Home ఆఫ్ బీట్ మంచి క్యారెక్టర్ ఉంటేనే నటిస్తాను…

మంచి క్యారెక్టర్ ఉంటేనే నటిస్తాను…

Sharanya pradeep is tv newsreader chance

తెలంగాణ  యాస అలవోకగా మాట్లాడగలదు. ఆమె మాట్లాడుతుంటే మన పక్కింటి అమ్మాయి మాట్లాడుతున్నట్లే  ఉంటుంది.  అలా గలగల మాట్లాడే గొంతు   చదువుకునే రోజుల్లోనే ఆమెకు టీవి న్యూస్‌రీడర్‌గా అవకాశం తెచ్చిపెట్టింది.  తరువాత  V6 తీన్మార్  లచ్చమ్మ గా పల్లె పల్లెకు   పరిచయం అయ్యి చాలా మంది అభిమానుల్ని సంపాదించింది.  తెలంగాణ యాసతో వచ్చిన శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ అక్కగా మనందరిని ఫిదా చేసింది. ఇంకా  దూంధాం అంటూనే   మరోసారి  శైలజా రెడ్డి అల్లుడు సిపిమాతో  మనల్ని మరోసారి మురిపించనున్న మన నిజామాబాద్ అమ్మాయి శరణ్యప్రదీప్   సకుటుంబంతో  ముచ్చటించింది..

తీన్మార్, టీన్యూస్ దూంధాం ముచ్చట్ల గురించి..
నిజామాబాద్ లోకల్ చానల్ ద్వారా V6 వరకూ రాగలిగాను. V6 లో వార్తలు చదవడానికి నన్ను తీసుకున్నపుడు 15,20 రోజులు ప్రాక్టీస్ చేయించారు. నేను పెద్ద రాములమ్మ కు అభిమానిని. నేనే తెలంగాణ స్లాంగ్‌లో ఒక న్యూస్ తయారు చేసుకుని చదివాను. చాలా బాగా చదువుతున్నప్పటికీ నా హావభావాలు ఇంకా మంచిగా రావాలన్నారు. తరువాత తీన్మార్ న్యూస్ లచ్చమ్మ గెటప్‌లో న్యూస్ చదివాను. అప్పుడు బాగా చేశానని మెచ్చుకున్నారు. మంగ్లీ, మల్లన్న ముగ్గురం కలిసి చేసిన తీన్మార్ ప్రోగ్రామ్ అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోలేదు. ఈ తీన్మార్ నాకు చాలా గుర్తింపునిచ్చింది. నేను మా ఊరెళ్లినపుడు తీన్మార్ లచ్చమ్మ వచ్చింది అంటూ మా ఇంటికి చాలా మంది వస్తుంటారు. ప్రతి ఊరు పల్లె పల్లెకు తీన్మార్ లచ్చమ్మగానే నన్ను పిలుస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతం టీ న్యూస్ లో దూంధాం ప్రోగ్రామ్ చేస్తున్నాను.

ఫిదా సినిమా హీరోయిన్ అక్కగా ….
నిజంగా నాకు శేఖర్ కమ్ముల ఫిదా సినిమాలో అవకాశం వస్తుందని అనుకోలేదు. కానీ ఏదో ఒక సినిమా చేయాలన్న కోరిక మాత్రం ఉండేది. అయితే ఫిదా సినిమా కు తెలంగాణ అమ్మాయి తెలంగాణ స్లాంగ్ మంచిగా మాట్లాడే అమ్మాయి కావాలని వెతుకుతున్నారని తెలిసింది. మా ఆయన ప్రదీప్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. అప్పుడు ప్రదీప్‌తో ఒక సారి నేను ప్రయత్నం చేస్తా నన్ను తీసుకెళ్లమని అడిగా అలా అక్కడికి వెళ్లగానే నాకు నాలుగు లైన్స్ ఇచ్చి మాట్లాడమన్నారు. బాగుందని సెలక్ట్ చేసి నాకు హీరోయిన్ అక్క పాత్ర ఇచ్చారు. మామూలుగా ఆడ పిల్లలకు పెళ్లైన తర్వాత బయటకెళ్లి పని చేయాలంటే ఒప్పుకోరు. కాని ప్రదీప్ అలా కాదు నన్ను ప్రోత్సహిస్తుంటాడు. ఫిదా సినిమా కోసం అమెరికాలో 40 రోజులు ఉన్నాను. హీరో వరుణ్ తేజ్ చాలా మంచి స్వభావం గల మనిషి. నేను హీరోయిన్ సాయిపల్లవికి పెద్ద అభిమానిని..

మీ నేపథ్యం..
మాది నిజామాబాద్ జిల్లా లోకల్ మేము ఇద్దరం ఆడ పిల్లలం నేను పెద్దమ్మాయిని. నాన్న ప్రైవేట్ ఉద్యోగి మా అమ్మ గృహిణి ఇంట్లోనే మిషన్ కుడుతుంది. మా కుటుంబం నా చిన్నప్పుడు చాలా బాధలు పడ్డ్డ సందర్భాలున్నాయి. మాకు కొన్ని సార్లు తినడానికి కూడా లేక మస్తు ఇబ్బంది అయ్యేది. మా నాన్న మాకు అన్నం పెట్టి సరిపోక పోతే ఆ రోజు ఆయన నీళ్లు తాగి పడుకునేవాడు. తల్లిదండ్రులు చాలా వరకూ పిల్లలకు వాళ్లు పడుతున్న సమస్యల గురించి తెలియనివ్వకూడదు అనుకుంటారు. కాని మా అమ్మ నాన్న వారు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రతి చిన్న విషయాన్ని మాకు చెప్పేవారు. ఎందుకంటే ఆ కష్టం గురించి మాకు తెలియాలని జీవితం విలువలను తెలియజేసేవారు.

మీ ఆదర్శ వివాహం గురించి…
మాది కులాంతర ప్రేమ వివాహం. మా ఇద్దరికీ న్యూస్ చానల్‌లో పరిచయం అయ్యింది. ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నాం. గత కాలపు పరిస్థితులు ఇప్పుడు లేవు కాలం మారుతుంది. అప్పట్లో ఎవరిని చూపిస్తే వారిని చేసుకునే రోజులు కావు. మాకు అభిప్రాయాలు ఉంటాయి. జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో స్వేచ్చఉండాలి కదా. కాలానుగుణంగా సమాజంలో మార్పులు సహజంగా వస్తుంటాయి. చాలా కుటుంబాల్లో అమ్మాయి అనగానే మేము చెప్పింది వినాలనే వారుంటారు. మాకు నచ్చినట్లు ఉండాలనే ఆక్షాంలు సహజంగా ఉంటాయి. అందరి లాగే అలాంటి పరిస్థితులు నాకు ఎదురయ్యాయి. కాని మా ఆయన ప్రదీప్ ప్రేమ మా అమ్మ వాళ్లను ఎక్కువ కాలం దూరంగా ఉండనివ్వలేదు. కొంత కాలం గడిచాక అందరూ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అందరం కలిసే ఉంటున్నాం.

టీవి యాంకర్‌గా అవకాశాలు ఎలా వచ్చాయి.
నాకు చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా ఇష్టం. మా ఇంట్లో చిన్నప్పుడు టీవి లేదు కాని పక్కింట్లో చూసేవాళ్లం. సినిమాలో నాకు నచ్చిన కొన్ని సీన్‌లు ఇంట్లో ఎవరు లేనప్పుడు అలాగే యాక్టింగ్ చేసే అలవాటు ఉండేది. పేపర్‌లో ఒక పేజిలో వస్తుండేవి ఆ పాటలో నటించిన హీరో హీరోయిన్ ఫొటో కట్‌చేసి మా నోట్ బుక్ లో అతికించుకునే దాన్ని. ఇంటర్ నుండి నా చదువు ఇతర ఖర్చుల కోసం ట్యూషన్ చెప్పేదాన్ని . కాలేజీలో ఉన్నప్పుడు చిన్న చిన్న వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు మా ఉపాధ్యాయులు నా గొంతు బాగుంటుందని చెప్పేవారు. అలా నిజామాబాద్ లో కొత్త లోకల్ న్యూస్ చానల్ లో వార్తలు చదవడానికి నన్ను ఎంపిక చేశారు. అలా నాకు టీవి లో న్యూస్ యాంకర్‌గా అవకాశం వచ్చింది. అక్కడి నుండి v6 లో తీన్మార్ లచ్చమ్మగా మారిపోయాను.

బతుకమ్మ పండుగ కోసం అబుదాబి ప్రయాణం…
బతుకమ్మ పండుగ సందర్భంగా నన్ను యాంకర్‌గా అబుదాబి తీసుకుపోయారు. అక్కడ కూడా మన తెలుగు వాళ్లు చాల మంది ఉన్నారు. మేము అక్కడికి పోగానే తెలుగు వారు 700 మందికి పైగా వచ్చి బతుకమ్మ పండుగను జరుపుకున్నారు.
శైలజా రెడ్డి సినిమాలో ఏ క్యారెక్టర్ చేస్తున్నారు.
శైలజా రెడ్డి అల్లుడు లో హీరోయిన్ పక్కన ఉండే క్యారెక్టర్ చేస్తున్నాను.ఈ సినిమా కోసం గోవా వెళ్లి వచ్చాను. ఫిదా సినిమాలో నా క్యారెక్టర్ నా యాక్టింగ్ బాగుందని విజయ్ సార్ డైరెక్టర్ మారుతిని కలవమని చెప్పారు. అలా ఈ సినిమాలో అవకాశం వచ్చింది. ఇంకా నాకు చాలా సినిమా అవకాశాలు వస్తుంటాయి. అన్నీ ఒప్పుకోవట్లేదు. నేను చేసే క్యారెక్టర్ అందరి మనసుల్ని గెలుచుకోవాలి. అలాంటి మంచి క్యారెక్టర్ ఉంటేనే నేను ఆ సినిమాలో నటిస్తాను..

ఇప్పుడు తెలంగాణ యాసలో సినిమాలు …
అప్పట్లో సినిమాల్లో రౌడీలకు లేదా ఏదైనా కామెడి కోసం తెలంగాణ యాసను వాడుకునేవారు. కాని తెలంగాణ వచ్చిన తరువాత మన భాషలో చాలా సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు సినిమా హీరో హీరోయిన్ లు కూడా తెలంగాణ యాసలో మాట్లాడుతున్నారు . మన భాష ఎంతగా హిట్టు అవుతుందో కొన్ని సినిమాలు చూస్తే మనకే అర్థమవుతుంది కదా…!

                                                                                                                                                            – బొర్ర శ్రీనివాస్