Search
Friday 16 November 2018
  • :
  • :

ప్రకృతి రమణీయం.. శివ్వారం అభయారణ్యం

Nature-Beauty

కనువిందు చేసే మొసళ్ల సంరక్షణ కేంద్రం
పాపికొండలను మరిపించే ప్రకృతి అందాలు
విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్న శివ్వారం అభయారణ్యం
మరింత తీర్చిదిద్దితే గోదావరి తీరంలో పర్యాటక సోయగం

గోదావరి తీరంలో పచ్చనిచెట్లు… గలగల పారే నీటి ప్రవాహాలు ఎటుచూసిన ప్రకృతి పరవశించే అందాలు… గోదావరి ఒడ్డున ఎత్తయిన కొండలు, వీటిని చూస్తే పాపికొండలు గుర్తొస్తాయి. గుట్టల మధ్య లోతుగా మడుగు, గోదావరి ఒడ్డున చారిత్రాత్మక కట్టడాలు, గుహలను చూస్తుంటే ఎంతో ఆహ్ల్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతం ఎక్కడో లేదు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారం అభయారణ్యంలో ఉంది. ఈ ప్రాంతానికి మరో పేరు ఎల్ మడుగు, జైపూర్ మండలంలోని శివ్వారంలో ప్రకృతి సిద్ధ్దంగా ఏర్పడినది. విదేశీ పర్యాటకులను సైతం విపరీతంగా ఆకర్షిస్తోన్న ఈ మొసళ్ల మడుగు గోదావరి నదిలో మూడు కిలోమీటర్ల వెడల్పులో చెన్నూర్ మండలం వరకు, సుమారు 12 కిలోమీటర్ల పొడువునా వ్యాపించి ఉంది.

మూడు తాటి చెట్ల లోతున ఉన్న మడుగులో మొసళ్లతో పాటు అరుదుగా లభించే నీటి కుక్కలతో పాటు అటవీ ప్రాంతంలో నెమళ్లు, కృష్ణజింకలు, అడవి పందులు సంచరిస్తుంటాయి. చుట్టూ దట్టమైన అడవులు, అడవి మధ్యలో రెండు కొండలు వాటిని ఆనుకొని పచ్చని పొలాలతో ప్రకృతి అందాలను పంచుతోంది. దీనికి తోడు గుట్టపై పురాతన ఆలయాలు, శివలింగాలు, మరింతగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. మండు వేసవిలో సైతం ఇక్కడి మడుగులో నీరు ఉండి చల్లని వాతావరణం కలిగి ఉండడంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులకు తిరిగి వెళ్లాలని అనిపించదు. పర్యాటకుల కోసం ఈ మొసళ్ల మడుగు సమీపంలో గుట్టపై వాచ్‌టవర్ నిర్మించారు. ఈ వాచ్‌టవర్ నుండి ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. అటవీ శాఖ అధికారు పర్యాటకుల కోసం బోటింగ్‌ను ఏర్పాటు చేశారు.

చరిత్రాత్మకం – ప్రత్యేకం……
ఈ ప్రాంతానికి చాలా ప్రత్యేకత ఉంది. 1940 ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణ శాస్త్రవేత్త ఈ ప్రాంతాన్ని సందర్శించి మొసళ్ల మడుగును చూసి దీనిపై అధ్యయనం చేసి ఇక్కడి ప్రాంత విశిష్టతను అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకపోగా ప్రభుత్వం మొసళ్ల మడుగును పునరావాస కేంద్రంగా గుర్తించడం జరిగింది. రాష్ట్రంలో మరెక్కడ మొసళ్ల మడుగులు లేకపోవడంతో శివ్వారం ప్రత్యేకతను సంతరించుకుంది. చుట్టు పక్కల ఎక్కడ మొసళ్ళు లభించినా, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఎల్ మడుగులా వాటికి పునరావాసం కల్పిస్తారు అటవీ శాఖ అధికారులు. ప్రభుత్వం మొసళ్ల మడుగులను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినట్లైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతం ఎంతో విశిష్టతను కలిగినప్పటికీ ప్రచార లోపంతో చుట్టు పక్కల ప్రాంత వాసులకు మాత్రమే పరిమితమైంది.

అభయారణ్యంపై చిన్న చూపు ……
ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన మొసళ్ల మడుగుపై చిన్న చూపును ప్రదర్శిస్తోంది ప్రభుత్వం. ప్రతి యేటా నామమాత్రంగా నిధులు కేటాయిస్తూ చేతులు దులుపుకుంటుంది. ఇక్కడి పాలకులు సైతం దీనిపై దృష్టిని కేంద్రీకరించకపోవడంతో, ఈ ప్రాంత విశిష్టత మరుగున పడిపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు దాటుతుండగా శివ్వారం మొసళ్ల సంరక్షణ కేంద్రంపై దృష్టిని చూపకపోవడంతో ప్రచారం పొందడం లేదు. పర్యాటక శాఖ అధికారులు దీనిపై దృష్టిని కేంద్రీకరించాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లా అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించినట్లయితే పర్యాటక కేంద్రంగా విరాజిల్లే అవకాశాలు ఉన్నాయి.

Comments

comments