Home స్కోర్ భారత్ కు సవాల్…

భారత్ కు సవాల్…

Shikhar Dhawan, who failed miserably in the first Test,

సమరోత్సాహంతో ఇంగ్లండ్, నేటి నుంచి రెండో టెస్టు

లార్డ్: ఇంగ్లండ్‌తో గురువారం ప్రారంభమయ్యే రెండో టెస్టు టీమిండియాకు చావోరేవోగా మారింది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ చేజేతులా ఓటమి పాలైంది. బ్యాటింగ్ వైఫల్యం వల్ల స్వల్ప లక్ష్యాన్ని సైతం కోహ్లి సేన ఛేదించలేక పోయింది. మరోవైపు క్లిష్ట పరిస్థితులను సైతం తట్టుకుంటూ అసాధారణ ఆటతో చారిత్రక విజయం సాధించిన ఇంగ్లండ్ లార్డ్ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో మరింత మెరుగైన స్థితికి చేరుకోవాలని భావిస్తోంది. కానీ, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ లేక పోవడం ఇంగ్లండ్‌కు పెద్ద లోటుగానే విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అయితే అండర్సన్, బ్రాడ్, శామ్ కరన్, ఆదిల్‌షాలకు తోడుగా క్రిస్ వోక్స్ జట్టులోకి రావడంతో ఇంగ్లండ్ బౌలింగ్ మరింత బలోపేతంగా మారింది. ఇదిలావుండగా బ్యాటింగ్ వైఫల్యం ఇంగ్లండ్‌కు కూడా ప్రతికూలంగా మారింది. తొలి టెస్టులో బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. రెండో ఇన్నింగ్స్‌లో యువ సంచలనం కరన్ ఆదుకోక పోతే ఇంగ్లండ్ కచ్చితంగా ఓటమి పాలయ్యేదే. కానీ అతని వీరోచిత ఇన్నింగ్స్ భారత్ కొంప ముంచింది. అప్పటి వరకూ కనీసం 120 పరుగుల ఆధిక్యం కూడా లేని ఇంగ్లండ్ మ్యాచ్‌ను శాసించే లక్ష్యాన్ని అందుకుంది. అతని ఇన్నింగ్స్ ఇరు జట్ల మధ్య తేడాగా నిలిచింది. మరోవైపు తొలి టెస్టులో పోరాడి ఓడిన టీమిండియా లార్డ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్ అడ్డంకులను అధిగమిస్తే ఇంగ్లండ్‌ను ఓడించడం భారత్‌కు పెద్ద కష్టమేమి కాదు.

ధావన్ డౌట్…

తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన ఓపెనర్ శిఖర్ ధవన్‌ను ఈ మ్యాచ్‌లో ఆడిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. చటేశ్వర్ పుజారాను తప్పించి తొలి టెస్టులో ధావన్‌కు అవకాశం ఇచ్చారు. అయితే ధావన్ మాత్రం రెండు ఇన్నింగ్స్‌లోనూ విఫలమయ్యాడు. దీంతో అతనిపై పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. ఈ నేపథ్యంలో ధావన్‌ను రెండో టెస్టులో ఆడించడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. కానీ, సీనియర్లపై వివక్ష చూపుతాడనే నిందను మోస్తున్న కెప్టెన్ విరాట్ కోహ్లి తలచుకుంటే ధావన్ ఈ మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం ఉంది. ఇదే జరిగితే పుజారా మరోసారి పెవిలియన్‌కే పరిమితం కాక తప్పదు. ఏదీ ఏమైనా ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా ఎవరూ వచ్చినా జట్టుకు శుభారంభం అందించాలి. అప్పుడే ఇంగ్లండ్‌పై పైచేయి సాధించే అవకాశం భారత్‌కు దక్కుతుంది. ఒకవేళ టాప్ ఆర్డర్ మరోసారి చేతులెత్తేస్తే మాత్రం టీమిండియాకు మరో అవమానకర ఓటమి తప్పదు. ఇక, కిందటి మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో ఆడడంలో విఫలమైన మురళీ విజయ్ ఈసారి భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. ఓపెనర్‌గా ఎవరూ దిగినా భారీ భాగస్వామ్యం నమోదు చేయాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో విజయ్‌తో కలిసి లోకేష్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కానీ, రాహుల్ కూడా తొలి టెస్టులో ఘోర వైఫల్యం చవిచూశాడు. దీంతో అతని ఎంపిక కూడా క్లిష్టంగా మారింది. రాహుల్ స్థానంలో పుజారా తుది జట్టులోకి వస్తాడా లేక ధావన్‌ను తప్పిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే జట్టులో చోటు దక్కితే మాత్రం సత్తా చాటేందుకు ఈ త్రయం సిద్ధంగా ఉంది.

కోహ్లిపైనే ఆశలు…
ఇక, తొలి టెస్టులో అసాధారణ పోరాట పటిమను కనబరిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌లో కూడా జట్టుకు కీలకంగా మారాడు. అతను రాణిస్తే టీమిండియాకు భారీ స్కోరు సాధించడం కష్టమేమి కాదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలిగే సత్తా కలిగిన కోహ్లికి సహకారం లభిస్తే పరుగుల వరద పారడం ఖాయం. రహానె, పుజారా తదితరులతో కలిసి భారీ ఇన్నింగ్స్ నమోదు చేయాలనే లక్షంతో కోహ్లి కనిపిస్తున్నాడు. ఇదే జరిగితే ఇంగ్లండ్ బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్, ఆల్‌రౌండర్లు అశ్విన్, హార్దిక్ పాండ్యలు కూడా బ్యాట్‌కు పని చెప్పాల్సి ఉంది. తొలి టెస్టులో వీరు రాణించి ఉంటే పరిస్థితి కచ్చితంగా భారత్‌కు అనుకూలంగా ఉండేది. కానీ బ్యాటింగ్ వైఫల్యం జట్టును వెంటాడింది.

జోరుమీదున్నారు..
తొలి మ్యాచ్‌లో చారిత్రక విజయం సాధించిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇంగ్లండ్ సమతూకంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లోనూ గెలుపే లక్షంగా బరిలోకి దిగుతోంది. అయితే బ్యాటింగ్ వైఫల్యం ఇంగ్లండ్‌ను వెంటాడుతోంది. తొలి టెస్టులో 300 పరుగుల లోపే ఆలౌటైంది. అంతేగాక రెండో ఇన్నింగ్స్‌లో కూడా తడబడింది. ఒక దశలో 87 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయింది. కానీ, శామ్ కరన్ అద్భుత బ్యాటింగ్‌తో గట్టెక్కింది. ఈ మ్యాచ్‌లో కూడా సమష్టి పోరాటంతో భారత్‌ను ఓడించాలనే లక్షంతో ఉంది. ఇరు జట్లు కూడా విజయమే లక్షంగా పెట్టుకోవడంతో పోరు నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.

పుజారాకు ఛాన్స్ ఖాయం..

తొలి టెస్టుకు దూరంగా ఉన్న దిగ్గజ ఆటగాడు, చటేశ్వర్ పుజారాకు రెండో టెస్టులో చోటు దక్కడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ధావన్, రాహుల్‌లలో ఒకరిని తప్పించి పుజారాను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఫాస్ట్ పిచ్‌లపై మంచి రికార్డు కలిగిన పుజారా జట్టులోకి వస్తే బ్యాటింగ్ మరింత బలంగా మారుతోంది. విజయ్, రహానెలతో కలిసి మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పడం పుజారా అలవాటుగా మార్చుకున్నాడు. తొలి టెస్టులో పుజారాకు చోటు కల్పిస్తే మ్యాచ్ ఫలితం కచ్చితంగా భారత్‌కే అనుకూలంగా ఉండేదని పలువురు ఇప్పటికే అభిప్రాయపడ్డారు. మరోవైపు పుజారాను తప్పించడంపై కెప్టెన్ కోహ్లి, ప్రధాన కోచ్ రవిశాస్త్రి సైతం అభిమానుల ఆగ్రహానికి గురికాక తప్పలేదు. ఈ నేపథ్యంలో పుజారాకు చోటు తథ్యమనే చెప్పాలి. ఇక, తొలి మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ ఘోరంగా విఫలమైన స్టార్ ఆటగాడు అజింక్య రహానెకు ఈ మ్యాచ్ సవాలుగా మారింది.

రెండో టెస్టుకు ఇరుజట్లు(అంచనా)
భారత్: విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధవన్, లోకేశ్ రాహుల్, దినేశ్ కార్తీక్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య, ఉమేశ్ యాదవ్, శార్దుల్ ఠాకుర్, మురళీ విజయ్, ఛేతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీ.
ఇంగ్లాండ్: జో రూట్(కెప్టెన్), మోయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో(వికెట్), స్టూవర్ట్ బ్రాడ్, జోస్ బట్లర్, అలస్టేర్ కుక్, సామ్ కుర్రన్, కీటన్ జెన్నింగ్స్, ఓలి పోప్, జమీ పోర్టర్, ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్.