Home జాతీయ వార్తలు ఆ ఘటన సిగ్గుచేటు

ఆ ఘటన సిగ్గుచేటు

ముజఫర్‌పూర్ వసతిగృహం రేప్‌లపై బీహార్ సిఎం నితీశ్

Nitish-Kumar

పాట్నా: బీహార్‌లో సంచలనం సృష్టిస్తున్న  ముజఫర్‌పూర్ వసతిగృహంలోని బాలికలపై అత్యాచారం ఘటనలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఎట్టకేలకు పెదవి విప్పారు. ఈ సంఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నితీశ్, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడానికి సంస్థాగతమైన యంత్రాంగాలు అవసరమని అన్నారు. పాట్నాలో బాలికల సంక్షేమం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కన్యా ఉత్థాన్ యోజన’ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వ నిధులతో నడిచే వసతి గృహంలో అమ్మాయిలపై అత్యాచార ఘటనలపై  నితీశ్ తన ఆవేదన వ్యక్తం చేశారు.

అమ్మాయిలపై అత్యాచార ఘటనలు తమ ప్రభుత్వానికి సిగ్గుచేటని ఆయన అంటూ, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ‘సేవా సంకల్ప్ ఏవం వికాస్ సమితి’ అనే స్వచ్ఛంద సంస్థ నడిపే వసతిగృహంలోని 42 మంది బాలికలపై జరిపిన వైద్య పరీక్షల్లో వారిలో 34 మందిపై అత్యాచారం జరిగినట్లు తేలింది. ఈ వసతిగృహం యజమాని బ్రజేశ్ ఠాకూర్ ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న విషయం తెలిసిందే. గత ఏప్రిల్‌లో ముంబయికి చెందిన టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ బీహార్ సాంఘిక సంక్షేమ శాఖకు సమర్పించిన ఆడిట్ నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోందని చెప్పిన ముఖ్యమంత్రి హైకోర్టు కూడా దర్యాప్తును పర్యవేక్షించాలని అన్నారు. ఎవరిపైనాఎటువంటి ఉదారత చూపే ప్రసక్తే లేదని, దోషులయిన వారినందరినీ కఠినంగా శిక్షించి తీరుతామని ఆయన చెప్పారు.ఈ కేసులో గత మే 31న పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ప్రధాన నిందితుడయిన ఠాకూర్ సహా పదిమందిని అరెస్టు చేశారు. ముజఫర్‌పూర్‌లోని లైంగిక నేరాలనుంచి చిన్నారులకు రక్షణ కల్పించడానికి ఏర్పాటు చేసిన కోర్టులో పోలీసులు  ఈ పదిమందిపై జూలై 26న చార్జిషీటును కూడా దాఖలు చేశారు. కాగా ఈ సంఘటనపై ముఖ్యమంత్రి మాట్లాడడం ఇదే మొదటిసారి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడానికి  సంబంధిత శాఖలతో చర్చించి ఒక బంత్రాంగాన్ని  రూపొందించాలలని తాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు నితీశ్ చెప్పారు.

ఈ సంఘటనతో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మంజు వర్మ భర్తకు కూడా సంబంధం ఉందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కాగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆరోగ్య, వైద్య శాఖ మంతుల్రతో పాటుగా మంజుశర్మ కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రసంగించిన ఆమె తన శాఖ గురించి మాత్రమే మాట్లాడారు తప్ప ఈ సంఘటన గురించి ప్రస్తావించలేదు. అయితే కార్యక్రమం ముగిసిన తర్వాత విలేఖరులు ఆమెను చుట్టుముట్టి ముజఫర్‌పూర్ ఘటన దృష్టా  మంత్రి తన పదవికి రాజీనామా చేయ్యాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై  వ్యాఖ్యానించమని పదే పదే కోరారు.