Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

షీటీంకు, విద్యార్థినిలకు వారధిగా షీ ఫర్ హర్

స్టూడెంట్స్‌కు భద్రతా వాతావరణం
వేధించే వారి నియంత్రణే ధ్యేయం
175 కళాశాలల్లో 350 మంది నియామకం
షీ ఫర్ హర్ ద్వారా నమోదైన కేసులు 17

Police

మన తెలంగాణ, సిటీబ్యూరో: విద్యార్థినిలూ..! మిమ్మల్ని ఎవరైనా వేధిస్తున్నారా..? మీకు సహరచ విద్యార్థులు వెంబడిస్తున్నారా..? మీఫోన్‌కు పదేపదే ఫోన్ చేస్తూ విసిగిస్తున్నారా..? అసభ్యకరమైన సమాచారాన్ని కానీ, చిత్రాలను గానీ పంపిస్తున్నారా…? ఈ విషయాన్ని మీరు పోలీసులకు చెప్పేందుకు వెనుకాడుతున్నారా..? అయితే, మీరు వెంటనే మీ కళాశాలలోని షీ ఫర్ హర్ అనే స్వచ్చంద సేవకురాళ్ళను కలవండి. మీరు వాటి నుండి విముక్తిని పొందుతారు. మీకు స్వేచ్చాయుత, భద్రతా పరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలు మీకు గానీ, మీ కళాశాలలోగాని, మీ పరిసర ప్రాంతాల్లోనూ నివారించేందుకు, పునరావృతం కాకుండా ఉండేందుకు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ప్రత్యేకంగా షీ ఫర్ హర్ అనే బృందాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సహచర విద్యార్థులు, స్థానిక యువకుల నుండి ఎదురవుతోన్న వేధింపులను, వెంటపడటాన్ని నివారించడానికి ఈ బృందాలు కృషిచేస్తున్నాయి. విద్యార్థినిలు బయటకు చెప్పుకోలేక, లోలోపలనే బాధలను దిగమింగడాన్ని గ్రహించిన కమిషనర్ కళాశాలల్లోనే మీ సహచర విద్యార్థినిలతోనే షీ ఫర్ హర్ అనే పేరుతో వాలంటీర్లను నియామకం చేశారు.

షీ ఫర్ హర్ ఉద్దేశం

షీ టీం బృందాలకు అనుబంధంగా విద్యార్థులు స్వచ్చందంగా పనిచేసే వారిని షీ ఫర్ హర్ అంటారు. వారు కూడా ఆయా కళాశాలల్లో చదువుకునే విద్యార్థినిలే. ఈవ్ టీజింగ్, ఫోన్ వేధింపులపై, కళాశాలలో సహచర విద్యార్థినీ విద్యార్థుల నుండి ఎదురవుతోన్న తీవ్రమైన బాధలను కొందరు షీ టీం బృందాల దృష్టికి తీసుకు రావడంలేదు. ఇది గ్రహించిన కమిషనర్ ఆయా కళాశాలల విద్యార్థులతోనే షీ టీం బృందాలకు అనుగుణంగా స్వచ్చందంగా పనిచేసే వారిని షీ ఫర్ హర్‌గా నియామకం చేశారు. వీరు తమ విద్యాసంస్థలోని బాధిత విద్యార్థినిలకు భరోసానిస్తూ, ధైర్యాన్ని కల్పిస్తూ వారు షీ టీం బృందాలను కలిసి ఫిర్యాదులు చేసేట్టుగా చేస్తారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు షీ టీం బృందాలు దర్యాప్తు ప్రారంభించి, వాస్తవంగా వేధింపులు చేసేవారిని అదుపులోకి తీసుకుంటారు. తదనంతరం వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే కౌన్సిలింగ్‌ను నిర్వహిస్తారు. తద్వారా కళాశాలల్లో, విద్యార్థిని ఉండే పరిసర ప్రాంతాల్లోనూ ఈవ్ టీ జింగ్, వేధింపులు చేయడాన్ని నివారించడం జరుగుతుంది.

ప్రత్యేక శిక్షణ…

షీ ఫర్ హర్ బృందంలో పనిచేసేందుకు ముందుకు వచ్చిన వారిలో ప్రతి కళాశాల నుండి ఇద్దరిని ఎంపిక చేస్తారు. ఆ ఇద్దరికి చట్టాలు, న్యాయం, శాంతిభద్రతలు, నియమ నిబంధనలపై పోలీసులు ప్రత్యేకంగా శిక్షణనిస్తారు. మహిళా నేరాలపై వారిని చైతన్యం చేస్తారు. వారికి సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తారు. అనంతరం వారిని షీ ఫర్ హర్‌గా నియామకంచేసి కళాశాల మైదానంలోకి ప్రవేశపెడతారు. వీరు పోలీసులకు, విద్యార్థినిలకు మధ్య వారధిగా ఉంటారు. వీరి ద్వారా ఎవరైనా బాధిత విద్యార్థులు పోలీసులను సంప్రదించే వీలుంటుంది.

సత్ఫలితాలు…

ప్రస్తుతం రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 175 కళాశాలల నుండి మొత్తం 350 మంది షీ ఫర్ హర్‌కు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. వీరి ద్వారా 17 కేసులు నమోదు చేసి 17 మంది నిందితులను పట్టుకోవడం జరిగింది. ప్రతి కళాశాలలో ఈవ్ టీజింగ్, విద్యార్థులను పలురకాలుగా వేధించడం వంటివి చాలా వరకు తగ్గినట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు. మరికొందరు షీ ఫర్ హర్‌గా పనిచేసేందుకు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు.

Comments

comments