Home జాతీయ వార్తలు బీహార్‌లో సీట్లపై చిక్కు ముడేనా?

బీహార్‌లో సీట్లపై చిక్కు ముడేనా?

shah

షా-నితీశ్ భేటీ తర్వాత కూడా తేలని పంపిణీ 

ఎన్‌డిఎలో నితీశ్ కొనసాగడంపై మాత్రమే వచ్చిన స్పష్టత

పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాల మధ్య ఇటీవల జరిగిన చర్చల్లో ఇరువురు నేతలు ఉల్లాసంగా కనిపించడం వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్(యునైటెడ్) తిరిగి మహా కూటమిలోకి వెళ్తుందన్న ఊహాగానాలకు తెరపడినప్పటికీ రాష్ట్రంలో ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపిణీ మాత్రం ప్రధాన భాగస్వామ్య పక్షాలకు పెద్ద సవాలేనని పరిశీలకులు అంటున్నారు.గత గురువారం పాట్నాలో నితీశ్, అమిత్‌షాల మధ్య రెండు సార్లు జరిగిన చర్చల్లో ఇరువురు నేతల మధ్య కనిపించిన స్నేహపూరిత వాతావరణం రాష్ట్రంలో తనకు ‘పెద్దన్న’ గౌరవం ఇచ్చి, రాష్ట్రంలో మెజారిటీ లోక్‌సభ స్థానాలు తమ పార్టీకి ఇవ్వని పక్షంలో నితీశ్ ఎన్‌డిఏ కూటమినుంచి వైదొలగి తిరిగి లాలూ ప్రపాద్ పార్టీ ఆర్‌జెడితో చేతులు కలుపుతారన్న ఊహాగానాలకు తెరవేసింది. ఈ సందర్ఖంగా ఇరువురు నేతలు ఫొటోగ్రాఫర్ల ముందు నవ్వుతూ కనిపించడమే కాకుండా, తమ రెండు పార్టీల మధ్య సాన్నిహిత్యాన్ని బిజెపి అధ్యక్షుడు మాటల్లో కూడా స్పష్టంగా చెప్పారు.‘ ప్రత్యర్థులు పెద్దగా ఆశలు పెట్టుకోవలసిన అవసరం లేదు. నితీశ్ అవినీతిపరులతో చేతులు కలపరు’ అని విలేఖరులతో మాట్లాడుతూ షా అన్నారు. వాస్తవానికి నితీశ్, అమిత్‌షాల మధ్య చర్చల్లోనే సీట్ల పంపిణీ సమస్య పరిష్కారమవుతుందని ఇరు పార్టీల వర్గాలు భావిస్తూ వచ్చాయి. అయితే ఈ చర్చల్లో ఆ అంశం ప్రస్తావనకు రాలేదని, బిహార్‌లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితిపై మామూలు చర్చ మాత్రమే జరిగిందని ఈ చర్చల గురించి తెలిసిన ఇరు పార్టీలలోని నేతలు అంటున్నారు. ‘ ఇరువురు నేతల మధ్య మంచి సమావేశం జరిగింది. అయితే సీట్ల పంపిణీ అనేది సుదీర్ఘ ప్రక్రియ. ఏ పార్టీకూడా తనకు తానుగా ఒక నిర్ణయానికి రాలేదు. భాగస్వామ్య పక్షాల నేతల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగిన తర్వాత మాత్రమే ఒక నిర్ణయం తీసుకోగలుగుతారు’ అని .ఎడి(యు) ప్రధాన కార్యదర్శి కెసి త్యాగి అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలతో పాటుగా 2020లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి, జెడి(యు), ఇతర ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు కలిసే పోటీ చేస్తాయని షానితీశ్‌ల సమావేశం స్పష్టం చేసిందని బిజెపి సీనియర్ నేత, బిహార్ మంత్రి నందకిశోర్ యాదవ్ కూడా చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయముందన్న ఆయన సీట్ల పంపిణీ అంశాన్ని భాగస్వామ్య పక్షాల మధ్య సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెప్పారు.
సీట్ల పంపిణీపై ఇరు పార్టీల నేతలు ఆశావహంగా మాట్లాడినప్పటికీ అది అంత సులభం కాదని బిహార్ రాజకీయాల గురించి తెలిసిన వారికి అర్థమవుతుంది. గత ఏడాది ఆర్‌జెడి, కాంగ్రెస్‌లతోకూడిన మహా కూటమితో తెగతెంపులు చేసుకుని నితీశ్‌కుమార్ ఎన్‌డిఎలోకి రావడంతో ఆ కూటమి స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయి.గత లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి, దాని మిత్రపక్షాలైన ఎల్‌జెపి, ఆర్‌ఎల్‌ఎస్‌పిలు కలిసి రాష్ట్రంలోని మొత్తం 40స్థానాల్లో 31 స్థానాలను గెలుచుకోగా, వామపక్షాలతో కలిసి పోటీ చేసిన జెడి(యు) మోడీ ప్రభంజనంలో కొట్టుకు పోయి కేవలం రెండు సీట్లలో మాత్రమే గెలుపొందింది. 2009 ఎన్నికల్లో జెడి(యు) గెలుపొందిన డజనుకు పైగా స్థానాలను బిజెపి, దాని మిత్రపక్షాలు దానినుంచి లాగేసుకున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీకూడా అవి తమ కంచుకోటలని చెప్పుకోలేదు. ముజఫర్‌పూర్, వాల్మీకినగర్, జంఝర్‌పూర్, గోపాల్‌గంజ్, ఉజియార్‌పూర్, బెగుసరాయ్ లాంటిడజనుకుపైగా నియోజకర్గాల్లో 2009లో జెడి(యు)విజయం సాధించగా, 2014 ఎన్నికల్లో ఎన్‌డిఏ గెలుపొందింది. అయితే సీట్ల పంపిణీలో గెలుపు అవకాశాలే నిర్ణయాత్మక అంశంగా ఉంటుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని బిజెపి నాయకుడొకరు వ్యాఖ్యానించడం కొసమెరుపు.