Home ఎడిటోరియల్ అందరి చూపు అవిశ్వాసం వైపే!

అందరి చూపు అవిశ్వాసం వైపే!

sampadakeyam

నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టిడిపి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు నోటీసు యిచ్చిన అవిశ్వాస తీర్మానాలు సోమవారం నాడైనా చర్చకు వస్తాయా? ఏ పార్టీ అయినా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చినప్పుడు, స్పీకర్ ఆ అంశాన్ని సభలో ప్రస్తావించి ఎందరు బలపరుస్తున్నారని అడిగినపుడు, తీర్మానానికి అనుకూలంగా 50 మందికిపైగా సభ్యులు లేచి నిలబడినపుడు, మిగతా ఎజండాను పక్కనపెట్టి స్పీకర్ దానిపై చర్చను చేపట్టాల్సి ఉంటుంది. అయితే కొన్ని పక్షాలు తమ సమస్యలపై సభలోపల ఆందోళన చేస్తున్నందున, సభ ఆర్డర్‌లో లేదంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం నాడు సభను అర్ధాంతరంగా సోమవారానికి వాయిదా వేశారు. మరి సోమవారం కూడా అదే పరిస్థితి ఉంటే ఏమి చేస్తారు? మళ్లీ వాయిదా వేస్తారా? రూలు నిర్దేశించినట్లు, సభ సంఖ్యాబలంలో 10వ వంతు సభ్యులు స్పీకర్ కోరినపుడు సభలో లేచినిలబడితే తీర్మానంపై వెంటనే చర్చను ప్రారంభించాలి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలతోసహా పలు ప్రతిపక్షపార్టీలు ఇప్పటికే తీర్మానానికి తోడ్పాటు ప్రకటించటంతో అవసరమైన సంఖ్య కన్నా రెట్టింపుకుపైగా మద్దతు స్పష్టమైంది. 54 మంది సభ్యుల సంతకాలతో మరో అవిశ్వాస తీర్మాన నోటీసు స్పీకర్ కార్యాలయానికి అందజేయాలని టిడిపి వ్యూహాత్మకంగా నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును రాజ్యసభలో ఆమోదించే సందర్భంలో కాంగ్రెస్, బిజెపి పరస్పర అవగాహన మేరకు పరిశేష ఎపి వెనుకబాటుతనం నుంచి బయటపడేందుకుగా ను ఐదేళ్లపాటు ‘ప్రత్యేక తరగతి హోదా’ను ప్రభుత్వం ఇస్తుందని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వాగ్దానం చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆ హోదా పదేళ్లపాటు అవసరమన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ హోదాను నిరాకరించింది. విభజన చట్టంలో ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు ఇచ్చిన హామీల్లో అనేకం అమలు చేయలేదు. అట్టి వాగ్దాన భంగానికి నిరసనగా వైసిపి, టిడిపిలు పోటాపోటీ రాజకీయ ఎత్తుగడల్లో మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి వేర్వేరుగా నోటీసులివ్వటం తెలిసిందే.
అవిశ్వాస తీర్మానంపై చర్చ అనంతరం ఓటింగ్ జరిగినా ఎన్‌డిఎ ప్రభుత్వానికొచ్చే ప్రమాదం ఏదీ లేదు. బిజెపికి స్వంతంగా 273 మంది సభ్యులు, ఎన్‌డిఎ పక్షాల సభ్యులు 40 మంది ఉన్నారు. అయితే ఈ తీర్మానం వాగ్దాన భంగ ప్రభుత్వంగా మోడీ సర్కారును నైతికంగా దెబ్బకొడుతుంది. అంతేగాక, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకై ప్రతిపక్ష ఐక్యతకై జరుగుతున్న ప్రయత్నాలకు ఊపు తెస్తుంది. అందువల్లనే శివసేన సహా ఎన్‌డిఎ కూటమి సభ్యులను ఒక్కటిగా ఉంచేందుకు, ప్రతిపక్షాల్లో విభజన తెచ్చేందుకు బిజెపి వ్యూహాలు అమలు జరుపుతోంది. ఎఐఎడిఎంకె అధికార ప్రతినిధి కెసి పళనిస్వామి తమ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని బలపరుస్తుందని (వారి సమస్య వేరే) చెప్పగా, పార్టీ నాయకత్వం ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. తాము తీర్మానాన్ని బలపరచటం లేదని లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ ఎం. తంబిదురై (ఎఐఎడిఎంకె) ప్రకటించటం గమనార్హం. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీ కుంభకోణాన్ని చర్చించాలని కాంగ్రెస్, సుప్రీంకోర్టు ఆదేశించినట్లు కావేరీ జలాల పంపిణీ పర్యవేక్షక బృందాన్ని నియమించాలని ఎఐఎడిఎంకె, ప్రత్యేక హోదా సమస్యపై టిడిపి, వైసిపి సభ్యులు, రిజర్వేషన్‌ల కోటా నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకివ్వాలని, గ్రామీణ ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని టిఆర్‌ఎస్ సభ్యులు 10 రోజులుగా పార్లమెంట్ లోపల, వెలుపల ఆందోళన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల పోరాటానికి సంఘీభావం తెలిపిన టిఆర్‌ఎస్, అవిశ్వాస తీర్మానంపై ఇంకనూ స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. స్పీకర్ అవిశ్వాస తీర్మానం ప్రస్తావించే సందర్భంలో కొన్ని పార్టీలు తమ కోర్కెలపై ఆందోళన కొనసాగించవచ్చు. అయితే అవిశ్వాస తీర్మానం చేపట్టకపోవటానికి అది సాకు కాకూడదు. మోడీ ప్రభుత్వంపై ఇదేతొలి అవిశ్వాస తీర్మానం అయినందున దేశ ప్రజలు ఆసక్తితో గమనిస్తున్నారు.