Home జాతీయ వార్తలు కశ్మీర్‌లో ఎడిటర్ కాల్చివేత

కశ్మీర్‌లో ఎడిటర్ కాల్చివేత

 బాడీగార్డ్ కూడా …   ఆఫీసు ముందే కాల్పులు

Editor

శ్రీనగర్ : కశ్మీర్‌లో ప్రముఖ జర్నలిస్టు, రైజింగ్ కశ్మీర్ ప్రధాన షుజాత్ బుఖారీని , ఆయన వ్యక్తిగత అంగరక్షకుడిని గుర్తు తెలియని సాయుధులు కాల్చి చంపారు. ఈ ఘటన శ్రీనగర్‌లోని పత్రిక కార్యాలయం వెలుపలనే గురువారం జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. 50 ఏళ్లు ఉన్న బుఖారీ స్థానిక ప్రెస్ ఎన్‌క్లేవ్‌లోని పత్రికా కార్యాలయం నుంచి వెళ్లిపోతున్న సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. నగరం మధ్యలో ఉండే లాల్ చౌక్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జర్నలిస్టు ఇఫ్తార్ విందుకు బయలుదేరి వెళ్లుతుండగా కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు.

ఎప్పుడూ ఆయనకు రక్షణగా ఉండే భద్రతా సిబ్బందిలో ఒక బాడీగార్డు కాల్పుల్లో చనిపోయినట్లు, ఇదే క్రమంలో ఒక పౌరుడు, పోలీసు గాయపడినట్లు తెలిపారు. రంజాన్ పండుగకు ముందు రోజు జరిగిన ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడైంది. బుఖారీ హత్య పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదం మరోసారి తన వికృత రూపం చూపిందని , ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటన వెలువరించారు. హత్యకు గురయిన బుఖారీ గతంలో హిందూ ఆంగ్ల దినపత్రిక కశ్మీర్ కరస్పాండెంట్‌గా ఉన్నారు. తరువాత సొంతంగా పత్రిక స్థాపించుకున్నారు.

ఐజెయు ‘రైజింగ్ కశ్మీర్’ ఎడిటర్ షుజాత్ బుఖారీ కాల్చివేతను ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజెయు) తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం వెంటనే నిందితులను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని, జమ్మూ కశ్మీర్‌లో జర్నలిస్టులు, ఎడిటర్‌లను కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఐజెయు అధ్యక్షులు ఎస్.ఎన్.సిన్హా, సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఉపాధ్యక్షులు సబీనా ఇంద్రజిత్ ఒక ప్రకటన విడుదల చేశారు.