Home అంతర్జాతీయ వార్తలు సముద్రాలను రక్షించుకుందాం రండి

సముద్రాలను రక్షించుకుందాం రండి

Danny Faureడెస్క్రోక్స్ ఐలాండ్: ఈ భూగోళపు నీలపు హృదయ స్పందనను రక్షించుకుందామని సిషెలెస్ అధ్యక్షులు డౌనీ ఫౌరే వినూత్న రీతిలో పిలుపు నిచ్చారు. సముద్ర గర్భంలో నుంచి ఆయన ఉద్వేగభరిత ప్రసంగం సాగింది. సముద్రపు అట్టడుగులోని సబ్‌మెర్సిబుల్ నుంచి ఆయన మాట్లాడుతూ ఈ భూమికి నీలి సముద్రం పర్యావరణ పరిరక్షకంగా ఉంటుందని, ఇది నీలం రంగులో గుండె స్పందనగా ఉంటుందని, ఈ స్పందనను పరిరక్షించుకోవల్సి ఉందని డౌనీ ఫౌరే విజ్ఞప్తి చేశారు. ఇక మాటలకు సమయం అయిపోయిందని, చేతలకు దిగాల్సి ఉందని, ప్రపంచ దేశాలన్నీ సముద్రాలను పరిరక్షించుకోవల్సి ఉందని కోరారు. దేశాధ్యక్షులు ఒకరు పర్యావరణ పరిరక్షణకు ఈ విధంగా వినూత్నంగా స్పందించడం ఇదే తొలిసారి. గ్లోబల్ వార్మింగ్‌తో పలు రకాల సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. బ్రిటన్ ఆధ్వర్యంలో తలపెట్టిన శాస్త్ర పరిశోధనల యాత్రలో భాగంగా ఒక బృందం హిందూ మహాసముద్రం లోతులను పసికట్టేందుకు అన్వేషణకు సాగింది. వారి సబ్‌మెర్సిబుల్ నౌక నుంచి దేశాధ్యక్షులు మాట్లాడారు.

ఈ బృందాన్ని అభినందించిన ఫౌరే ప్రపంచం అంతా సముద్రాల విలువ తెలుసుకోవల్సి ఉందన్నారు. భూ ఉపరితలంలో మూడింట రెండొంతులు సముద్రాలు విస్తరించుకుని ఉంటాయని, అయితే మనం సముద్రాల పరిరక్షణను గాలికి వదిలేస్తామని, మనకు ఎక్కడో ఉన్న అంగారకుడి చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి కానీ మనవే అయిన, మనకు అందుబాటులో ఉన్న సముద్రాలు వాటి లోతట్టు ప్రాంతాల గురించి సరైన అవగావహన లేనేలేదని ఫౌరే ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి మనుగడకు ఇది కీలకమైన సవాలు అని , రాబోయే తరాలు ఈ సమస్యను పరిష్కరించుకుంటాయని వేచిచూడటం కుదరదని, సమయం మించిపోకముందే మేల్కొనాల్సి ఉందన్నారు. ఈ ఆఫ్రికా దీవి దేశపు తీరంలోకి వచ్చి అలల మట్టానికి 400 అడుగుల దిగువన తిష్టవేసుకుని ఉన్న సబ్‌మెర్సిబుల్‌లోకి ప్రెసిడెంట్ టీ షర్టు, షార్ట్‌తో వచ్చారు. సముద్రం అట్టడుగున కూల్‌కూల్‌గా ఉందని, జీవవైవిధ్యం బ్రహ్మండంగా ఉందని, ఈ సాహస యాత్రికులను అభినందించేందుకు వెళ్తిన తాను ఒక్క నిర్ణయానికి వచ్చానని, ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించి తీరుతానని చెప్పారు.

Seychelles president Danny Faure Calls Protect our Oceans