చూస్తే పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపించింది. చెలరేగి ఆడిన సెరెనా సునాయాసంగా సెట్‌ను గెలుచుకుంది. ఇక, ఫలితాన్ని తేల్చే మూడో సెట్‌లో కూడా సెరెనా ఆధిపత్యం చెలాయించింది. చూడచక్కని షాట్లతో అలరించిన సెరెనా 64తో సెట్‌ను గెలిచి సెమీస్‌కు చేరుకుంది. మరో క్వార్టర్ ఫైనల్లో జర్మనీ స్టార్ జూలియా విజయం సాధించింది. నెదర్లాండ్స్ క్రీడాకారిణి కికి బెర్టెన్స్‌తో జరిగిన పోరులో జూలియా 36, 75, 61తో జయభేరి మోగించింది. తొలి సెట్‌లో కికి పైచేయి సాధించింది. జూలియాను కట్టడి చేస్తూ సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో కూడా కికి బాగానే ఆడింది. అయితే కీలక సమయంలో ఒత్తిడికి గురైంది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న జూలియా టైబ్రేకర్‌లో సెట్‌ను సొంతం చేసుకుంది. అంతేగాక కీలకమైన మూడో సెట్‌లో కూడా జూలియా చెలరేగి ఆడింది. ప్రారంభం నుంచే కళ్లు చెదిరే షాట్లతో విరుచుకు పడిన జూలియా సునాయాసంగా సెట్‌ను గెలిచి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.

Comments

comments