Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

గంగాదేవి

Shiva1

గంగాదేవికి జన్మనిచ్చిన తండ్రే గాని తల్లి ఉన్నట్టు ఏ పురాణాల్లో కూడా మనం చదవలేదు. అయితే, విష్ణుపాదాల నుంచి గంగ ఉద్భవించిందని కథగా చెప్పుకుంటాం. ఒకరోజు హిమాలయాల మీద నారదమహర్షి నారాయణ నారాయణ అంటూ నడుస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ నారదునికి స్త్రీలు, పిల్లలు ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. నారదుడికి ఆశ్చర్యంవేసి వారి వైపు వెళ్లాడు. అక్కడ ఎందరో స్త్రీలు, పిల్లలు ఏదో ఒక అవయవ లోపంతో ఏడుస్తూ కనిపించారు. ‘మీకీ అవయవ లోపాలేంటి..మీ రోదనలకు కారణమేమిటి? ’ అని వారిని ప్రశ్నించాడు నారదుడు. అప్పుడు వారు ‘నారదా.. మేము రాగాధి దేవతలం. వీరంతా మా పిల్లలు. భూలోకంలోని మానవులు సంగీత సాధన చేస్తున్నప్పుడు రాగసంకరం జరిగినా., అపస్వరం దొర్లినా., మాకిలా అవయవ లోపాలు ఏర్నడతాయి’. అని చెప్పారు. ‘మీకీ అవయవ లోపం పోయే మార్గం లేదా’ అని నారదుడు వారిని తిరిగి ప్రశ్నించాడు. ‘ఉంది. ఎవరైనా సంగీతశిఖామణి తన దివ్య గానంతో మా రాగాలను సుస్వరయుక్తంగా ఆలాపిస్తే.. మాకీ అవయవలోపం పోతుంది’ అని వారు అన్నారు.

అప్పుడు నారదుడు ‘ఈ సృష్టిలో నాకన్న గొప్ప సంగీతశిఖామణి ఎవరున్నారు..నేను మీ అవయవలోపాన్ని సరిచేస్తాను’ అన్నాడు. నారదుడు తన మహతిని శృతిబద్ధం చేసి 72 మేళకర్త రాగాలనూ.. వాటి జన్యురాగాలనూ ఆలాపించాడు. కానీ ఎవ్వరికీ అవయవలోపం సరికాలేదు. అప్పుడు వారు ‘నారదా.. మా అవయవలోపాన్ని సరిచేసే సంగీత ప్రతిభ మీకేకాదు….సకలకళామతల్లి అయిన ఆ సరస్వతీదేవికే లేదు’ అన్నారు. పరమశివుడు ఇక్కడకు వచ్చి తన గానమాధుర్యంతో రాగసంచారం చేసినప్పుడే మా అవయవలోపం పోతుందని వారు చెబుతారు. వెంటనే వారి దగ్గరి నుంచి నారదుడు కైలాసం వెళ్లి ఆ రాగాధి దేవతల విషయం శివునికి విన్నవించాడు. అంతావిన్న శివుడు ‘నేను తప్పకుండా వారి దగ్గర సంగీత కచేరీ చేసి వారి అవయవ లోపాలను సరిచేస్తాను.

అయితే..నా సంగీతాన్ని విని అర్థం చేసుకుని ఆనందించి నన్ను ప్రశంసించే ఉత్తమ శ్రోత రావాలని ఆ శ్రోత ఆ శ్రీహరేనని అన్నాడు శివుడు. వెంటనే నారదుడు వైకుంఠం వెళ్లి సంగతంతా చెప్పి…పరమశివుని సంగీత కచేరి వినడానికి శ్రీహరిని ఒప్పిస్తాడు. ఇక, సంగీత కచేరీ ఆ రాగాది దేవతల ముందు ప్రారంభమైంది. పరమశివుని గానంలో 72 మేళకర్తలు, వాటి జన్యరాగాలు జవజీవాలు సంతరించుకొని స్వర సంచారం చేస్తున్నాయి. వాటి మహిమవల్ల రాగాది దేవతల అవయవాల లోపాలు చక్కబడి వారి వారి లోకాలకు వెళ్లిపోతున్నారు. పరమశివుని గంధర్వ గానానికి శ్రీమహావిష్ణువు ఆనంద రసమయ లోకాలలో విహరిస్తూ… పరవశించిపోతున్నాడు. ఆయన హృదయానందమే జలరూపంధరించి ఆ శ్రీహరి కుడికాలి బొటనవేలు నుండి బయటకు ప్రవహించింది. అది గమనించిన బ్రహ్మదేవుడు తిరిగి అలాంటి అవకాశం లబించదని ఆ పవిత్ర జలాన్ని తన సువర్ణ కలశంలో భద్రపరిచాడు. అలా విష్ణుపాదోద్భదగా గంగ జన్మించింది. ఆ తర్వాత కాలంలో భగీరధుని కోరిక మేరకు పరమశివుని శిరసుపై ఉరికి, అక్కడి నుంచి నుంచి బిందు సరసులోకి దూకి, గంగానదిగా అవనిపై ప్రవహించింది అని పురాణగాథ.

Comments

comments