Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) వరుస హత్యలతో… వణుకుతున్న నగరం

వరుస హత్యలతో… వణుకుతున్న నగరం

24 గంటల్లోనే ఏడు దారుణాలు
కొండాపూర్‌లో ఓ మహిళ
హయత్‌నగర్‌లో మరో యువతి
ఆందోళన చెందుతున్న ప్రజలు
సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిన ప్రచారం

Murder-in-Hyderabad

మన తెలంగాణ/సిటీబ్యూరో : బండరాయితో మోది… ముక్కలుముక్కలుగా నరికి… రోకలిబండతో కొట్టి… గొంతునుపిసికి… ఇలా నిర్థాక్షిణ్యంగా… భీతినికొల్పేవిధంగా… కర్కశత్వంగా… హత్యలు. 24 గంటల్లో ఏకంగా ఏడు హత్యలు. ఈ దారుణాలతో నగర రక్తపుమడుగుగా మారింది. మహానగరం తీవ్ర కలవరానికి గురైయ్యింది. ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మవద్దో… తెలియని పరిస్థితులు నెలకొనడంపై నగర వాసులు తీవ్ర వత్తిడికి లోనవుతున్నారు. తెల్లవారితే ఎవరి వంతు అవుతుందోనని ఆందోళనకు లోనవుతున్నారు నగరవాసులు. ఒకే రోజు ఐదు హత్యలు. ఒకే ఘటనలో ముగ్గురు, విడివిడిగా ఇద్దరు. కొన్నిగంటల వ్యవధిలోనే మరో రెండు దారుణాలు చోటుచేసుకోవడంపై ఇటు పోలీసులను కలవరానికి గురిచేశాయి.
ఉద్యోగాన్వేషణలో : నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి చెందిన అనూష బీటెక్ పూర్తిచేసి నగర శివారులో ఉంటూ ఉద్యోగాన్వేషణ చేస్తున్నది. ఆమెను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తలపై మోది ఇంటిలోనే హత్య చేశారు. కాగా గత నాలుగు మాసాల క్రితమే మోతిలాల్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఈ హత్య వెనుక అతని ప్రమేయం ఉండవచ్చనేది పోలీసులు అనుమానిస్తున్నారు.

ముక్కలు ముక్కలుగా : మంగళవారం వెలుగులోకి వచ్చిన మరో ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నగర శివారు ప్రాంతమైన కొండాపూర్‌లోని శ్రీరాంనగర్‌కాలనీ బొటానికల్ గార్డెన్ సమీపంలో ముక్కలు ముక్కలుగా నరికిన ఓ మహిళ మృతదేహం ఉన్నది. అత్యంత దారుణంగా మహిళను చంపి గోనె సంచిలో మూటకట్టి వదిలి వెళ్ళారు. అది గుర్తించిన పోలీసులు హతురాలి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. హంతకులు ఎవరనేది తేల్చేందుకు దర్యాప్తును మొదలుపెట్టారు.

తల్లీ బిడ్డలను : గత సోమవారం తనతోపాటు సహజీవనం చేసి మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే అక్కసుతో మహిళను, ఆమె కూతురు, తల్లిని చంపేశాడు ఓ దుర్మార్గుడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు.

అనుమానాస్పదంగా : నేరేడ్‌మెట్‌లో శివ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రోజూ ఇళ్లలోని చెత్తను తరలించి జీవనం సాగిస్తున్న యువకుడిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసి ఉంటారని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అలాగే నార్సింగి పరిధిలోని నెక్నంపూర్ పరిధిలో ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టి హతమార్చారు. వీరి మరణాల వెనుకు మిస్టరీ వీడాల్సి ఉన్నది.

సోషల్ మీడియా ప్రభావమే : వరుసగా చోటుచేసుకుంటున్న హత్యల వెనుక సాంకేతిక వ్యవస్థ ద్వారా అందుబాటులోకి వచ్చిన సామాజిక మాధ్యమాలే కారణంగా ప్రచారం జరుగుతుంది. భయానకమైన దృశ్యాలు, అక్రమ సంబంధాలు, వ్యసనాలు, జల్సాలకు సంబంధించిన పలురకాల అంశాలు సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో ముఖ్యంగా యువతీయువకులు వాటి ప్రభావానికి లోనవుతున్నారు. తద్వారా పరోక్షంగా హింస చేస్తున్నట్టు అన్ని వర్గాల వారు అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.