Home ఎడిటోరియల్ మోడీ దెబ్బకు కంగుతిన్న శివసేన!

మోడీ దెబ్బకు కంగుతిన్న శివసేన!

Modi-and-Nawazప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈమధ్య హఠా త్తుగా కళ్లు బైర్లుకమ్మే పని ఒకటి చేశారు. ఉన్నఫళంగా, మిన్ను మీద పడినట్లుగా పాకిస్థాన్‌ను శత్రుదేశంగా పరిగణించే బిజెపికి, దాని గొడుగు క్రింద ఉండే ఇతర రాజకీయ పార్టీల కళ్ళుకప్పి భారతదేశ ప్రధాని నరేంద్రమోడీ పాకిస్థాన్‌లో దిగారు! ప్రధానిగా మొదటిసారిగా పాకిస్థాన్‌కు ఇలా రహస్యంగా వారి మిత్ర-రాజకీయ కూటమి కళ్ళలో దుమ్ము-కారం జల్లి మరీ వెళ్లడంలో ఆంతర్యమేమిటో బోధపడడం లేదు! ఏమిటా అంత అత్యవసరమైన రాజకీయం!? అన్నది అందరికీ వచ్చిన సందేహం. ఈ హైడ్రామా వల్ల భారత్-పాకిస్థాన్ దౌత్య సంబంధాల మెరుగుదలకు మార్గం సుగమం అయిందంటే ఓ విధంగా ఆనందించాల్సిందే! లోగడ జరిగిన మామిడిపండ్ల బహుమతులు, క్రికెట్, కళాకారుల, సాహిత్యకారుల రాకపోకలు ఓ వైపు ఉండగా మోడీగారి ఆకస్మిక ప్రయాణం మరోవైపు అని అనుకొందాం! ఒకవేళ వారనుకున్నది సాధిస్తే!? ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించి ఎలాంటి షెడ్యూల్ లేకుండా అధికార పర్యటనలో ఉండగా, ఆప్ఘనిస్థాన్ నుంచి పాకిస్థాన్‌కు వెళ్లడం సరైన పద్ధతియేనా? భారత వాయుసేనకు చెందిన ప్రత్యేక బోయింగ్ 737 విమానంలో లాహోర్‌కు వెళ్లిన మన ప్రధాని నరేంద్రమోడీ విషయం చిన్నదే అయినా పెద్ద పెద్ద రాజకీయ మస్తిష్కాలలో ఎన్నో ప్రశ్నలు జనించకపోలేదు.

మోడీ లాహోర్ పర్యటనను రహస్యంగా ఉంచడంలో గల మర్మం ఏమిటో? భద్రత కారణంగా అలా చేయాల్సి వచ్చిందనే సాకు హర్షించదగినదే. కానీ అంత ప్రాణాంతకరమైన ప్రయాణం లేదా చర్చలు ఎంతవరకు సమంజసం? కొన్ని వారాల క్రితమే శివసేన మంకుపట్టు వల్ల ముంబయిలో జరపదలచుకున్న ప్రసిద్ధ ఘజల్ గాయకుడు గులాం అలీ గానకచేరీని, ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ ఆటలను విరమించుకున్నారు. పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి పుస్తక ఆవిష్కరణ ఇండియాలో జరుపుకోగా తప్పుపట్టారు. ఈ కార్యక్రమానికి సారధి వహించిన వారి మొహానికి సిరా పులిమారు. ఇలాంటి నీచ వ్యక్తిత్వం గలవారు, పాలక కుటుంబంలో బిజెపిపై పెత్తనం చెలాయిస్తూ ఉన్నవారికి మోడీ చర్య మింగుడు పడేనా? వారి చేష్టలు జీర్ణమయ్యేనా? లోగుట్టు పెరుమాళ్ళకెరుకా! కొత్తగా, తాజాగా శివసేన ఓ చిన్న కూత ఒకటి కూసింది! నాలాంటి జన సామాన్యానికి కొరుకుడు పడని సందేహాలున్నాయి అందులో. శివసేన చెప్పినట్లు రాముడు అంటరానివాడు ఎప్పట్నుంచి అయ్యాడు? రాముడిని విముక్తి కలిగించడమేమిటి? వారిని బంధించినదెవరు? వారికి బందీఖానా ఏమిటి? శివసేన మాటలకు భావమేమిటో అర్ధం కావడం లేదు.

వీరు, శివసేన, దేనికైనా తగినోళ్ళని నిరూపించడానికి రామున్ని అంటరాని వాడిగా వర్ణించారు! మరోవిధంగా చెప్పుకోవాలంటే అంతరానితనం సదా హరితంగా ఉంచాలనే వీరి దృఢసంకల్పం అదేనని తేటతెల్లమవుతుంది. శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’లో పేర్కొన్న సంపాద కీయం దీన్ని బలపరుస్తుంది. 2017లో ఉత్తరప్రదేశ్ లో రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో రామమందిరం వివాదాన్ని తెరలేపడానికి చేస్తున్న ప్రయత్నం కాబోలు! ఒకవైపు మోడీ పాకిస్థాన్ పర్యటన, మరోవైపు రామ మందిరం గొడవ శివసేన అండ్ గ్రూపు వారికి ఇబ్బందికరంగా ఉన్నట్లు కన్పిస్తోంది. పైభాగాన్ని పక్కకుపెడితే…, శివసేన కళ్ళు కప్పి మన దేశ ప్రధాని చల్లగా, చప్పుడులేకుండా, ఆకస్మికంగా పాకిస్థాన్ పర్యటనకు బయలు దేరి అక్కడి ప్రధాని నవాజ్ షరీఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పి, వారి మనుమరాలు పెండ్లిలో పాల్గొని ఆశీర్వదించి, కొన్ని గంటలలోనే తిరిగొచ్చారు. మరి శివసేన అండ్ గ్రూప్ వారి గుండెల్లో మ్రోగిన గంటల సవ్వడి ఏ స్థాయిలో వుందో రాబోయే రోజులలో తెలిసిపోతుంది! ఏదిఏమైనా, మోదీ లాహోరు చేరుకున్నది డిసెంబర్ 25న. ఆ రోజు క్రిస్టమస్ పండుగ, నవాజ్ షరీఫ్ జన్మదినం.

పాకిస్థాన్ జాతిపిత మహహ్మద్ ఆలీ జిన్నా జయంతి కూడా. ఇవన్నీ కలిసొచ్చాయి. ఈ త్రికోణంలో జరిగిన మోడీ పాకిస్థాన్ ప్రయాణం ఎలాంటి పర్యవసానాన్ని తీసుకొస్తుందో వేచి చూడాలి! శుభదినంగా, ఓ రోజు అటు ఇటుగా ముస్లిమ్‌ల ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు కూడా జరిగింది. కొన్ని కొస మెరుపులు ః ఎవరి తల్లి అయినా మనకూ తల్లియే. తల్లిజాతి, మతం, వర్ణంతో సంబంధం లేకుండా ఉన్న క్రిస్టల్ క్లియర్ లాంటిదనే భారత సంస్కృతిని కొనియాడే రీతిలో మన భారతప్రధాని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తల్లికి పాదాభివందనం చేయడం కొనియాడదగిందే. ‘చేతిలో చెయ్యేసి చెప్పుబావా’ అనే సినీ-పాటను తలపించేలా లాహోర్‌లోని తన నివాసభవనం, ‘జతి ఉమ్రా రైవింద్’లో మోడీకి సాదర స్వాగతం పలికిన షరీఫ్‌గారి ఆతిథ్యం చెప్పుకోదగ్గది.

2004లో నాటి భారత ప్రధాని అతల్ బీహారీ వాజ్‌పేయి పాకిస్థాన్‌లో పర్యటించిన పదకొండు సంవత్సరాల తర్వాత నేటి ప్రధాని మోడీ పాకిస్థాన్ సందర్శనకు అంకురార్పణ చేశారు. రష్యా, ఆప్ఘనిస్థాన్ పర్యటనల తర్వాత పాకిస్థాన్‌లో కొన్ని గంటల ఆకస్మిక ప్రయాణం ఇరు దేశాల మధ్య జరగబోయే భవిష్యత్తు ప్రణాళికలపై కొంత వెలుగును ప్రసరించగలదు. పైగా మోడీ ఈ ఆశ్చర్యకరప్రయాణం భారత్, ముస్లింల కు ఓ రాజకీయ విందులాంటిదే! ఉత్తరప్రదేశ్‌లో రాబోయే ఎన్నికలకు పులిమిన సప్తరంగుల హరివిల్లు అయితే కాదుకదా! అనే అనుమానం ముస్లింలలో లేకపోలేదు. ఇది రాబోయే సమయమే చెప్పగలదు.  amjuali1993@gmail.com