Home ఆఫ్ బీట్ సైబరాబాద్ షీ టీమ్…. మహిళల భద్రతే లక్ష్యం

సైబరాబాద్ షీ టీమ్…. మహిళల భద్రతే లక్ష్యం

ఒకే నెలలో 149 కేసులు నమోదు
సున్నిత ప్రదేశాల్లో చైతన్య కార్యక్రమాలు
10,625 మంది హాజరు
వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌లతో ఫిర్యాదుల స్వీకరణ
మేయిల్ కోసం షీటీమ్.సైబరాబాద్@జిమెయిల్.కామ్ సంప్రదించాలి

She-Team1

మన తెలంగాణ/సిటీబ్యూరో: ఒక ప్రైవేట్ ఉద్యోగినితో తన బంధువైన ఓ యువకుడు ప్రేమిస్తున్నట్టు తన అభిప్రాయాన్ని తెలియపరిచాడు. ఆమె అతడి ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో ఆ యువకుడు ఆమె వెంటపడి తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. ఒక రోజు ఆమె గదిలో స్నానం చేస్తున్న సమయంలో సాంకేతికపరంగా వీడియో తీసి, అది చూపుతూ ఆమెను బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నాడు. ఇది భరించలేక ఆమె నేరుగా షీటీంకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నది. ఓ 13 ఏళ్ల బాలిక ఇంటి పక్కనే ఉండే మరో యువకుడు వెంబడిస్తున్నాడు. ఇది తెలిసిన ఆ బాలిక తండ్రి ఆ యువకుడిని వెంబడించకూడదని హెచ్చరించాడు. కానీ, ఆ యువకుడు తన నడవడికను మార్చుకోలేదు. తిరిగి వేధించడం మొదలు పెట్టాడు. వెంటనే ఆయన షీటీంకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. ఒక యువతి శంషాబాద్ బస్‌స్టాప్ నుండి నేరుగా మాసాబ్‌ట్యాంక్ ఐ హాస్పిటల్‌కు ఒక క్యాబ్‌ను తీసుకుని బయలు దేరింది. కొంత దూరం వెళ్లాక క్యాబ్ డ్రైవర్ పక్కగా ఆపి ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి క్యాబ్ దిగి ఫోటో తీసుకుని షీటీంకు వాట్సాప్ చేసింది. వెంటనే షీటీం క్యాబ్ డ్రైవర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విధంగా నగరంలోని మహిళలు, యువతులు, బాలికలు, విద్యార్థినులను వేధిస్తున్న వారిని అరెస్టు చేస్తోంది. వాట్సాప్‌లో, ఎస్‌ఎంఎస్, ఫోన్‌లు ద్వారా తమ ఫిర్యాదులు అందించవచ్చని షీటీం కోరుతోంది.

షీటీం ప్రత్యేక దృష్టి

ఈ విధంగా సైబరాబాద్ పరిధిలో మహిళలకు పటిష్టమైన భద్రతను కల్పించడంపై షీటీం బృందం ప్రత్యేక దృష్టిసారించింది. ప్రధానంగా బస్‌స్టాప్‌లు, స్థానికులు ఒకేచోట చేరుకునే ప్రాంతాల్లో నిఘాను పెంచింది. మహిళలపై వ్యాఖ్యానాలు చేసే, వంచకులు అధికంగా ఉండే, బస్‌స్టాప్‌లు, రైల్వే స్టేషన్‌లు, మాల్స్, ట్యూటోరియల్ కళాశాలలు వంటి ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఉద్యోగినులు, విద్యార్థులు, స్వయం ఉపాధిరంగాల వారికి భద్రత కల్పించడం, భరోసాను తీసుకురావడానికి షీటీం నూతన ఆలోచనలను అమలుచేస్తున్నది. ఒకే నెలలో 149 కేసులు నమోదు చేయడంతో పాటు వాటి పరిష్కార ప్రక్రియను పూర్తిస్థాయిలో చేపట్టింది. యువకులకు, విద్యార్థులకు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ను నిర్వహించింది సైబరాబాద్ కమిషనరేట్ షీటీం విభాగం.

43 నేరపూరిత కేసులు

ఒకే నెలలో 149 కేసులు నమోదు చేసింది షీటీం. సైబరాబాద్ కమిషనరేట్‌లోనే 52 కేసులు నమోదు చేయగా అందులో 43 కేసులు ప్రత్యేకంగా నేరపూరితమైనవిగా ఉన్నాయి. మరో తొమ్మిది పిటీ కేసులున్నాయి. బస్స్‌స్టాప్‌లు, ఇతర మహిళలకు అభద్రతగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా 25 చైతన్య కార్యక్రమాలను నిర్వహించి 10,625 వ్యక్తుల్లో మార్పులు తీసుకువచ్చినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. 54 వంచక కార్యకలాపాలు ఉండే ప్రదేశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యకలాపాలను విస్తృతంగా చేసినట్టు షీటీం అధికారులు వివరిస్తున్నారు. గత నెల 24వ తేదీన నిర్వహించిన కౌన్సిలింగ్ కార్యక్రమంలో 20 మంది వరకు నిందితులు హాజరయ్యారని షీటీం పేర్కొంటున్నారు.

52 వేధింపుల కేసులు

మొత్తం వేధింపుల కేసులు 52 నమోదు చేయగా అందులో 21 కేసులు ఈవ్‌టీజింగ్, 22 కేసులు ఫోన్‌లో అసభ్య పదజాలం ఉపయోగించడం, 9 కేసులు న్యూసెన్స్‌గా ఉన్నాయి. షీటీంకు ఫిర్యాదులు అందించాలనుకునే వారు 94906 17444, లేదా నేరుగా మాట్లాడానుకునేవారు మాదాపూర్ 8332981120, ఐటికారిడార్ గచ్చిబౌలి 94906173 52, బాలానగర్ 9490617349, శంషాబాద్ 949061 7354, షీటీమ్.సైబరాబాద్@జిమేయిల్.కామ్ మేయిల్ చేయాలని వారు కోరుతున్నారు.