Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ప్రసూతి ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత

gandhi-hospitals

అన్నింటికీ నిలోఫర్, గాంధీనే దిక్కు
అత్యవసర చికిత్సకు దూరమవుతోన్న నవజాత శిశువులు
ఆందోళన చెందుతున్న కుటుంబసభ్యులు

మన తెలంగాణ/సిటీబ్యూరో : నగరంలో నాలుగు పెద్ద ప్రసూతి ఆసుపత్రులు, ఐదు ఏరియా ఆసుపత్రులు, మరో ఆరు ప్రాంతీయ ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో రెండు పెద్ద ఆసుపత్రులు మినహా మిగతా వాటిల్లో పిల్లల వైద్యులు లేరు. దీంతో నవజాత శిశువులకు అత్యవసర వైద్యం కావాలంటే నిలోఫర్, గాంధీకి పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. రోజుకు 120నుంచి 140 వరకు ప్రసవాలు జరిగే ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో పిల్లల వైద్యులు 24గంటలు అందుబాటులో ఉండటంలేదు. అత్యవసర చికిత్స అందించడానికి పిల్లల విభాగాలు కూడా ఏర్పాటు చేయలేదు. పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి, సుల్తాన్‌బజార్ మెటర్నటీ ఆసుపత్రుల్లో 24గంటల పాటు పిల్లలకు వైద్య సేవలు అందించేందుకు వైద్యులు లేరు. ఈ రెండు ఆసుపత్రుల్లో కలిసి నిత్యం 90నుంచి 100మంది శిశువులు జన్మిస్తుంటారు. అందులో కనీసం 40మంది శిశువులు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో జన్మిస్తారు. ఇక 5 స్థానిక ప్రసూతి ఆసుపత్రుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ ఆసుపత్రుల్లో రోజుకు 50నుంచి 70వరకు ప్రసవాలు జరుగుతాయి. ఇక మలక్‌పేట్, కింగ్‌కోఠి, గోల్కొం డ, శాలిబండ, నాంపల్లి, బార్కాస్‌లోని ఏరియా ఆసుపత్రుల్లో రోజుకు వంద వరకు ప్రసవాలు జరుగుతుంటాయి.
మధ్యాహ్నం వరకే
పేట్ల బురుజు ప్రసూతి ఆసుపత్రిలో పిల్లలకు ఉదయం మాత్ర మే చికిత్సలు అందిస్తారు. మధ్యాహ్నమైందంటే వైద్యులు దొరకరు. ఆ సమయంలో ఏదైనా చికిత్స అవరమైతే నిలోఫర్, గాంధీ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఈ ఆసుపత్రిలో రోజు 40వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆసుపత్రిలో కూడా తీరు ఇలాగే కనిపిస్తోంది. ఈ ఆసుపత్రిలో శిశువులకు వైద్యం అందించేందుకు సరిపడా వైద్యులులేరు. దీంతో పిల్లలకు సరైన వైద్యం అందడంలేదు. చికిత్స నిమిత్తం నిలోఫర్‌కు రావాల్సి వస్తోంది.
అనేక అవస్థలు
పిల్లలు పుట్టగానే పలువురు ఎన్నో సమస్యలతో ఉంటారు. అలాంటి సమయంలో వైద్యం అత్యవసరమవుతోంది. మధ్యాహ్నం లోపు అయితే పిల్లల వైద్యులు అందుబాటులో ఉం టారు. కానీ ఆ తరువాత పుట్టిన వారికి ఏదైనా అత్యవరసమైతే నిలోఫర్‌కు పరుగులు తీయాల్సిందే. నిలోఫర్‌కు అన్ని ఆసుపత్రుల నుంచి ఒక్కసారిగా రావడంతో అక్కడ కూడా సరై న వైద్యం అందడంలేదు. దీనికి తోడు నిలోఫర్‌లో వైద్యుల కొర త ఉంది. నవజాత శిశువులకు అత్యవసర చికిత్స సకాలంలో అందకపోవడంతో పలువురు శిశువులు మృత్యువాత పడుతున్నారు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం అన్ని ప్రసూతి ఆసుపత్రుల్లో పిల్లల వైద్యులను 24గంటల పాటు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.
వేధిస్తోన్న నర్సుల కొరత
రోగి ఆసుపత్రికి చేరిన మొదలు మందులు వేయడం వారి ఆలన పాలన చూసుకోవడంలో నర్సులదే బాధ్యత. 24గంటలు కంటికి రెప్పలా చూసేది నర్సులే వార్డులో ఉన్న రోగికి కష్టం వస్తే మొదట ఆదుకునే ప్రయత్నం చేసే వారు నర్సులే. అంతటి ప్రాధాన్యత గల నర్సుల సేవలకు పెద్దాసుపత్రుల్లో కొరత ఏర్పడింది. నిబంధనల మేరకు ఐసీయూ, అత్యవసర విభాగాల్లో 1ః1 నిష్పత్తిలో నర్సులు ఉండాలి కానీ, సుమారుగా 1ః10 నిష్పత్తిలో ఉంటున్నారు. అత్యవసరంలో ఇతర పడకల్లో 1ః4 నిష్పత్తిలో ఉండాలి కానీ, సుమారుగా 1ః15 నిష్పత్తిలో కొనసాగుతున్నారు. ఐసీయూ వెంటిలేటర్ లేని పడకల్లో 1ః2 నిష్పత్తిలో ఉండాలి. కానీ, సుమారుగా 1ః20 నిష్పత్తిలో కొనసాగుతున్నారు. సాధారణ పడకల్లో 1ః6 నిష్పత్తిలో ఉండాలి. కానీ, సుమారుగా 1ః70 నిష్పత్తిలో ఉంటున్నారు. ఆపరేషన్ థియేటర్‌లో ఒక్కో బెడ్‌కు ఇద్దరు నర్సులు ఉండాలి. కానీ, ఒక్కోక్కరు మాత్రమే ఉంటున్నారు. ప్రసూతి వార్డుల్లో ఒక్కో బెడ్‌కు ఒక్కరు ఉండాలి. కానీ, 15బల్లలకు ఒక్కరు ఉంటున్నారు. ఔట్ పేషెంట్ (ఓపి)విభాగంలో రోగుల సంఖ్యకు సరిపడా నర్సులు ఉండాలి. కానీ, రోగుల తాకిడిని బట్టి 1ః150 నిష్పత్తిలో నర్సులు ఉంటున్నారు. అలాగే పిల్లల ఆసుపత్రుల్లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడీయాట్రిక్స్ ప్రకారం 1ః5 నిష్పత్తిలో నర్సులు ఉండాలి. కానీ ఏ ఆసుపత్రిలోనూ ఇలా కనిపించడంలేదు.
ఒక రౌండ్‌తోనే సరి
వైద్యులు వార్డుకొచ్చి రోగుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఇవ్వాల్సిన మందులు, ఇంజెక్షన్లు వంటి వివరాలను ఒకరౌండ్ వేసి కేస్ షీట్‌లో రాసి వెళ్లిపోతారు. మందులు తెప్పించడం, గంట గంటకు టెంపరేచర్ చెక్ చేయడం, అందరికీ సమయం ప్రకారం మందులు, ఇంజక్షన్లు ఇవ్వడం, ఆక్సిజన్ పరిశీలించడం పూర్తిగా నర్సులే చూసుకోవాలి. ఇలా 60 నుంచి 70మందికిపైగా రోగులను కేవలం ఒకే ఒక నర్సు చూడాల్సి ఉంటుంది. ఒక రోగి నుంచి మరో రోగికి టెంపరేచర్ చూసుకుంటూ వెళ్లి తిరిగి అదే రోగి వద్దకు వచ్చే సరికి కాలం గడిచిపోతుంది. ఇక మందులు, ఇంజక్షన్ వంటి వాటిని ఇవ్వడానికి సమయం దొరకడంలేదు.

Comments

comments