Home జాతీయ వార్తలు ఎన్‌కౌంటర్

ఎన్‌కౌంటర్

ఏడుగురు మావోయిస్టులు హతం, మృతుల్లో ముగ్గురు మహిళలు
చత్తీస్‌గఢ్‌లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న కూంబింగ్

Encounter

మన తెలంగాణ/ భద్రాచలం: ఛత్తీస్‌గఢ్‌లో గురువారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ భద్రతా బగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ముందుగా ఫైరింగ్ ప్రారంభించిన మావోయిస్టులు భద్రత బలగాలు లక్షంగా కాల్పులకు తెగబడ్డారు.దీంతో బలగాలు ఎదురు కాల్పులకు దిగా యి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు పోలీసుల తూటాలకు బలయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పుల అనంతరం తెమినార్ అటవీ ప్రాంతం నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు, ఇన్సాస్ రైఫిళ్లు- 2, 302 రైఫిళ్లు, ఒక 12 బోర్ తుపాకీతో పాటు పెద్ద ఎత్తున విప్లవ సాహిత్యం, ముందులు, వస్త్రాలు, వంట సామాగ్రిని సైతం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మావోయిస్టుల ఏరివేతే లక్షంగా అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌లు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఆకులు రాలే వేసవి కాలం నుండి పెద్ద ఎత్తున పొదలు పెరిగే వర్షాకాలం వరకు చెట్టుపుట్టను సైతం మావోయిస్టుల కోసం గాలించారు. మృతి చెం దిన మావోయిస్టుల వివరాలు,మృతదేహాల ఫొటోలను ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

కొనసాగుతున్న కూంబింగ్

మావోయిస్టుల ఏరివేత కోసం అటవీప్రాంతంలో పెద్దఎత్తున కూంబింగ్ సాగుతోంది. వర్షాలు కురుస్తున్నప్పటికీ కూంబింగ్ ఆపరేషన్లును కొనసాగిస్తున్నారు. వాగులు వంకలు, పొంగడంతో ఛత్తీస్‌ఘడ్ కూంబింగ్‌కు విఘాతం ఏర్పడుతున్నప్పటికీ బలగాలు లక్షసాధన కోసం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత మావోయిస్టులపై పోలీసులు పై చేయి సాధించారు. దీంతో వారు కూడా ఎదురు దాడులకు దిగే ప్రమాదం ఉందని భావిస్తున్న నిఘా వర్గాలు అప్రమత్తం చేశారు. ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లను సంసిద్ధం చేసి పోలీసులు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రహదారులను స్వాధీనంలోనికి తీసుకున్నారు. వచ్చిపోయే వాహనలు తనిఖీ చేస్తున్నారు.