Home తాజా వార్తలు భద్రతకు భరోసా

భద్రతకు భరోసా

SHE Teamsఒంటరిగా మహిళ బయటకు వెళ్తున్న రోజులివి. ఆమెకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నాయి షీటీమ్స్. మహిళలకు మరింత ధైర్యాన్నిస్తూ, ఆమెకు ఎటువంటి సమస్య వచ్చినా తీరుస్తోంది. స్త్రీకి ఏదైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి సంకోచించే రోజులు పోయాయి. తన సమస్యను ఎవరెవరికో చెప్పుకుని నవ్వులపాలు కాకుండా డైరెక్టుగా షీటీమ్స్‌కే తెలిపి, వారి నుంచి సహకారాన్ని అందుకుంటోంది. ఇప్పుడు మహిళలు మరింత ధైర్యంగా ఇంటా, బయటా ఉండగలుగుతున్నారు.

మహిళల భద్రతకు సైబరాబాద్ షీటీమ్స్ వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. మహిళలు, యువతులు, పిల్లలు, ఉద్యోగినులను వేధిస్తున్న వారి వివరాలు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు చెప్పేందుకు వారిలో భరోసా నింపుతున్నారు. ఉద్యోగినులు పని చేసే ప్రాంతాల్లో ఎక్కువగా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. దీనిని రూపుమాపేందుకు ఆయా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువతులు ఎక్కువగా ఆర్టీసి బస్సు కండక్టర్లు, ఆటో డ్రైవర్ల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ల ప్రాంతాల్లో, ఆటో స్టాండ్‌లలో షీటీమ్స్ బృందాలు ఆటో డ్రైవర్లకు, కండక్టర్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లు రహస్యంగా ఉంచడమే కాకుండా నిందితులకు కౌన్సెలింగ్ ఇవ్వడం విశేషం. కేసు తీవ్రత ఎక్కువగా ఉన్న వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. ఎక్కువగా యువతులు తమ బంధువుల నుంచే లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు షీటీమ్స్ విచారణలో తెలిసింది.

షీటీమ్స్‌పై అవగాహన చర్యలు
ఐటి కారిడార్ ఉన్న సైబరాబాద్‌లో వేలాది మంది మహిళలు వివిధ మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. వీరంతా రోజూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిపోతుండడంతో ప్రయాణ సమయంలో లైంగిక వేధింపులకు గురవుతున్నారు. వారికి షీటీమ్స్‌కు ఎలా ఫిర్యాదు చేయాలి, నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు తదితర వివరాలు చెబుతున్నారు. బాధిత మహిళలు షీటీమ్స్‌కు వచ్చి ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు, వాట్సాప్, ఫేస్‌బుక్, టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఉద్యోగులు సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నా ఆయా కంపెనీలు మాత్రం ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు మాత్రం ఏర్పాటు చేయడంలేదు. వాటి ఏర్పాటుకు సైబరాబాద్ షీటీమ్స్ వారు ఎంతగా ప్రయత్నించిన సత్ఫలితాలు ఇవ్వడంలేదు. చాలా మంది ఇంటర్నల్ కమిటీకి ఫిర్యాదు చేయకుండా నేరుగా వచ్చి షీటీమ్స్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. సైబరాబాద్ షీటీమ్స్‌కు ఎక్కువగా ఫిర్యాదులు ఐటి ఉద్యోగుల నుంచే వస్తున్నాయి. వివాహం పేరుతో వేధిస్తున్నారనే ఫిర్యాదులు ఐటి ఉద్యోగుల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. వారిని పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రవర్తన మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని షీటీమ్స్ సిబ్బంది హెచ్చరిస్తున్నారు. ప్రవర్తన మార్చుకోని వారిని పలు దఫాలుగా కౌన్సెలింగ్‌కు పిలుస్తున్నారు.

షీషటిల్స్‌తో మరింత సౌకర్యం…
సైబరాబాద్ పరిధిలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కోసం షీటీమ్స్ ఆధ్వర్యంలో ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి రావడానికి మహిళా ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి బస్సులు రాకపోవడం, కొందరి వేధింపులు కూడా తోడుకావడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడేవారు. వీటిని దృష్టిలో పెట్టుకుని సైబరాబాద్ షీటీమ్స్ ఆధ్వర్యంలో వివిధ కంపెనీల ఆర్థిక సాకారంతో ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. బస్సులు ఉచితంగా గమ్య స్థానాలకు చేర్చడమేకాకుండా, వాటికి జిపిఎస్ ట్యాగ్‌ను ఏర్పాటు చేశారు. బస్సు తమ ప్రాంతానికి ఎప్పటి వరకు వస్తుందో నిర్ధిష్ట సమయాని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా బస్సు సిబ్బంది వేధించినా కూడా నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు.

గృహ హింస నుంచి విముక్తి… 
చాలా మంది మహిళలు భర్తల వేధింపులు తట్టుకోలేక షీటీమ్స్‌ను ఆశ్రయిస్తున్నారు. వారి చాలా మందికి కనీసం పోలీసుల వద్దకు వచ్చేందుకు కూడా డబ్బులు లేకపోవడంతో వచ్చిన వారికి పోలీసులే అన్ని సమకూరుస్తున్నారు. కొందరు మహిళలు పిల్లలను తీసుకుని కట్టుబట్టలతో రాగా వారికి అన్ని వసతులు కల్పిస్తున్నారు. వారిని స్థానికంగా ఉన్న కస్తూరిబా ఆశ్రమంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. వారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా మహిళలు వారి కాళ్ల మీద నిలబడే విధంగా ఉపాధి కల్పిస్తున్నారు. అత్యాచారానికి గురైన వారు మతిస్థిమితం కోల్పోతే వారికి దగ్గర ఉండి సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. చాలా మంది మహిళలను వారి భర్తలు వరకట్నం కోసం వేధిస్తున్నారు. వారిని పిలిచి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.

భరోసా కేంద్రం- ఉపాధి కార్యక్రమాలు…
గృహ హింస, లైంగిక దాడి తదితర వేధింపులకు గురవుతున్న వారికి భరోసా సెంటర్ భద్రత కల్పిస్తోంది. గాయాలపాలయిన వారికి భరోసా కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ సాయంతో వారికి వివిధ పనుల్లో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తున్నారు. గతంలో కట్టుబట్టలతో వచ్చిన ఇద్దరు మహిళలకు భరోసా కేంద్రంలో చికిత్స అందజేసి రక్షణ కల్పించారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. బాధిత మహిళల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. భరోసా కేంద్రానికి ఇప్పటి వరకు 165కేసులు రాగా అందులో గృహ హింస కేసులు 116, లైంగిక వేధింపుల కేసులు 9, పోక్సో కేసులు 40 వచ్చాయి. నేరుగా భరోసా కేంద్రానికి వచ్చి 46మంది తమ జరగుతున్న వేధింపుల గురించి ఫిర్యాదు చేశారు. వాట్సాప్‌లో 18, పోస్ట్, మెయిల్‌లో 6, పిఎస్‌లో 17, షీటీమ్స్ ద్వారా 24, సెంట్రల్ భరోసాకు 5 కేసులు వచ్చాయి. దాదాపుగా అన్ని కేసులను పరిష్కరిస్తున్నారు. కౌన్సెలింగ్ చేసినా మారని వారిపై కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నారు.

బంధువులే ఎక్కువగా వేధిస్తున్నారు
యువతులు, బాలికలు ఎక్కువగా వారి బంధువుల నుంచే లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువగా ఇవే ఉన్నాయి. వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. ప్రవర్తన మార్చుకోని వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నాం. ఎక్కువ ఫిర్యాదులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న యువతులే చేస్తున్నారు. స్నేహంగా ఉంటే ప్రేమ పేరుతో వేధిస్తున్నారని చెబుతున్నారు. వేధించేవారిని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. వారిలో మార్పు వచ్చేవరకు ఎన్ని సార్లు పిలిచినా కౌన్సెలింగ్ రావాల్సిందే, వారి ప్రవర్తనను సైక్రియాటిస్టు కూడా పరిశీలిస్తాడు.
-అనసూయ, షీటీమ్స్ డిసిపి, సైబరాబాద్

– ఎన్. రమేష్, సిటీబ్యూరో