Search
Tuesday 20 November 2018
  • :
  • :

శివసేన ఆగడాలు

shiv-sen-1మహారాష్ట్ర ప్రజలందరి తరఫున మాట్లాడే హక్కును తనకు తాను సొంతం చేసుకున్న శివసేన ఆగడాలు మితిమీరుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దౌర్జన్యకాండను ఆయుధంగా ప్రయోగించిన శివసేన, ఇప్పుడు అధికారంలో భాగస్వామిగా బెదిరింపులకు పాల్పడుతోంది. తమ మిత్రపార్టీ బిజెపి ప్రజలు ఏమితినాలో, ఏమి తినకూడదో, ఏమి రాయాలో, రాయకూడదో, ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదో ఆదేశిస్తుంటే, శివసేన ఏమి వినాలో, వినకూడదో, ఏమిచదవాలో, చదవకూడదో హుకుం జారీ చేస్తున్నది. మొన్నటికి మొన్న, పాకిస్తానీ గజల్ గాయకుడు గులాం ఆలీ సంగీతకచ్చేరీని ముంబయిలో రద్దు చేయించిన శివసేన, తాజాగా పాకిస్తాన్ మాజీ విదేశాంగమంత్రి కుర్షీద్ మహమ్మద్ కసూరీ గ్రంథావిష్కరణను నిలుపుచేయబోయి భంగపడింది. అయితే ఆ సభ ఏర్పాటు చేసిన ‘అబ్జర్వర్ రీసెర్చిఫౌండేషన్’ (ఒఆర్‌ఎఫ్) ఛైర్మన్ సుధీంద్ర కులకర్ణి ఇంటినుంచి బయలుదేరుతుండగా, శివసైనికులు ఆయన నెత్తిపై సిరా కుమ్మరించి తమ ఉనికిని చాటుకున్నారు. ఆయన అలాగే సభకు వచ్చి వారి అనాగరిక ధూర్త ప్రవర్తనను యావద్దేశానికి, ఆ మాటకొస్తే విదేశాలకు కూడా టివి ఛానళ్లద్వారా ప్రదర్శించారు. పరువు-మర్యాదలు, సభ్యత-సంస్కారం అనేవి ఉండే వాటిని కోల్పోయింది శివసేన తప్ప కులకర్ణి కాదు. కులకర్ణి సాదాసీదా వ్యక్తికాదు. తొలి ఎన్‌డిఎ ప్రభుత్వకాలంలో ప్రధాని వాజ్‌పేయికి ప్రసంగలేఖకునిగా, హోంమంత్రి ఎల్‌కె అద్వానీకి వ్యూహకర్తగా పనిచేశారు.
హిందూమతోన్మాదమే సిద్ధాంతంగాగల శివసేన ఆగడాలు కొత్తేమీకాదు. పాకిస్థాన్ వ్యతిరేకతను అది తన ఎజండాకు ఆలంబన చేసుకుంది. పాకిస్థాన్ సరిహద్దుల్లో టెర్రరిస్టు చర్యలు ఆపేవరకు ఆ దేశంతో, దేశీయులతో సంబంధాలు కూడదన్నది దాని మొరటు వాదన. క్రీడలు, సంగీతకచ్చేరీలు, సినిమాలు, మేధావుల రాకపోకలు, వర్తకవాణిజ్యాల ద్వారా భారత-పాకిస్థాన్ ప్రజలమధ్య సంబంధాల మెరుగుదల పరస్పర అవగాహన పెంపుదలకు, సంబంధాల అభివృద్ధికి దోహదం చేస్తాయనేది దౌత్యంలో ఒక మార్గం. సరిహద్దుల్లో ఉద్రిక్తతల వల్ల ఈ ఆదాన ప్రదానాలకు తరచూ విఘాతం జరుగుతున్న మాట యదార్థం. అయితే పాకిస్థాన్‌తో సంబంధాల మెరుగుదలకు, ద్వైపాక్షిక సంబంధాలకు మార్గాలను అన్వేషించేది, విధాన నిర్ణయాలు చేసేది భారతప్రభుత్వం తప్ప ఏ ప్రాంతీయ, ఉపప్రాంతీయ రాజకీయ పార్టీనోకాదు. కాని తన పిచ్చి తనకు ఆనందం అనుకునే శివసేనకు ఇదేమీ పట్టదు. దాని ఆగడాలను ఎప్పటికప్పుడు అణచివేయడానికి, ప్రజల్లో దాన్ని ఎండగట్టటానికి పాలకపార్టీలు ఎన్నడూ గట్టి ప్రయత్నం చేయకపోవటం దురదృష్టకరం.
సరిహద్దులో పాకిస్థానీ సైనికుల కాల్పులకు భారత జవాన్‌లు చనిపోతుంటే, ఇక్కడ పాకిస్థానీయుని సంగీతం వింటారా అని అది గులాం ఆలీ కచ్చేరి నిర్వాహకులను హెచ్చరించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నావిస్ రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చినా, ఆయన మాటకన్నా శివసేన హుకుం పర్యవసానం తెలిసిన నిర్వాహకులు ఆ కచ్చేరీని రద్దుచేశారు. కాగా శివసేన దురహంకారాన్ని ఖండించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిసెంబర్‌లో కచ్చేరీకి ఢిల్లీ రావల్సిందిగా గులాం అలీని ఆహ్వానించారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆలీని కోల్‌కతా ఆహ్వానించారు. తద్వారా భారతదేశం అంటే శివసేన కాదని స్పష్టం చేశారు.
ఇదిలావుండగా, జనరల్ ముషారఫ్ పాలనలో విదేశాంగమంత్రిగా పనిచేసిన కె.ఎం.కసూరి, “డేగను కాను – పావురాయిని కానుః పాకిస్థాన్ విదేశాంగ విధానం గూర్చి ఒక ఆంతరంగికుని భోగట్టా” పేరుతో ఒక పెద్ద గ్రంథం రచించారు. ఆయన మనసువిప్పి దాపరికం లేకుండా అన్నీ వాస్తవాలే చెప్పారా ( ఆ దేశ ఆంతరంగిక పరిస్థితుల్లో పూర్తి సత్యాలు చెప్పి ఉంటారని భావించలేము) లేదా అన్నది భారతీయులకు, ముఖ్యంగా ఇరుదేశాల వివాదాల్లో సన్నిహితంగా పనిచేసినవారికీ, పాకిస్థాన్ పరిశీలకులకు ఆసక్తిదాయకం. వాజ్‌పేయి ప్రభుత్వంలో సన్నిహితంగా పనిచేసిన సుధీంద్ర కులకర్ణి భారత్‌లో ఆ గ్రంథావిష్కరణకు చొరవ తీసుకున్నారు. కసూరీ స్వయంగా విచ్చేశారు. ఆ సభపట్ల తమ నిరసన ఉంటుందని ముందే ప్రకటించిన శివసేన కులకర్ణిపై సీరాపోసి తమ దిగజారుడుతనాన్ని వెల్లడించుకుంది.
ఇటువంటి అరాచక చేష్టలు ఈ శక్తులకు కొత్త కాదు. 2003 డిసెంబర్‌లో,భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ జరగాల్సిన ఆగ్రా స్టేడియంలో దొంగచాటుగా చొరబడి పిచ్ తవ్వేశారు. 2005 ఏప్రిల్‌లో, వారి విద్యార్థి విభాగం ఢిల్లీలో భారత-పాకిస్థాన్ ఒకరోజు క్రికెట్ ఆటకు అంతరాయం కలిగించింది.2009, నవంబర్ 20న బాల్‌థాక్రేను విమర్శించినందుకు ముంబయిలో ఒక టివి ఛానల్ ఆఫీసుపై దాడి చేశారు. బాల్‌థాక్రే మరణించిన రోజున బలవంతంగా హర్తాళ్ పాటించారన్న ఫేస్‌బుక్ పోస్టింగ్‌ను ‘లైక్’ చేసినందుకు, శివసేన ఫిర్యాదును శిరసావహించిన మహారాష్ట్ర పోలీసులు ఇరువురు యువతులను అరెస్టు చేశారు. దీనిపట్ల దేశవ్యాప్త నిరసన తదుపరి చెంపలేసుకున్నారు.
శివసేన తాజా ఆగడాలను మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాధినేతగా ఉన్న బిజెపి ఖండించాలి. కేంద్రప్రభుత్వం నుంచి గట్టి హెచ్చరిక జారీ కావాలి. బిజెపి అటువంటి చొరవ ప్రదర్శిస్తుందా?

Comments

comments