Home జిల్లాలు జిల్లా టిడిపికి ఝలక్

జిల్లా టిడిపికి ఝలక్

– టిఆర్‌ఎస్‌లోకి కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్
– వివేక్ దారిలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు
– నియోజక వర్గ ఇన్‌చార్జిల చూపు సైతం కారు వైపే

tdpరంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా తెలుగుదేశం పార్టీకి మరో పెద్ద షాక్ తగిలింది. గ్రేటర్ ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన షాక్ నుంచి తెలుగు దేశం పార్టీ నాయకత్వం కొలుకోక ముందే పార్టీ ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకుంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కొంత వరకు పట్టున్న రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు పార్టీ పరిస్థితి దాదాపు కనుమరుగవుతున్న వాతావరణం కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా టిఆర్‌ఎస్‌లో చేరుతాడని ప్రచారం జరిగిన కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు మంగళవారం ఉదయం టిడిపికి రాజీనామా చేసి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వివేక్ ఇచ్చిన షాక్‌తో జిల్లాలోని పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఖంగుతిన్నాయి. నిన్నటివరకు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పార్టీ ఓడినా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చిన నాయకుడు సోమవారం రాత్రి కెసిఆర్‌తో అపాయింట్‌మెంట్ తీసుకుని ఉదయం పార్టీలో చేరడం సంచలనంగా మారింది. జిల్లా టిడిపిలో ఇప్పటికే మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కూకట్‌పల్లి నుంచి టిడిపి తరపున విజయం సాధించిన తీగల క్రిష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాధవరం క్రిష్ణారావు టిడిపి వదిలి టిఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.
వివేక్ దారిలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు
జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ లేదని గ్రేటర్ ఎన్నికల ఫలితాలు రుజువు చేయడంతో తమ దారి తాము చూసుకోవడానికి టిడిపి బడా నేతలు సన్నద్ధం అవుతున్నారు. మంగళవారం కుత్బుల్లాపూర్ శాసనసభ్యుడు వివేక్ టిఆర్‌ఎస్‌లో చేరడంతో జిల్లా నేతలు మరికొంతమంది ఆదేదారిలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లా టిడిపి అధ్యక్షుడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎల్.బి.నగర్ నియోజక వర్గ పార్టీ ఇన్‌చార్జీ సామల రంగారెడ్డి తో పాటు పలు నియోజకవర్గాల ఇన్‌చార్జీలతో పాటు పలువురు రాష్ట్ర పార్టీ నాయకులు సైతం టిడిపి వదిలి టిఆర్‌ఎస్ చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రకాష్‌గౌడ్‌తో జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి ఇప్పటికే సంప్రదింపులు జరిపి ముహూర్తం ఖరారు చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీతో మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చర్చలు నిర్వహించినట్లు మరో రెండు, మూడు రోజులలో ఇరువురు ఎమ్మెల్యేలు పార్టీలో చేరవచ్చని ప్రచారం జరుగుతున్న నాయకులు మాత్రం అలాంటిదేమి లేదని అందరు చెప్పినట్లే చెపుతున్నారు. గ్రేటర్ ఎన్నికలలో టిడిపి గెలిచిన ఎకైక డివిజన్ కెపిహెచ్‌బి కార్పొరేటర్ శ్రీనివాస్‌రావు సైతం టిడిపి వదిలి టిఆర్‌ఎస్‌లో చేరడానికి సన్నద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతున్న ఆయన మాత్రం దానికి ఖండించారు. జిల్లాలో టిడిపి తరపున గత సార్వత్రిక ఎన్నికలలో 14 స్థానాలకుగాను ఏడు స్థానాలను కైవసం చేసుకుంది. వివేక్ చేరికతో టిఆర్‌ఎస్‌లో చేరిన వారి సంఖ్య నాలుగుకు చేరగా మరో ఇద్దరు ప్రకాష్ గౌడ్, గాంధీలు సైతం అదే దారిలో ఉన్నారు. జిల్లాలో టిడిపి తరపున గెలిచి దాదాపు పార్టీకి దూరంగా ఉంటున్న ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే ఆర్. క్రిష్ణయ్య మాత్రం టిడిపిలో కొనసాగుతున్నారు. తెలుగు దేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి టిడిపిలో కొనసాగుతున్న నాయకులు సైతం ప్రస్తుతం టిఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్ధమవుతున్నారు. కీసర మండలం నాగారం సర్పంచ్ చంద్రారెడ్డి లాంటి వారు సైతం టిడిపి వదిలి పెట్టడానికి సిద్ధమవుతున్నారు.
వలసబాటలోనే పార్టీల అధ్యక్షుడు
జిల్లాలో టిడిపి అధ్యక్షుడిగా పనిచేసిన నాయకులు అంతా ఇతర పార్టీల్లోకి పోవడం అలవాటుగా మారింది. ప్రస్తుతానికి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్న ప్రకాష్‌గౌడ్ టిఆర్‌ఎస్‌లో చేరకపోయిన రెండు మూడు రోజుల్లో పార్టీ వదిలిపోవడం దాదాపు ఖాయంగా మారింది. గతంలో జిల్లా టిడిపి అధ్యక్షుడిగా పనిచేసిన మహేందర్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అంతా పార్టీ అధ్యక్షులుగా ఉన్న సమయంలోనే పార్టీని వదిలి టిఆర్‌ఎస్‌లో తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ప్రకాష్‌గౌడ్ సైతం ఆదే రివాజు కొనసాగిస్తున్నారని ప్రచారం సాగుతోంది