Home లైఫ్ స్టైల్ పండుగ దినాల్లో ఆరోగ్యం పదిలం

పండుగ దినాల్లో ఆరోగ్యం పదిలం

Prasadam

హిందూ క్యాలండర్లలో పనిచేసే రోజుల కన్నా పండుగలే ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒక పండుగ. ఏదో ఒక పబ్బం. పండుగ కాకపోతే నోములు, వ్రతాలు, పురుళ్ళు, పుణ్యాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, పుట్టినరోజులు, పెళ్ళిరోజులు, తద్దినాలు, మాసికాలు ఇలా ఏవో ఒకటి ఉంటునే ఉంటాయి. సాధుసంతర్పణలు, సమారాధనలు, అన్నదానాలు జరుగుతునే ఉంటాయి. ఇవికాక వంట్లో ఓపికలేదనో, వీకెండ్ వచ్చిందనో, సరదా పుట్టిందనో హోటళ్ళపై దండయాత్రలు నిత్యకృత్యంగా జరుగుతునే ఉంటాయి. ఎన్ని ఉపవాసాలున్నా, ఎంతగా డైటింగులు చేసినా పండుగలు, శుభకార్యాలు, విందులు, వినోదాలు వచ్చాయంటే చాలు నోరు ఎందుకో ఒకందుకు లాగుతుంది. మనసు పీకుతుంది. నాలికమీద అదుపు తప్పుతుంది. ఎంత వద్దువద్దు అనుకున్న ఆయిల్ తిళ్ళు, సీట్లు, స్పైసీఫుడ్, ఐస్‌క్రీములు, చాట్ వగైరాలన్నీ మాయాబజార్ సినిమాలో ఎస్వీరంగారావు నోట్లోకి ఎగిరిపోయినట్లు వెళ్ళిపోతాయి. తిన్నంతసేపు గుర్తురాని డైటింగ్ తినేశాకా గుర్తుకువస్తుంది. చేయకూడనివన్నీ చేసేసి అప్పుడు బాధపడితే ఉపయోగం ఏమిటి? పైగాఇలాంటి సందర్భాలలో భోజనం విషయంలో నియమాలన్నీ గట్టున పెట్టేసి వాయిలకు వాయిలు లాగించేస్తుంటాం. సాధారణ దినాలలో చేసే వంటకన్నా పండుగనాడు చేసే వంటకం కాలరీల పరంగా చాలా ప్రమాదకరంగా ఉంటాయి. నెయ్యి, నూనె, డాల్డా, వెన్న, పాలు, పెరుగు, చక్కెర వంటివి ఎన్నో ఉపయోగించి స్పెషల్స్ తయారుచేస్తారు. వినాయకచవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పెద్దపండుగలు. ఈ రోజులలో ప్రసాదాలు, పిండివంటలు రోజుల తరబడి అందుబాటులో ఉంటాయి. ఇంట్లో చేసినవేకాక ఎవరి ఇంటికి వెళ్ళినా మర్యాదకొద్దీ ఆఫర్ చేస్తారు. ఇలా హెవీఫుడ్ కన్ను చెదరగొడుతూ ఉంటుంది. ఎంత కాదన్నా, వద్దన్నా బలవంతంగా చేతిలో పెట్టేస్తారు. వాటిని తినలేం పారేయలేం. తినకపోతే మర్యాదపోతుంది. తింటే ఆరోగ్యం పోతుంది. మర్యాదని, ఆరోగాన్ని బ్యాలెన్స్ చేయడం కత్తిమీద సామే! అయినా ఆరోగ్యం మన అవసరం

కనుక ఆఫర్ చేశారు కదా అని మొహమాటపడి లాగించేయకుండా మర్యాదగానే ఎదుటివారు నొచ్చుకోని విధంగా తిరస్కరించడం కూడా నేర్చుకోవాలి. ఒంట్లోకి అదనంగా కాలెరీలు జొరబడకుండా జాగ్రత్తపడాలి. పెళ్ళికి వెళ్ళినా రెండు మూడురోజులు డైట్‌కు గండిపడుతుంది. పైగా ఆరోజులలో వ్యాయామం చేయడానికి, వాకింగ్‌లకు వెళ్ళడానికి అవకాశం కూడా ఉండదు. కళ్ళముందు ఎన్ని స్పెషల్స్ కవ్విస్తున్నా చూజీగానే వ్యవహరించాలి. ఏది తింటే ఎన్ని క్యాలరీలు మనని ముట్టడిస్తాయో గమనించుకుని తినాలి. ఈరోజులలో చాలా రకాల వేడుకలకు బఫేయే ఉంటోంది. కనుక ఎంపిక మీ చేతిలోనే ఉంది. హెవీ మీల్స్, డిజర్ట్స్ రెండూ అందుబాటులో ఉంటాయి. వీలైనంతవరకు డిజర్ట్‌లను వదులుకోవడం మంచిది. ఆ పనిచేయడం మా వల్ల కాదనుకుంటే మీల్స్ తగ్గించాలి. సూపులు, సలాడ్‌లు, వెన్నతీసిన మజ్జిగ, లోఫాట్ పన్నీర్, ఎగ్‌వైట్ వంటివి తీసుకుంటే ఇతర రకాల వంటకాల నుంచి బైటపడడం తేలికవుతుంది. ఆల్‌మండ్స్, వాల్‌నట్స్, చనా, పీనట్స్ తింటూ ఉండడం వల్ల అసలు భోజనం దగ్గర ఆవురావురనే పరిస్థితి ఉండదు. కనుక హెవీగా తినలేరు. స్వీట్లు తినడం తప్పనిసరి అయినపుడు ఏదో ఒక కారణంతో ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోండి. మొహమాటపెట్టి ఎవరైనా స్వీట్లు అంటకడితే వాటిని షేరింగ్ పేరుతో ఇతరులకు పంచేయడానికి ప్రయత్నించండి. నోరు ఆపుకోలేకపోయాక పొద్దున్నే లేచి మార్నింగ్ వాక్‌లనీ, ఈవినింగ్ వాక్‌లనీ, బ్రిస్క్‌వాక్‌లనీ, రన్నింగ్‌లనీ ఎంతచేసినా ప్రయోజనంలేదు.