Home జాతీయ వార్తలు రిలయన్స్ జియో బ్రాండ్ అంబాసిడర్ షారుఖ్

రిలయన్స్ జియో బ్రాండ్ అంబాసిడర్ షారుఖ్

Shah-Rukh-Khanముంబయి : బిలియనీర్ ముఖేష్ అంబానీ టెలికాం వెంచర్ రిలయన్స్ జియోకు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌ను నియమించారు. డిసెంబర్ 27న జియో 4జి సేవలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగులకు మాత్రమే ఈ సేవలను ప్రారంభించి, ఆ తర్వాత వాణిజ్య పరంగా మార్చి-ఏప్రిల్‌లో సేవలను తీసుకురానున్నారు. ఓ న్యూస్ చానెల్ ఇంటర్వూలో షారుఖ్ మాట్లాడుతూ, ముఖేష్ బాయ్ తనకు వివరించారని, తాను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నానని అన్నారు. ఇది ముఖేష్ వారసుల ప్రాజెక్టు అని, వారు తనతో ఎంతో సన్నిహితంగా ఉంటారని అన్నారు. డిసెంబర్ 27న రిలయన్స్ జియో ఇన్ఫోకామ్(ఆర్‌జెఐఎల్) 4జి సేవల ప్రారంభోత్సవ వేడుకకు ఖాన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహ్మాన్‌లు హాజరుకానున్నారు. సేవలను మరింత మెరుగుపర్చేందుకే రిలయన్స్ జియో లాంఛింగ్ రెండు సార్లు వాయిదా పడిందని నటుడు తెలిపారు. ఈ సరికొత్త సేవలు భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పెను మార్పులు తీసుకురానుందని అన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్ దివంగత ధీరూబాయ్ అంబానీ జయంతి రోజున రిలయన్స్ జియో 4జి సేవలను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా వెయ్యి పైగా ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది.