Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

కార్తీక మాసం… ప్రతి రోజూ పుణ్య ప్రదమే!

Shiva devotees that Karthi month is greatest of Eshwara

పౌర్ణమి నాడు కృత్తికాయ నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీకమాసమని పేరు.  అటు హరికీ ఇటు హరుడికీ, మరోపక్క వారిద్దరి తనయుడైన అయ్యప్పకీ కూడా ప్రీతి పాత్రమైన మాసమిది. తులసి  పూజలు, వనభోజనాలు, సమారాధనలు, ఉపవాసాలు, అభిషేకాలు, సహస్రనామ పారాయణలతో  జనాలు తన్మయత్వం పొందుతుంటారు. కార్తీకమాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు, స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవివే. నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమరాధనలు  ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీక మాసంలో శ్రీ మహా విష్ణువు చెరువులలో, దిగుడు బావులలో,పిల్ల కాలువలలోనూ నివసిస్తారు. అందుకే ఈ మాసంలో వాపీ,కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగ, యమున, గోదావరి,కృష్ణ, కావేరి,నర్మద, తపతి, సింధు మొదలయిన నదులన్నింటి నీరూ ఉందన్న భావనతో స్నానం చేయాలి. 

కార్తీక మాసం విష్ణుస్వరూపమని విష్ణు భక్తులు కాదు ఈశ్వరార్చనే గొప్పదని శివభక్తులు భావిస్తారు. ఒకరకంగా వారిద్దరి వాదనా సరైనదే. ఎలాగంటే ఈ మాసం శివకేశవులిద్దరికీ ప్రీతి పాత్రమైనదే.

శివకేశవానుగ్రహ ప్రాప్తిరస్తు: ఈ మాసంలో ఇలా పూజించాలి కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీమహావిష్ణువును తులసీదళాలతో, కమలాలతో పూజిస్తే జీవించిన వాళ్లూ ధనానికి లోటు లేకుండా ఉండి, సమస్త సౌఖ్యాలు కలుగుతాయట. అదే విధంగా ఆరుద్ర నక్షత్రం రోజున మాసశివరాత్రినాడు, సోమవారం నాడు, కార్తీక పౌర్ణమి నాడూ రుద్రాభిషేకం చేసి, బిల్వదళాలతోనూ, రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో బాటు అత్యంతమున శివసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది. ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేనివారు కనీసం ఏకాదశి,ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారం నాడయినా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం సాక్షాత్తూ ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదట! కార్తీక పౌర్ణమినాడు పగలంతా ఉపవాస ముండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలూ భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అత్యంతలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాధలు, ఇతివృత్తాలు,ఉపకథలను బట్టి తెలుస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం,కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకునే వ్రతాలు.

విశిష్టఫలాలనిచ్చే వన సమారాధన: మామూలు రోజుల్లో గడపదాటి వెళ్లని వారు సైతం కార్తీక మాసంలో వన సమారాధనలో పాల్గొంటారు. వన సమరాధనలో ఉసిరిగ చెట్టు నీడన సాలగ్రామ రూపంలో శ్రీహరిని పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధన చేసిన వారిని యముడు కన్నెత్తి కూడా చూడలేని కార్తీక పురాణం బోధిస్తుంది. వన భోజనం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాయుజ్యం పొ ందుతారు. కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో, పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలగడంతో పాటు హోమం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు, దేవతార్చన సమయంలో,పితృతర్పణ సమయంలో, భ్రష్టులు,ఛండాలురు, సూతకం ఉన్న వాళ్ల మాటలు వినడం వల్ల కలిగే పాపాలు తొలగుతాయి.

ఈ మాసంలో ఇవి చేయకూడదు: తామసం కలిగించే ఉల్లి,వెల్లుల్లి,మద్యం మాంసం జోలికి పోరాదు. ఎవ్వరికీ ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవదూషణ తగదు. దీపారాధనలకు తప్ప నువ్వుల నూనెను ఇతరత్రా అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగు పెట్టుకుని స్నానం చేయరాదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు.

ఇవి చేస్తే మంచిది: ఈ మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం,దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. విష్ణువుకు తులసి దళాలు,మల్లె,కమలం జాజి, అవిసెపువ్వు,గరిక, దరలతోను, శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్పించిన వారికి ఇహపర సౌఖ్యాలతో బాటు ఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేని వారు ఉదయం స్నానం జపం, దేవతారాధన యధావిధిగా చేసి మధ్యాహ్నభోజనం చేసి, రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు, పళ్లు తీసుకోవచ్చు.

సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత?: కార్తీకంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది. సోమ అంటే చంద్రుడు. శివని లింగ సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. అదీగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే భక్తులు ఈ మాసంలో సోమవారాలలో భక్తి శద్ధ్రలతో శివుణ్ణి ఆరాధిస్తారు. “హర హరశంభో” అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి సాగరంలో ఓలాలా గతారు. సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించడం వల్ల సిరిసంపదలతో, సుఖ సౌఖ్యాలతో, ఆనందోత్సాహాలతో వర్ధిల్లుతారని విశ్వాసం.

 ఏ తిథిన ఏం చేస్తే మంచిదో తెలుసుకుందాం…
కార్తీక శుద్ధ పాడ్యమి: తెల్లవారు జామునే లేచి స్నానం చేసి,అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికెళ్ళి,“నేను చేయదలుచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించ” మని ప్రార్ధించి సంకల్పం చెప్పుకుని ఆకాశ దీపాన్ని సందర్శించు కోవాలి.

విదియ: ఈరోజు సోదరి ఇంటికెళ్లి ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి.

తదియ: అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి.

చవితి: కార్తీక శుద్ద చవితిః నేడు నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టలో పాలు పోయాలి.

పంచమి: దీనికి జ్ఞాన పంచమి అని పేరు. ఈ రోజు సుబ్రహ్మణ్య ప్రీత్యర్థం అర్చరనలు చేయించుకున్నావారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది.

షష్టి: నేడు బ్రహ్మచారికి ఎర్రగళ్ల కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి.

సప్తమిః ఈ రోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దాన మివ్వడం వల్ల ఆయుష్షు వృద్ధి అవుతుంది.

అష్టమి: ఈగోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితానిస్తుంది.

నవమిః నేటి నుంచి మూడు రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి.

దశమి: ఈ రోజు రాత్రి విష్ణుపూజ చేయాలి.

ఏకాదశిః ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఈరోజు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి.

ద్వాదశి: ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి, నేటి సాయంకాలం ఉసిరి మొక్క,తులసి మొక్కల వద్ద దామోదరని ఉంచి పూజ చేసి, దీపాలు వెలిగించడం సర్వరూపాలనూ నశింపచేస్తుంది.

త్రయోదశి: ఈ రోజు సాలగ్రామ దానం చేయడం వల్ల సర్వకష్టాలూ దూరమవుతాయి.

చతుర్దశి: పాషాణ చతుర్దశి వ్రతం చేసుకునేందుకు నేడు మంచిది.

కార్తీక పూర్ణిమ: మహా పవిత్రమైన ఈ రోజు నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వ పాపాలూ ప్రక్షాళనమవుతాయి.

కార్తీక బహుళ పాడ్యమి: ఈ రోజు ఆకు కూర దానం చేస్తే శుభం

విదియ: వనభోజనం చేయడం విశేష ఫలాలనిస్తుంది.

తదియ: పండితులకు, గురులకు తులసి మాలను సమర్పించడం వల్ల తెలివి తేటలు వృద్ధి అవుతాయి.

చవితి: పగలంతా ఉపవసించి, సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి, ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలూ కలుగుతాయి.

పంచమి: చీమలకు నూకలు చల్లడం,శునకాలకు అన్నం తినిపించడం శుభఫలితాలనిస్తుంది.

షష్ఠి: గ్రామదేవతలకు పూజ జరిపించడం మంచిది.

సప్తమి: జిల్లేడు పూలతోగుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి.

అష్టమి: కాలభైరవాష్టకం చదివి గారెలతో దండచేసి, కాలభైరవానికి (కుక్కకు) సమర్పించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది.

నవమి: వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దాన మిస్తే పితృదేవతలు తరిస్తారు.

దశమి: నేడు అన్న సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై, కోరికలు తీరతాయి.

ఏకాదశి: విష్ణాలయంలో దీపారాధన, పురాణ శ్రవణం,పఠనం, జాగరణ విశేషఫలప్రదం.

ద్వాదశి: అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించడం శుభప్రదం.

త్రయోదశి: నవ గ్రహారాధన చేయడం వలగ్రహదోషాలు తొలగుతాయి.

చతుర్దశి: ఈ మాస శివరాత్రినాడు చేసే ఈశ్వరార్చన, అభిషేకం అపమృత్యుదోషాలను, గ్రహబాధలను తొలగిస్తాయి.

అమావాస్య: నేడు పితృదేవతల పేరిట అన్నదానం లేదా ఉప్పు పప్పుతో కూడిన సాంబారాలను దానం చేయడం వల్ల పెద్దలకు బాధ తొలగి, స్వర్గసుఖాలు కలుగుతాయి.

Shiva devotees that Karthi month is greatest of Eshwara

Telangana Latest News

Comments

comments